ఆకలితో ఉన్నవారి కడుపునింపే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ చేపట్టిన ‘ఫీడ్ ద నీడ్’ కార్యక్రమానికి దాతల నుండి విశేష స్పందన లభిస్తున్నది. ఇప్పటివరకు సుమారు 40వేల ఫుడ్ ప్యాకెట్లు అందించేందుకు పలు హోటళ్ళు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. వాలెంటైన్స్ డే అయిన ఫిబ్రవరి 14న పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి ముఖ్యమైన దినాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు.
నగరంలో మూడు లక్షల మందికి సరైన ఆహారం అందడంలేదని సమాచారం. ఈ నేపథ్యంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) హైదరాబాద్ శాఖ, హోటల్స్ అసోసియేషన్, డీవీ మనోహర్ హోటల్స్, పిస్తా హౌస్, పలు హోటళ్ళు, వ్యక్తులు ఈనెల 14న ఈ ప్యాకెట్లను అందించేందుకు ముందుకొచ్చారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆటోస్టాండ్లు, మురికివాడలు, నైట్ షెల్టర్లు, మేజర్ దవాఖానలు ఇతర రద్దీ ప్రాంతాల్లో ఈ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. ఆహారం అందించాలనుకునేవారు ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
రజనీకాంత్: 9542188884
విశాల్: 9666863435
పవన్: 9849999018