mt_logo

దళిత బంధు కేసీఆర్ – ఎస్సీల సంక్షేమం కోసం వినూత్న పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ సంక్షేమం పట్ల చిత్తశుద్ధి.

దళిత బంధు కోసం 2023-24 బడ్జెట్లో రూ. 17,700 కోట్లు.

ఎస్సీల అభివృద్ధి కోసం ఎన్నో వినూత్న పథకాలు.

ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. 

• రూ.6684.3 కోట్లతో ఎస్సీ రెసిడెన్షియల్  పాఠశాల నిర్వహణ.

• సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో 3836 అధ్యాపకుల పోస్టుల భర్తీ.

హైదరాబాద్: ఎస్సీ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఎస్సీ కులాలను అటు సామాజిక వివక్ష నుంచి దూరం చేయడంతో పాటు, ఇటు ఆర్థిక స్వావలంబనను కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీల విద్య, సామాజిక వికాసంతోపాటు, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఇతర సమాజానికి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యేక పథకాలను  ఎస్సీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తున్నది.

దళిత బంధు :-

తరతరాలుగా వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాలకు ఆర్థిక గౌరవంతో పాటు, సామాజిక గౌరవాన్ని పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేస్తున్నది. ఈ పథకం కింద ఎలాంటి బ్యాంకు లింకేజీ గానీ, సెక్యూరిటీ గానీ లేకుండా, లబ్ధిదారుడు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వమే రూ.10 లక్షల గ్రాంటును ఉచితంగా అందజేస్తుంది. దళితులను స్వయం సమృద్ధులుగా, వ్యాపార వర్గాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సామాజిక బాధ్యతలో భాగంగా అర్హత కలిగిన దళిత కుటుంబాలకు ఈ పథకం కోసం అర్హులైన 38,323 మంది దళితులను గుర్తించి వారికి రూ. 3,832.30 కోట్లను దళిత బంధు పథకం ద్వారా అందించడం జరిగింది.

దళిత బంధు పథకాన్ని అందుకుంటున్న వారు ఏదైనా అనుకోని సందర్భంలో నష్టాలకు గురవ్వడం ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆర్థికంగా ఆదుకోవడానికి రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేసింది. ఇందుకు ప్రభుత్వం తరఫున రూ. 10 వేల కంట్రిబ్యూషన్ తో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దళిత బంధు కోసం 2023-24 బడ్జెట్లో రూ. 17,700 కోట్లు ప్రతిపాదించడమైనది. 

షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతి నిధి (ఎస్.సి.ఎస్ డి.ఎఫ్) :-

షెడ్యూలు కులాల, తెగల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి నిధుల కేటాయింపుకు చట్టబద్ధత కల్పించింది. ఎస్సీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో నిధులు పూర్తిగా ఖర్చు కాని పక్షంలో ఈ చట్టం ప్రకారం ఆ నిధులను తరువాతి సంవత్సరానికి ఖచ్చితంగా బదలాయింపు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద 2014 -15 నుండి 2022-23 వరకు రూ. 92,640.41 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. 

ఆర్థిక చేయూత పథకం  :-

అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక చేయూత పథకం ద్వారా వారికి అందించిన 1 లక్ష రూపాయల నుంచి రూ. 12 లక్షల రూపాయల వరకు లోన్ ను అనుసరించి 60% నుంచి 80% వరకు రాయితీని ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ పథకం కింద 2014-15 నుండి 2022-23 వరకు 1,62,444 మంది లబ్దిదారులకు 2029.78 కోట్ల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ గా అందించింది. 

ఎస్సీ హాస్టళ్ళు :-

ప్రభుత్వం 6,11,716 మంది ఎస్సీ విద్యార్థుల హాస్టళ్ల నిర్వహణ ఖర్చుల కోసం 2014-15 నుండి 2022-23 వరకు రూ. 1976.91 కోట్లను ఖర్చు చేసింది. 

అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ :-

దళిత, గిరిజన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కింద లబ్ధి పొందే వారి వార్షిక ఆదాయ పరమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచారు. ఈ పథకం ద్వారా యుఎస్ఎ, యుకె, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్, సౌత్ కొరియా దేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం ద్వారా 2013-14 నుంచి 2022-23 వరకు 1031 మంది అభ్యర్థులకు రూ. 179.92 కోట్లను స్కాలర్ షిప్ గా ప్రభుత్వం చెల్లించింది. 

ఎస్సీలకు నైపుణ్య శిక్షణ  :-

షెడ్యూల్డ్ కులాల యువతీయువకులను గుర్తించి వారికి ఉపయోగపడేలా వృత్తి నైపుణ్య శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందించి, అమలు చేస్తున్నది.  తెలంగాణ ఆవిర్భవించిన నాటినుంచి 21,653 మందికి రూ. 91.83 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ పథకం ద్వారా శిక్షణ పొందిన వారికి టిసిఎస్, కాగ్నిజెంట్, డెల్, సిస్కో, జెన్ పాక్ట్, డెలాయిట్, ఎల్ అండ్ టీ, అపోలో, కేర్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.

దళితులకు మూడెకరాల భూమి  :-

భూమిలేని పేద వ్యవసాయ కూలీలైన ఎస్సీ మహిళలకు 3 ఎకరాల భూమిని అందించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఈ తొమ్మిదేళ్లలో 17,097.09 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి 6,998 మంది అర్హులైన లబ్ధిదారులకు అందించింది. దీనికోసం 769.17 కోట్ల రూపాయలను 2014 నుండి 2022 వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది. 

ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు రాయితీలు :-

దళితులను పదిమందికి ఉపాధి కల్పించే ‘ఎంటర్ ప్రెన్యూయర్లు’గా తయరు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 1,60,914 మందికి రూ. 2,013.64 కోట్ల రూపాయలను సబ్సిడీల ద్వారా రాయితీలు కల్పించి ప్రోత్సహించింది. ఎస్సీలకు, ఎస్టీలు, గౌడలకు మద్యం దుకాణాల కేటాయింపు :  రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్సుల్లో  గౌడలకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను  కేటాయించింది. 

టీఎస్ – ప్రైడ్ :-

టీ ఎస్ ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ ప్రెన్యూయర్స్) దళితులను ఎంటర్ ప్రెన్యూయర్లను చేసేందుకు ప్రభుత్వమే పూనుకుని వారికి ఆర్థిక సాయం తో పాటు వ్యాపార పారిశ్రామిక రంగాల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ఏర్పాటు చేసిన పథకం టీఎస్ ప్రైడ్. దళితులకు ఇండస్ట్రియల్ పార్కుల్లో స్థలాలను కేటాయించడం, పెద్ద పరిశ్రమలతో సాంకేతిక సహాయ ఒప్పందాలకు సహకరించడం, ఆర్థిక సహాయం తో పాటు అదనపు పెట్టుబడి రాయితీలను అందించడం వంటి సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. గడిచిన తొమ్మిదేళ్ళలో టిఎస్ ప్రైడ్ ద్వారా 60,904 మంది దళితులకు రూ.2,747 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 

ఎస్సీ లకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ :-

పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వం దళిత నివాసాల్లో వెలుగులు నింపే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి దళితుని ఇంటికి 101 యూనిట్ల వరకు విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తున్నది. 2014-15 నుండి 2022-23 వరకు 22,23,475 దళిత గృహాలకు రూ. 284.13 కోట్ల ఖర్చుతో ఉచిత విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం అందించింది.

ఎస్సీలకు విద్య :-

తరతరాలుగా విద్యకు దూరం చేయబడిన ఎస్సీ కులాలకు నాణ్యమైన విద్య అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా ప్రత్యేక శ్రద్ధతో దేశానికే ఆదర్శంగా ఎస్సీ గురుకులాలను ఏర్పాటు చేసింది.  ఈ గురుకులాల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మక దేశ,విదేశీ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు సాధించి డాక్టర్లుగా,  ఇంజనీర్లుగా, ఐటి ప్రొఫెషనల్స్ గా విజయ తీరాలకు చేరుకుంటున్నారు. 

ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు :-

రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఉన్న 132 ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలుండేవి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే మరో 104 పాఠశాలలను స్థాపించారు. దీంతో మొత్తం ఎస్సీ గురుకుల పాఠశాలల సంఖ్య 236 కు చేరుకున్నది. వీటిలో మొత్తం  1,13,280 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 5,428 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 

ఎస్సీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు :-

238 ఎస్సీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 39 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత స్వల్పకాలంలోనే 126 కొత్త రెసిడెన్షియల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూర్వం ఉన్న 112 జూనియర్ కాలేజీలు కలిపి మొత్తం ఎస్సీ జూనియర్ కాలేజీల సంఖ్య 238 కి చేరుకున్నది. వీటిలో మొత్తం 964 మంది టీచర్లు పనిచేస్తుండగా, మొత్తం విద్యార్థుల సంఖ్య 38,389. 

ఎస్సీ డిగ్రీ కాలేజీలు :-

రాష్ట్ర ఏర్పాటుకు ముందు నాటి తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ డిగ్రీ కాలేజీల ఊసే లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం 30 ఎస్సీ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది. వీటిలో మొత్తం 1200 మంది అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తుండగా..  25,200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 

 పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు :-

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2.5 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లు ఇస్తున్నది. 2014-15 నుండి 2022-23 వరకు మొత్తం 26,68,397 మంది విద్యార్థులకు రూ. 3,762.22 కోట్ల రూపాయలను పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లుగా అందించింది. 

ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లు :-

ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ ల ద్వారా అందించే మొత్తాన్ని ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 65,000 ల నుండి రూ. 1,50,000 లకు, పట్టణ ప్రాంతాల్లో రూ. 75,000 ల నుండి రూ. 2,00,000 లకు పెంచారు. 2014-15 నుండి 2022-23 వరకు 5,78,417 మంది విద్యార్థులకు రూ. 368.06 కోట్లను ప్రభుత్వం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లుగా అందించింది. 

స్టడీ సర్కిళ్ళు :-

రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు ఉన్న ఎస్సీ స్టడీ సర్కిళ్ళతో పాటు నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల  జిల్లాల్లో కొత్తగా ఎస్సీ స్టడీ సర్కిళ్ళను ఏర్పాటు చేసింది.  ఎస్సీ స్టడీ సర్కిళ్ళు సివిల్ సర్వీసులు, సెంట్రల్ సర్వీసులు, గ్రూప్ ఎ, బి తో పాటు ఇతర పోటీ పరీక్షలకు ఈ సర్కిళ్ళలో కోచింగ్ నిస్తూ వారి భవితకు బంగారు బాటలు వేస్తున్నాయి.  

హైదరాబాద్ లో ప్రధాన శాఖ విద్యార్థులకు సేవలందిస్తున్నది.  2014-15 నుండి 2022-23 వరకు వీటిలో కోచింగ్ తీసుకున్న 1314 మంది అభ్యర్థులు వేర్వేరు పోస్టులకు ఎంపికయ్యారు. 

ఎస్సీ యువత కోసం సంక్షేమ కార్యక్రమాలు :- 

షెడ్యూల్డ్ కులాల యువతను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత 2014వ సంవత్సరంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీని ఏర్పాటు చేసింది.  ఈ సొసైటీ ద్యారా రాష్ట్ర వ్యాప్తంగా 268 విధ్యావసతి గృహాలను నడుపుతోంది. ఈ వసతి గృహాలలో 5వ తరగతి నుండి ఇంటర్ మీడియేట్ వరకు చదువుకునే విద్యార్ధులకు తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో నాణ్యమైన ఉచిత విద్య, భోజన, నివాస వసతులు కల్పిస్తోంది. డిగ్రీ చదివే షెడ్యూల్డ్ కులాల మహిళా విద్యార్ధినిలకు కూడా ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేసింది. ఇక్కడ చదువుకున్న విద్యార్ధులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తమ ప్రతిభను చాటుకునేలా శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. వారిలో ఆత్మవిశ్వాసం, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు ప్రత్యేక తర్ఫీదునిస్తుంది.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో పథకాలు :-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో అరకొర వసతులతో 134 వసతి గృహాలు మాత్రమే ఉండేవి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం మరో 93 బాలుర వసతి గృహాలు, 173 బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేసింది.  వీటికి అదనంగా డిగ్రీ చదువుతున్న మహిళల కోసం మరో 30 వసతి గృహాలను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వీటి సంఖ్య 268 కి చేరింది.

ప్రత్యేక నిధులతో నాణ్యమైన నివాస, భోజన వసతులు :-

 విద్యార్దులకు చదువుతో పాటు ఆరోగ్యం శారీరక ధారుడ్యం కూడా ముఖ్యమేనని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన భోజన వసతులు కల్పించింది. అన్ని వసతి గృహాలలో సన్న బియ్యంతో పాటు పోషక విలువలు కల్గిన ఆహార పదార్థాలను భోజనం మెనూలో చేర్చింది. అందుకు అనుగుణంగా వారికి అవసరమైన వనరులను ప్రభుత్వం సమకూరుస్తోంది. 2014-2015 వ సంవత్సరంలో సొసైటికి రూ.394.93 కోట్ల రూపాయలను మంజూరు చేయగా 2015-2016 సంవత్సరానికి రూ. 501.87 కోట్ల రూపాయలకు పెంచింది. ఇలా ఏ యేడుకు ఆ యేడు అవసరమైన నిధులను అందిస్తూ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2023-2024 సంవత్సరం వరకు రూ. 6684.3 కోట్ల రూపాయలను వెచ్చించింది.

ఉత్తమ ఉపాధ్యాయుల నియామకం:-

ఉత్తమ అధ్యాపకుల నియామకానికి ప్రభుత్వం శ్రద్ధ చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా 2782 ఖాలీలను గుర్తించిన ప్రభుత్వం టిస్ పి ఎస్ సి ద్వారా 2337 పోస్టులను భర్తీ చేసింది. టీ ఆర్ ఈ ఐ – ఆర్ బి ద్యారా 1162 ఖాళీలకు గాను 1054 పోస్టులను భర్తీ చేసింది. ఇంకా 2538 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది.

సాధించిన విజయాలు:-

షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఈ సొసైటీ అద్భుత విజయాలను సాధిస్తోంది. 2022- 2023 విద్యా సంవత్సరంలో నిర్వహించిన అన్ని పరీక్షలలో విద్యర్దులు తమ సత్తా చాటారు. పదవ తరగతి పరీక్షల్లో  ఉత్తీర్ణత శాతం ఇతర విద్యాసంస్థలలో 86.60 గా ఉండగా సొసైటీ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 95.50 గా ఉంది. సీనియర్ ఇంటర్ పరీక్షల్లో ఇతర విద్యాసంస్థల ఉత్తీర్ణత శాతం 67.26 శాతంగా ఉండగా సొసైటీ విద్యార్థులు 89.04 శాతం సాధించారు. జూనియర్ ఇంటర్లోను రాష్ట్ర వ్యాప్తంగా 62.85 గా ఉంటే ఇక్కడి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 74.81 గా ఉంది.

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అద్భుత  విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఇక్కడ చదివిన విద్యార్థులు ఆటల పోటీలలోనూ విజయాలు సాదిస్తూ ముందుకు సాగుతున్నారు.  రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ ఆటల పోటీలలో ఇక్కడి విద్యార్థులు మొత్తం 753 పథకాలను సాదించారు. అశోక్ అనే విద్యార్థి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఫ్లయింగ్ ఆఫీసర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో కూడా చాలా మంది విద్యార్థులు ఉపాధి అవకాశాలను పొందారు.

అంబేద్కర్ భవనాలు, విగ్రహాలు :-

2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2023 మార్చి నాటికి తెలంగాణలో 140 కోట్ల ఖర్చుతో 910 ఎస్సీ కమ్యూనిటి హాళ్ళు నిర్మితమయ్యాయి.  భవన్ లు, విగ్రహాల ఏర్పాటు కు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం రూ. 368.27 కోట్లను మంజూరు చేసింది. వీటిలో 96 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.  రూ. 40 కోట్లతో చేపట్టిన మరో 319 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 2014-15 నుండి 2022-23 వరకు ప్రభుత్వం వీటి నిర్మాణానికి రూ. 140.55 కోట్లను ఖర్చు చేసింది. 

దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు  :-

అంబేద్కర్ ఆశయాలను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు, ఆ ఆశయాల సాధనకు ప్రజాప్రతినిధులు, అధికార గణాన్ని ఉద్యుక్తులను చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు రూపమిస్తూ ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల ఎత్తైన ‘అంబేద్కర్ విగ్రహాన్ని’ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. అంబేద్కర్ పేరుతో  స్మృతివనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు 14 ఏప్రిల్ 2016 న నిర్వహించిన 125వ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ప్రకటించి, శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయిన అనంతరం 14 ఏప్రిల్ 2023 న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని అంబేద్కర్ మనమడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాష్ అంబేడ్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.  నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ పరిసరాల్లో మొత్తం 11.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. మహా విగ్రహం కొలువుదీరిన ప్రాంగణం ఆరు ఎకరాల వరకు ఉంటుంది. మహారాష్ట్రలోని దూలె జిల్లాలోని గోండూరు గ్రామానికి చెందిన స్థపతి రాంజీ సుతార్ అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహ స్థాపనకు ప్రభుత్వం రూ. 146.50 కోట్లు ఖర్చు చేసింది. 

తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు :-

అన్ని రంగాల్లో దార్శనికత తో ముందుకు పోతూ, అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా పాలనలో  దేశానికి ప్రేరణగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ భావించారు. 2019 జూన్ 27న కొత్త భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌  భూమిపూజ, శంకుస్థాపన చేశారు. సచివాలయ నిర్మాణానికి డాక్టర్‌ ఆ సార్‌, పొన్ని కాన్సెస్సావో అనే ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ లు డిజైనర్లుగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్‌ ఆమోదించిన ప్రస్తుత నమూనాతో నూతన సచివాలయం రూపుదిద్దుకున్నది. నూతన సచివాలయాన్ని షాపూర్‌ జీ పల్లోంజి అండ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మించింది. పనులు మొదలయ్యాక 26 నెలల రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేశారు.  మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో 2.5 ఎకరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయానికి “డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యం”గా సీఎం కేసీఆర్ పేరు పెట్టారు. 2023 ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సింహ‌ల‌గ్న ముహుర్తంలో వైభవోపేతంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. నూతన సచివాలయం వేదికగా రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతున్నది. ప్రతి తెలంగాణ వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఈ భవన నిర్మితమైంది. వర్తమానంలో, భవిష్యత్ లో ఎదురయ్యే ఎంతటి క్లిష్ట సమస్యనైనా ఎదుర్కోగలమనే ధీమాను నూతన సచివాలయం అందిస్తున్నది.