స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మానవీయ పాలన అందిస్తున్నారు. అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొంటున్నారు. దివ్యాంగుల్లో ఆత్మస్థెర్యాన్ని నింపేందుకు, ఆత్మన్యూనతా భావాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులను పట్టించుకోకున్నా.. సీఎం కేసీఆర్ దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక నజర్ పెట్టారు. వైకల్యంతో బాధపడుతూ.. సమాన స్థాయి కోసం పరితపిస్తున్న దివ్యాంగుల కోసం నేనున్నానంటూ పెద్దన్నగా తన వంతు పాత్ర పోషిస్తున్నారు. సరిలేరు మాకెవ్వరూ అనే రీతిలో దివ్యాంగులు సమాజంలో తలెత్తుకొని జీవించడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు ఇతరులపై ఆధారడకుండా జీవించేలా ఇప్పటికే ఆసరా పింఛన్‌ను రూ. 3,116 నుంచి రూ. 4,116కు పెంచారు. ఈ నెల నుంచే దాన్ని అమలు చేస్తున్నారు. అలాగే, దివ్యాంగుల కోసం ఎలక్ట్రిక్ స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, వీల్ చైర్లు అందిస్తున్నారు. అన్ని పథకాల్లోనూ వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ సర్కారు దివ్యాంగులకు ఆలంబనగా నిలుస్తున్నది. తాజాగా, గృహలక్ష్మి పథకానికి సబంధించి తెలంగాణ సర్కారు దివ్యాంగులకు తీపి కబురు అందించింది.
వంద ఇండ్లలో ఐదు దివ్యాంగులకే!
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సర్కారు ఇప్పటికే లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లను కట్టి, పంపిణీ చేసింది. ఇందులోనూ దివ్యాంగులకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం సొంత జాగా ఉండి, ఇల్లు కట్టుకోవాలనుకొనేవారికి రూ.3 లక్షలు అందజేస్తున్నది. దీనికి గృహలక్ష్మి అని పేరు పెట్టింది. ఈ పథకంలోనూ దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకొన్నది. అంటే వంద ఇండ్లు మంజూరు చేస్తే.. అందులో ఐదు దివ్యాంగులకే కేటాయించనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించగానే వెంటనే నిర్ణయం తీసుకొన్నారని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. యావత్తు దివ్యాంగుల సమాజం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటుందని తెలిపారు.