mt_logo

తెలంగాణ విద్యుత్ విజయాలపై గోబెల్స్ ప్రచారం

నీటిపారుదల రంగంలో తెలంగాణ సాధించిన విజయాన్ని మసకబార్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిరంతరం దుష్ప్రచారం చేస్తున్న రేవంత్ సర్కార్ అదే కోవలో కేసీఆర్ నాయకత్వంలో సాధించిన విద్యుత్ విజయాల మీదకూడా బురదజల్లుతోంది. తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేసే మరో కుట్ర విద్యుత్ రంగంలో జరుగుతున్నది అనిపిస్తున్నది.

ఇటీవల మీడియాలో రెండు ప్రధాన అరోపణలు పదేపదే వల్లెవేస్తున్నారు. మొదటిది చత్తీస్‌గఢ్ నుండి విద్యుత్ కొనుగోలులో ఏదో గోల్‌మాల్ జరిగింది అనే అర్థం వచ్చే అరోపణలు. నిజానికి తెలంగాణ ఏర్పడేనాటికి ఉన్న తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేసీఆర్ సర్కార్ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించింది. ఇందులో మధ్యకాలిక ప్రణాళికల్లో భాగంగా మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా విద్యుత్ ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు కనుక రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది అని, ఇందులో ఏదో గోల్‌మాల్ జరిగింది అని రేవంత్ సర్కార్ అరోపణలు గుప్పిస్తున్నది. అయితే తెలంగాణ ప్రజలు ఇక్కడ గమనించవలసింది ఈ ఒప్పందం కుదుర్చుకున్నది ఏదో ప్రైవేటు కంపెనీతో కాదు, చత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో.

ప్రభుత్వం ఏదైనా వస్తువు కానీ, సేవలను కానీ కొనాలన్నా, ఏదైనా ప్రాజెక్టులు కట్టాలన్నా టెండర్ వేసి తక్కువ ధర కోట్ చేసిన సంస్థకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అదే వస్తువు కానీ, సేవ కానీ, ప్రాజెక్ట్ కానీ ప్రభుత్వరంగ సంస్థకు, లేదా నేరుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలంటే ఏ టెండర్ వేయాల్సిన అవసరం లేదు. దీన్నే జి-టు-జి (గవర్నమెంట్ టు గవర్నమెంట్) కాంట్రాక్ట్ అంటారు. ఇలాంటి కాంట్రాక్ట్‌లో డబ్బులు నేరుగా ఒక ప్రభుత్వం నుండి మరో ప్రభుత్వానికి కానీ, ఒక ప్రభుత్వరంగ సంస్థ నుండి మరో ప్రభుత్వరంగ సంస్థకు చేరుతాయి కాబట్టి అవినీతికి, వ్యక్తిగత లబ్దికి ఆస్కారం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతినిత్యం కొన్ని లక్ష కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఈ జి-టు-జి విధానంలో  జరుగుతాయి. ఇది అత్యంత పారదర్శక విధానం అని ఒక ఏకాభిప్రాయం ఉన్నది.

ఆ రోజు తెలంగాణ ఎదుర్కొంటున్న విద్యుత్ కొరతను తీర్చడానికి అత్యంత పారదర్శకంగా చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి విద్యుత్ కొనుగోలు చేస్తే దానిమీద కూడా దురుద్దేశంతో ఆరోపణలు చేయడం రాజకీయ వికృత క్రీడ తప్ప మరొకటి కాదు.

ఇక రెండోది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్టు టెండర్ లేకుండా బీహెచ్ఈఎల్‌కు ఎలా కట్టబెట్టారు అనే ఆరోపణ కూడా ఈ కోవకు చెందిందే.  4000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, మన దేశంలో ప్రభుత్వరంగంలో ఏర్పాటవుతున్న అతిపెద్ద విద్యుత్ ప్లాంట్! ఇది తెలంగాణకే గర్వకారణం. ఈ స్థాయిలో ప్రాజెక్టులు కట్టాలంటే దానికి ఎంతో దార్శనికత, సాహసం ఉండాలి. 

ఈ ప్లాంట్ నిర్మాణ కాంట్రాక్టును అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వరంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్‌కు ఇచ్చారు. ఇది కూడా జి-టు-జి విధానం కింద ఇచ్చిందే. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్టు విలువ రూ. 20,400 కోట్లు. బీహెచ్ఈఎల్ చరిత్రలోనే కాదు, స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ ప్రభుత్వరంగ సంస్థకు ఇంత భారీ ఆర్డర్ ఎన్నడూ, ఏ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ కూడా ఇవ్వలేదు.

మన కళ్ల ముందే బీఎస్ఎన్ఎల్‌ను గత దశాబ్దంగా ఎట్లా ఎండబెట్టి దివాళా తీయిస్తున్నారో చూశాం. ఎయిర్ ఇండియా నుండి మొదలుకొని ఎల్ఐసీ వరకూ ఎన్ని రత్నాల్లాంటి ప్రభుత్వరంగ సంస్థలని వధ్యశిలమీదికి మన పాలకులు చేర్చారో దేశప్రజలందరికీ తెలుసు. అలాంటిది తెలంగాణ సాధన తరువాత అవకాశం వచ్చిన ప్రతిసారీ కేసీఆర్ ప్రభుత్వరంగ సంస్థలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రైతు బీమాను ఎల్ఐసీకి ఇచ్చారు. ఆఖరికి రుణం అవసరమైనా ప్రభుత్వ రంగ సంస్థలైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ తదితర ప్రభుత్వరంగ సంస్థలనే ఎన్నుకున్నారు. దీనివల్ల చౌక ధరకు, నాణ్యమైన సేవలు పొందడమే కాకుండా ముఖ్యంగా అవినీతిరహిత, పారదర్శకంగా ప్రభుత్వ పనులు జరుగుతాయి. నిజానికి అవకాశం వస్తే ఇలాంటి ప్రాజెక్టులు ప్రైవేటుకు కట్టబెట్టి వ్యక్తిగత లబ్దిపొందేందుకు ప్రయత్నించే నాయకులు ఉన్న ఈ కాలంలో ప్రభుత్వరంగ సంస్థలకు ఇలాంటి కాంట్రాక్టులు ఇవ్వడం ఒక నాయకుడి నిబద్ధతకు నిలువుటద్దం.

ప్రభుత్వరంగ సంస్థలు దేశ ప్రజల ఆస్తి. అవి పచ్చగా ఉంటే లక్షలాది మంది దేశపౌరులకు ఉపాధి లభించడమే కాక కీలక రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తుంది అని మన జాతి నిర్మాతలు తలపోశారు. అంతటి సమున్నత లక్ష్యాలతో ప్రారంభం అయిన ప్రభుత్వరంగ సంస్థలకు పునర్జీవనం కలిగించేందుకు, తెలంగాణ విద్యుత్ రంగంలో నిలదొక్కునేందుకు దార్శనిక నాయకుడు కేసీఆర్ చేసిన కృషిని మెచ్చుకోవాల్సింది పోయి ఉల్టా ఆయన మీద బురదజల్లడం కాంగ్రెస్ ప్రభుత్వ కుత్సిత బుద్ధిని బయటపెడుతోంది.