
మొన్నటి వరకూ తెలంగాణలో తమదే అధికారం అంటూ రెచ్చిపోయిన బీజేపీ చల్లబడింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తీసేసి, కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించిన నాటినుంచీ ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ రోజు సీనియర్ నాయకురాలు విజయశాంతి అక్కడినుంచి అలిగి వెళ్లిపోయారు. అనంతరం ఏ సమావేశంలోనూ ఆమె కనిపించడం లేదు. ఇటీవల సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. పార్టీ కోసం పనిచేసేవారికి ప్రాధాన్యం ఉండడం లేదనే కారణంతో బీజేపీని వీడుతున్నట్టు కిషన్‌రెడ్డికి అందజేసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో కాషాయాన్ని వీడుతున్నారు. తాజాగా, రాజన్నసిరిసిల్ల జిల్లాలోనూ ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
సిరిసిల్లలో సీనియర్ నేత కటకం గుడ్‌బై
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కీలక నేతగా పేరొందిన కటకం మృత్యుంజయం బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి.. కాషాయ దళానికి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, ఆ లేఖను అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. తన రాజీనామా లేఖను తక్షణమే ఆమోదించాలని కూడా కోరారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేకపోవడం వల్లే పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు. కమలం పార్టీని బలోపేతం చేసేందుకు తాను బండి సంజయ్ సమక్షంలో చేరానని, కానీ.. తనకు తగిన గుర్తింపు లభించడం లేదని పేర్కొన్నారు. కాగా, అత్యంత కీలక సమయంలో సీనియర్ నేత పార్టీకి గుడ్‌బై చెప్పడంతో సిరిసిల్లలో బీజేపీ పని అయిపోయిందని.. ఉన్న కాస్త క్యాడర్‌కూడా కనుమరుగు కానున్నదనే చర్చ నడుస్తున్నది.