రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి వరదలు వస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లే మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో ముగినితేలారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా సర్వశక్తులూ ఒడ్డారు. నీట మునిగిన మోరంచపల్లి గ్రామానికి చెందిన 900 మందికి ఊపిరి పోశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ ఆర్మీ అధికారులతో మాట్లాడి హెలికాప్లర్లను కూడా రంగంలోకి దించారు. వరదల్లో చిక్కుకొన్నవారి ప్రాణాలను కాపాడారు. వర్షాలు, వరదలతో చిక్కుల్లోపడ్డ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర సర్కారు తన శక్తికి మించి పనిచేస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం బురద రాజకీయం చేస్తున్నారు. ఓ వైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మరోవైపు సీతక్కలాంటి నాయకులు సహాయక చర్యల్లో పాల్గొనకుండా తెలంగాణ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ తెలంగాణ ప్రజల్లో చులకనవుతున్నారు.
ఇలాంటి సమయంలో జీహెచ్ఎంసీ ముట్టడా?
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు వచ్చి ప్రజలు చిక్కుకొంటే కాంగ్రెస్ నేతలు దీన్ని రాజకీయం చేస్తున్నారు. వదరల్లో చిక్కుకొన్న ప్రజలకు తమవంతు సహాయం చేయాల్సింది పోయి బురద రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొంటుంటే.. వాటిని అడ్డుకొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి జీహెచ్ఎంసీ ముట్టడికి యత్నించడంపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆపదలో ఉంటే కనీస మానవత్వం చూపకుండా రాజకీయం చేయడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. వరదలను ఎమ్మెల్యే సీతక్క తన ఎన్నికల ప్రచారానికి వాడుకొంటున్నారంటూ ఆమె సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్న వీడియోలపై మండిపడుతున్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు బురద రాజకీయాలు మానుకొని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలువాలని డిమాండ్ చేస్తున్నారు.