సమైక్యపాలనలో నీటికష్టాలకు హైదరాబాద్ పెట్టింది పేరు. నగరవాసులు తాగునీటి కోసం అల్లాడిపోయేవారు. ట్యాంకర్ల వద్ద నిత్యం పానిపట్టు యుద్ధాలే దర్శనమిచ్చేవి. ఈ మహానగర దాహార్తిని తీర్చేందుకు ఆనాటి పాలకులకు సరైన విజన్ లేకపోవడంతో ప్రజలు దాహంతో అల్లాడారు. వేసవికాలంలో పడరాని పాట్లు పడ్డారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విజన్‌తో కాళేశ్వర జలాలు హైదరాబాద్‌కు నడిచొచ్చాయి. తెలంగాణ సర్కారు మహా నగరానికి మంచినీటి సరఫరా కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి తాగునీటి పథకాలు రూపొందించి.. నదుల నుంచి నగరానికి వందల కిలోమీటర్ల పైపులైన్లు వేసి పట్నం ప్రజల దాహం తీర్చింది. ఇంతటి వర్షాభావంలోనూ హైదరాబాద్ నలుమూలలా మంచినీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పుణ్యమా అని ఇంటింటికి గోదావరి జలాలు పరుగు పెడుతూ ప్రతి గడపను ముద్దాడుతున్నాయి.
నగరానికి గోదావరి జలాలు
-హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తి తీర్చుతున్న మంచినీటిలో గోదావరిజలాల పాత్ర అత్యంత కీలకం.
-గోదావరిజలాల తరలింపు పథకం ద్వారా రోజుకు 172 మిలియన్ గ్యాలన్ల జలాలను తరలించి.. వివిధ దశల్లో శుద్ధి చేసి నగరవాసులకు అందిస్తున్నారు.
-తెలంగాణ ఏర్పడక ముందు రూపొందించిన ఈ పథకం పూర్తిగా ఎల్లంపల్లి జలాశయంపైనే ఆధారపడి డిజైన్ చేశారు. ఎల్లంపల్లి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం-ఎఫ్‌ఆర్‌ఎల్ 148 మీటర్లు (485.56 అడుగులు) కాగా నిల్వ సామర్థ్యం 21.18 టీఎంసీలు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తాగునీటి కోసం రూపొందించిన పథకంలో ఎండీడీఎల్ (మినిమం డ్రాడౌన్ లెవల్-నీటిని సేకరించే కనీస నీటిమట్టం) 142 మీటర్లు (465.87 అడుగులు)గా నిర్ధారించారు. అంటే.. జలాశయంలో కనీసం 142 మీటర్ల మేర నీటిమట్టం ఉంటేనే హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా జరుగుతుంది.
-తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ అడ్డంకులను తొలగించి త్వరితగతిన గోదావరి మంచినీటి పథకాన్ని పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం మరోవైపు వర్షాభావంలోనూ ఎల్లంపల్లి నిల్వలకు ఢోకా లేకుండా… తద్వారా హైదరాబాద్ మహా నగర మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టింది. -కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా భరోసా కల్పించింది.
-ఎండాకాలంలోనూ కాళేశ్వరం ద్వారా ఎల్లంపల్లిలో నిల్వ తగ్గకుండా చర్యలు తీసుకుంటుండటంతో ఏడాది పొడవునా జలాశయంలో కనీసంగా 144 మీటర్ల మేర నిల్వలు ఉంటున్నాయి.
-ఈ ఏడాది కూడా అదే చేశారు.
-ప్రస్తుతం ఎల్లంపల్లి లో 144 మీటర్ల ఎగువన నీటిమట్టంతో 12 టీఎంసీలకు పైగా నీటి నిల్వలు ఉన్నాయి. -ఇప్పటికీ హైదరాబాద్ తాగునీటి కోసం రోజుకు 331 క్యూసెక్కుల కాళేశ్వరజలాల్ని డ్రా చేస్తూనే ఉన్నారు.