mt_logo

జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పిన సీఎం కేసీఆర్

జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పారు సీఎం కేసీఆర్. సోమవారం గద్వాల జిల్లా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..  పాలమూరు జిల్లా ఒకనాడు చాలా కష్టాలల్లో మునిగిపోయి గంజి కేంద్రాలు పెట్టిన జిల్లా. మనకున్న ఆర్డీఎస్ కాలువను మనకు కాకుండా చేసి గద్దల్లా తన్నుకుపోతే జోగులాంబ తల్లికి దండం పెట్టి జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేపట్టాను. ఆనాడు  పాదయాత్రలో అనేక చోట్ల హృదయవిదారక దృశ్యాలను చూసి కండ్ల వెంట నీళ్ళు పెట్టుకున్నాం. చాలా బాధలు పడ్డాం.అప్పుడు పార్టీ కొత్తది అయినప్పటికీ సభ పెడితే ప్రళయ గర్జనలాగా జనం వచ్చారు. అలా ప్రారంభమైన ఉద్యమం పుణ్యామా అని మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తదనంతరం పరిపాలన సంస్కరణలు చేసుకున్నాం. ఫలితంగానే గద్వాల జిల్లా ఏర్పడిందన్నారు. ఈ రోజు రాజభవనాలను తలపించే రీతిలో కలెక్టరేట్, పోలీసు భవనాలను ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాన్నారు. 

జిల్లా ప్రజలకు అమ్మ జోగులాంబ దీవెనలు ఉండాలని గద్వాల్ జిల్లాకు జోగులాంబ గద్వాల్ జిల్లా అని పేరు పెట్టుకున్నాం,  పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు ప్రతీ ఒక్కరికి సహాయం అందేట్టు ఆడబిడ్డలను, ముసలివాళ్ళను అందరనీ ఆదుకుంటున్నాం అని తెలిపారు. అద్భుతంగా మన దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, బిసి బిడ్డలు, అన్ని వర్గాల బిడ్డలకు 1001 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం. చరిత్రలో ఎవరు కూడా చేయలేని గొప్ప కార్యాలు ఇవి. మంచి విద్య పొంది ఈ బిడ్డలందరూ గొప్ప గొప్ప విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్నారు. 

ఒక్క మెడికల్ కాలేజీలేని జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా వీటన్నింటిని పూర్తి చేసుకున్నాం కాబట్టీ పదిహేను… ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది.  భారతదేశంలోనే లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నాం.  రైతుబంధు సహాయం రైతులకు అందుతున్నది. బ్రహ్మాండంగా పనులు  జరుగుతున్నాయన్నారు.  గతంలో కేసీఆర్ కన్నా దొడ్డుగున్నవాళ్ళు, ఎత్తుగున్న వాళ్ళు ఎందరో సీఎం లు అయ్యారు. కానీ ఒరిగింది శూన్యమన్నారు. గద్వాలలో కొందరు అడ్డం పొడుగు మాట్లాడేవాళ్ళున్నారు. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. 

గతంలో బతకలేక, బతుకుదెరువు లేక వలస పోయినం

మహబూబ్ నగర్ పట్టణంలో 14 రోజులకొక్కసారి మంచినీళ్ళు అందేవి. ఆడబిడ్డ బిందె పట్టుకొని బజార్లకు పోకుండా నల్లాల పథకం తెచ్చాం. ఇవ్వాళ మిషన్ భగీరథ ద్వారా పైపు లైన్ల ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందుతున్నది. ఈ పథకం భారతదేశంలోనే ఎక్కడా లేదని తెలిపారు. కళ్యాణలక్షి కావచ్చు. షాదీ ముబారక్ కావచ్చు. కేసీఆర్ కిట్ కావచ్చు. అమ్మ ఒడి కావచ్చు . అనేక పథకాలు మనం అమలు చేసుకుంటున్నాం.. గతంలో బతకలేక, బతుకుదెరువు లేక వలస పోయినం.. నేడు పక్క కర్నూల్ నుండి, రాయచూర్ నుండి, బీహార్, జార్ఖండ్ నుండి మన రాష్ట్రానికి, పాలమూరు జిల్లాకు వలస వస్తున్నారు. ఆనాడు మనం విడిపోతం అంటే మీకు కరెంటు రాదు. మీ రాష్ట్రం చీకటి అయితది అన్నారు, తుంగభద్ర బ్రిడ్జి దాటితే ఇవతల 24 గంటల కరెంటు ఉంటే, అవతల 24 గంటల కరెంటు ఉండదు. అది మనందరం కూడా చూస్తున్నాం. కడుపు నిండా ఎప్పుడూ పనిచేయని, ప్రజల కోసం ఆలోచించని వాళ్ళు, వాళ్ళ జమానా అంతా కిందమీద చేసినవాళ్ళు, కొందరు దళారీలు ధరణి తీసేస్తమని మాట్లాడుతున్నారు. ధరణి ని తీసేసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. రైతుబంధు, రైతుబీమా ప్రయోజనాలు, రైతు పంట అమ్ముకుంటే డబ్బులు వాళ్ళ అకౌంట్లలో పడడానికి ధరణి పోర్టల్ ఆధారమని సూచించారు. 

గతంలో రిజిస్ట్రేషన్లకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు

ధరణి ఉంది కాబట్టీ పైరవీకారులు లేరు, పట్వారీలు లేరు, వీఆర్వోలు లేరు. రిజిస్ట్రేషన్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా జరుగుతున్నాయి. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, 5 నిమిషాల్లో పట్టా అయితున్నదన్నారు.  గతంలో రిజిస్ట్రేషన్లకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలుండేవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నది. ఇది ధరణినిని బంగాళాఖాతంలో వేయడమా.. ప్రజలను బంగాళాఖాతంలో వేయడమా ? అని ప్రశ్నించారు. నేను మీ అందరినీ ఒకటే మాట అడుగుతున్నాను. ధరణి ఉండాలా.. తీసెయ్యాలా ? (ప్రజల నుండి ధరణిని కొనసాగించాలంటూ విశేష స్పందన),  నేను ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్ లో ఎక్కడ అడిగినా ప్రజలు ధరణి ఉండాలంటున్నారు. ధరణిని వ్యతిరేకించే వాళ్ళకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. 

పంటలు ఎండిపోయిన స్థితి నుండి  పచ్చనిపంటల కళకళ 

గతంలో కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రిగారు దివంగతులైనప్పుడు హెలికాప్టర్ లో కాకుండా పాలమూరు ఎట్లా మారిందో చూసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్ నుండి గద్వాల దాకా రోడ్డు మార్గంలో వచ్చానన్నారు. చాలా ఆనందం కలిగింది.  గతంలో పంటలు ఎండిపోయిన స్థితి నుండి  పచ్చనిపంటలు, ధాన్యపు రాశులు, హార్వెస్టర్లతో అద్భుతంగా కళకళలాడుతున్నాయ్. ఈ కరెంటు, రైతుబంధు, దళితబంధు ఇలాగే కొనసాగాలంటే మీరు ఇలాగే బీఆర్ఎస్ ను కాపాడుకోవాలి. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రతి పనిని పూర్తి చేసుకునే వరకు నా దగ్గరకు వచ్చి రోజుల తరబడి పంచాయతీ పెడుతుంటాడు. ఎమ్మెల్యే అబ్రహం గారు కర్నూల్ లో 100 పడకల హాస్పటల్ కావాలని రోజూ నా దగ్గర తిరుగుతుంటారని చెప్పారు. ఈ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, 12 మండలాలు, 4 మున్సిపాలిటీలున్నాయి, నేను ఇదివరకు ఇక్కడికి రాలేదు. తొలిసారి వచ్చాను కాబట్టీ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి 10 లక్షల రూపాయల గ్రాంటును ప్రతీ గ్రామానికి మంజూరు చేస్తున్నాను. ప్రతి మండల కేంద్రానికి 15 లక్షల రూపాయలు, గద్వాల మున్సిపాలిటి అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు, మిగిలిన మున్సిపాలిటీల అభివృద్ధికి 25 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేస్తున్నాని ప్రజలకు తీపి కబురు చెప్పారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని, ఆర్డిఎస్ కొనసాగింపుగా ఉన్న మల్లమ్మకుంట పథకాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నాన్నారు.