mt_logo

తెలంగాణవాదులారా, మారీచులున్నారు జాగ్రత్త!

గుణవీర శరత్‌చంద్ర

రాముడిని దెబ్బ తీయాలంటే సీతను అపహరించాలని చెబుతాడు అకంపనుడు. సీతను అపహరించడానికి రావణుడు విసిరిన పాచిక మారీచుడు. బంగారు లేడి వేషంలో పంచవటి సమీపంలో విహరిస్తుంటాడు మారీచుడు. సీత బంగారు లేడిని చూసి ఇష్ట పడుతుంది. దానిని పట్టి తీసుకురమ్మంటుంది. రాముడు వద్దంటాడు. అది మారీచుని మాయ అంటాడు. పట్టుబడుతుంది సీత. లక్ష్మణుడిని పర్ణశాలకు కాపలా ఉంచి, రాముడు దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది దూరంగా పరుగెడుతుంది. రాముడు వెంటపడతాడు. ఇంకా ఇంకా దూరంగా వెళ్లి, రాముడికి ఏదో ఆపద కలిగిందని అర్థం వచ్చే విధంగా ‘హా సీతా, హా లక్ష్మణా’ అని కేకలు వేస్తాడు మారీచుడు. లక్ష్మణుడు పరుగెత్తుకువస్తాడు. రావణుడు సీతను అపహరిస్తాడు.

తెలంగాణ సమస్యను మాయం చేయాలి. తెలంగాణ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలి. తెలంగాణవాదులను చెట్టుకొకరు పుట్టకొకరు చేయాలి. తెలంగాణవాదుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలి. అందరూ ఒక్కచోట ఉంటే కొట్టడం కష్టం. విడదీసి కొట్టాలి. విభజించి కొట్టాలి. విభేదం సృష్టించి కొట్టాలి. అందుకే అప్పటి రావణుడిలాగే ఇప్పుడు సీమాంధ్ర నాయకత్వాలు మారీచులను ఎగదోస్తున్నాయి. మారీచుల నోట అసత్యాలు, అర్థసత్యాలు కుమ్మరిస్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లకు తెలంగాణలో పుట్టగతులు లేకుండా పోతున్నాయి. ఎన్ని తిప్పలు పడ్డా, ఎన్ని ఎత్తులు పెట్టినా ఆ మేడలు నిలబడటం లేదు. తెలంగాణలో సీమాంధ్ర రాజకీయ కోటలు కూలుతున్నాయి. తెలంగాణ ఓటర్ల భుజాలపై కూర్చుని సీమాంధ్ర నాయకత్వాలకు జీ హుజూర్ అని జేకొట్టిన నేతలకు కనువిప్పు కలుగుతున్నది. తెలంగాణ మనది, మనమే తేల్చుకోవాలన్న సోయి బలపడుతున్నది. తెలంగాణ సంఘటితమవుతున్నది. టీఆర్‌ఎస్‌లోకి లేక బిజెపిలోకి వలసలు జరుగుతున్నాయి. ఇది జీర్ణించుకోవడం సీమాంధ్ర నాయకత్వాలకు కష్టంగా ఉంది. అందుకే బెగ్, బారో, స్టీల్.. తెలంగాణవాదుల్లో చిచ్చుపెట్టేందుకు మూడు పార్టీలూ ఒకే గొంతుకగా మాట్లాడుతున్నాయి.

ఇలా చేయడం కొత్తకాదు. చంద్రబాబునాయుడు 2004 ఎన్నికలకు ముందు ఇలాగే చేశారు. రాజశేఖర్‌రెడ్డి ఏకంగా పదిమంది ఎమ్మెల్యేలను ఎర్రగడ్డ రైతుబజారులో కూరగాయాలను కొన్నట్టు కొనిపారేశారు. తెలంగాణ పాటలు పాడిన నోటనే, తెలంగాణకు చావుగీతాలు పాడించాడు. అలా అమ్ముడుపోయి, సీమాంధ్ర నాయకత్వాలకు ఊడిగం చేసిన వారిలో ఒక్క తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తప్ప అందరూ మట్టికొట్టుకుపోయారు. రాజశేఖర్‌రెడ్డి పోయిన ఎన్నికల సమయంలో కూడా చాలా మంది తెలంగాణ యువకిశోరాలను కొనుగోలు చేశారు. (ఇలా చెప్పాల్సిరావడం అవమానకరమే. కానీ ఏం చేస్తాం. వాళ్ల వద్ద పెట్టుబడులు ఉన్నాయి. పార్టీలు ఉన్నాయి. టికెట్లు ఉన్నాయి. వాళ్లు ఇచ్చేవాళ్లు. కొనేవాళ్లు. మనం తీసుకునే వాళ్లం. అమ్ముడుపోయే వాళ్లం. ‘టీఆరెస్‌లోకి వస్తే ఎన్నికల ఖర్చు ఎవరు భరిస్తారన్నా? ఇక్కడయితే బాబు చూసుకుంటారు’ అని ఒక తెలుగు తమ్ముడు నిర్మొహమాటంగానే చెప్పారు) టీవీ స్టూడియోల చుట్టూ డ్యూటీలు వేసి అడ్డగోలుగా మొరిగించారు. వారంతా ఇప్పుడు ఏమయ్యారో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మొరిగే వారికీ అదే గతిపడుతుందని వేరే చెప్పనవసరం లేదు. పెడితే పెళ్లి బాజా లేకపోతే చావు బాజా ఊదడం కొందరికి సహజమే. వీళ్లెవరికీ అంతిమలక్ష్యం తెలంగాణ కాదు, ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం, రాజకీయాలను లాభసాటిగా మార్చుకోవడం, ఇలా జారిపోయే, చిల్లిపోయే ఎండుకప్పల గురించి తెలంగాణవాదులు పెద్దగా చింతించాల్సిన పని లేదు.

చంద్రబాబు చుట్టూ పారిశ్రామిక వేత్తలు ఉంటారు. కాంగ్రెస్ నిండా స్కామ్‌లు చేసిన వాళ్లుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ స్వయంగా స్కామ్‌ల కాంగ్రెస్‌గా విమర్శలు ఎదుర్కొంటున్నది. విచిత్రం ఏమంటే ఈ రాష్ట్రాన్ని గత ఐదు దశాబ్దాలుగా కొల్లగొట్టిన వాళ్లంతా ఈ పార్టీలలోనే ఉన్నారు. కంపెనీలు పెట్టి ఇన్వెస్టర్లను ముంచినవారు, బ్యాంకులు పెట్టి డిపాజిటర్లను ముంచినవారు, అప్పులు తీసుకుని బ్యాంకులను ముంచినవారు, హైదరాబాద్‌లో వేలకోట్ల విలువజేసే వేలాది ఎకరాల భూములను కాజేసినవారు.. అంతా ఈ పార్టీల నీడలోనే ఉన్నారు. షేర్ మార్కెట్ బూమ్‌లో రొయ్యల కంపెనీలు, ఫార్మా కంపెనీలు, చేపల కంపెనీలు పెట్టి కోట్లాది మంది ప్రజలకు షేర్లమ్మి వేల కోట్ల రూపాయాలు వసూలు చేసి రాత్రికి రాత్రి కంపెనీలు మూసేసి ఇస్వెస్టర్లకు శఠగోపం పెట్టిన వాళ్లూ వీళ్ల అనుచరులే. స్టాంపుల కుంభకోణాలూ వీళ్లవే. ఏలేరు కుంభకోణమూ వీరిదే. మద్యం కుంభకోణంలో ఐదు వేల కోట్లు చేతులు మారిందీ వీరి కనుసన్నల్లోనే. ఐఎంజీ భారత్, ఎమ్మార్ కుంభకోణాల్లోఅందరూ భాగస్వాములే. కృషి వెంకటేశ్వరరావు వీళ్ల మనిషే. నాదర్‌గుల్ సూర్యప్రకాశరావు వీళ్ల మనిషే. క్విడ్ ప్రో క్వో స్కాముల స్వాములంతా వీళ్ల మనుషులే. ఎన్నికల కోసమో, రాజకీయాల కోసమో వీళ్లకు డబ్బులు వసూలు చేయవలసిన పని లేదు. వీళ్లే అందరికీ డబ్బులిస్తారు. ఆధునిక మారీచులు వీరితో చేతులు కలిపి ఏ అధికారమూ లేకుండా గత పన్నెండేళ్లుగా పార్టీని, ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకంటే విడ్డూరం ఏముంటుంది?

ఇదంతా ఎందుకంటే తెలంగాణను అడ్డుకోవడం కోసమే. తెలంగాణను దెబ్బతీయడం కోసమే. ఈ మూడు పార్టీల ఉమ్మడి లక్ష్యం టీఆరెస్సే! సంఘటితమవుతున్న తెలంగాణ రాజకీయ శక్తులను నిలువరించడానికి, తెలంగాణ ఉద్యమంలోకి ఇతర పార్టీల వలసలను అడ్డుకోవడానికి సీమాంధ్ర పార్టీలు వేస్తున్న పాచికల్లో ఒక పాచిక మారింది. కానీ ఇది తాత్కాలికం. ఇంకా ఇటువంటి మారీచులు చాలా మంది పుడుతారు. ఇటువంటి దాడులు ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. తెలంగాణవాదులు అందుకు సిద్ధపడి ఉండవలసిందే. అంతిమయుద్ధంలో వీళ్లందరితో తలపడవలసిందే. అయోమయానికి గురికావద్దు. ఆందోళన చెందవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *