mt_logo

పరీక్షల వాయిదాపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఇంకో మాటనా: రేవంత్ తీరుపై హరీష్ రావు ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రివి పరిణితి లేని వ్యాఖ్యలు అని మండిపడ్డారు.

నాడు గ్రూప్ 2, టెట్ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ చెయ్యాలని అభ్యర్థులు అడిగితే మద్దతు తెలపలేదా మీరు? అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మీరు ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించడం లేదు? అని అడిగారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరొక మాటనా? ఊసరవెల్లి కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలతో, జీవితాలతో రాజకీయం చేసింది మీరు. అధికారంలోకి వచ్చాక వారి ఆకాంక్షలను పక్కనపెట్టి, నడి రోడ్డున పడేలా చేసింది మీరు అని విమర్శించారు.

డిఎస్సీ పోస్ట్‌పోన్ చేయాలని కోరితే, అడ్డగోలుగా మాట్లాడుతున్నది మీరు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అభ్యర్థులు, నిరుద్యోగులపై ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దౌర్భాగ్యం. పార్టీల బలోపేతానికే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు సన్నాసులు అంటున్న రేవంత్.. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాజకీయం కోసమే వాయిదా కోరారా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

రాత్రి, పగలు కూడా లెక్కచేయకుండా అభ్యర్థులు పోరాటం చేస్తుంటే సానుభూతి చూపాల్సింది పోయి, రాజకీయ విమర్శలు చేస్తున్నారు. సమస్యకు పరిష్కారం చూపకుండా నిందలు మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును, రెండు నాల్కల ధోరణిని ప్రజలందరూ గమనిస్తున్నారు.. తప్పక బుద్ధి చెబుతారు అని పేర్కొన్నారు.