హైదరాబాద్, మే 22 : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని మత్స్య భవన్ లో జరిగిన మత్స్య సహకార సొసైటీల చైర్మన్ గా పిట్టల రవీందర్ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రవీందర్ కు మంత్రి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వివిధ కుల వృత్తుల పై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలి, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి లక్ష్యం అన్నారు. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత మత్స్యకారులు నాటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పూడిపోయి, పిచ్చిమొక్కలతో నిండిన చెరువులు మిషన్ కాకతీయ అనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా పునరుద్దరణ, నూతన రిజర్వాయర్ ల నిర్మాణంతో నిరంతరం చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. గతంలో చెరువులపై దళారుల పెత్తనం ఉండేదని, మత్స్యకారులకు మేలు చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు పంచాయతీ రాజ్ పరిధిలో ఉన్న చెరువులను కూడా మత్స్య శాఖ పరిధిలోకి బదిలీ చేసి సర్వహక్కులు మత్స్యకారులకు అప్పగించినట్లు వివరించారు. చేపలను తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని మంత్రి సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద ఎవరు ఊహించని రీతిలో పెరిగిందని, మత్స్య కారులు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. చేపలను అమ్ముకోవడానికి మత్స్యకారులకు ట్రక్ లు, ట్రాలీ ఆటోలు, ద్విచక్ర వాహనాలు సబ్సిడీ పై అందజేసినట్లు చెప్పారు. అదేవిధంగా వివిధ రకాల చేపల వంటకాలను అమ్ముకోనేందుకు వీలుగా సంచార విక్రయ వాహనాలను కూడా అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంకా మిగిలిన అర్హులైన మత్స్య కారులకు కూడా సబ్సిడీపై వాహనాలు అందజేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని ప్రకటించారు. వచ్చే నెల 8 వ తేదీన మృగశిర కార్తె సందర్బంగా మొదటి సారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఫిష్ పుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఫెస్టివల్ లో వివిధ రకాల చేపల వంటకాలను స్టాల్స్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. మత్స్యరంగం పై ఎంతో అనుభవం ఉన్న పిట్టల రవీందర్ చైర్మన్ గా బాద్యతలు చేపట్టడం వలన ఈ రంగం మరింత అభివృద్ధి లో ముందుకు వెళుతుందని చెప్పారు.