టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ ఆర్డీ కన్వెన్షన్ సెంటర్ లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పార్టీ తొలి ప్లీనరీ సమావేశానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొంటారని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నందున రాజధానిపై గులాబీ జెండా ఎగురవేసేందుకు పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టిని సారించనున్నారు.
పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 25 వేల ప్రాథమిక సభ్యత్వం, ఐదువేల క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేయించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో భారీ ఎత్తున సభ్యత్వం నమోదు చేయాలని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు ఈ సమావేశం ద్వారా సూచించనున్నారని తెలిసింది. పార్టీ పునర్నిర్మాణం అత్యంత పటిష్ఠంగా ఉండాలని భావిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కింది స్థాయి అయిన బూత్ కమిటీ నుండి రాష్ట్ర స్థాయి కమిటీ వరకు పకడ్బందీగా ఉండాలని భావిస్తున్నారు. ఇందుకోసం అన్ని దశల్లో కమిటీలు ఏర్పడ్డ తర్వాత శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తారని, అవసరమైతే తానే కొన్ని తరగతులు తీసుకుంటానని గతంలో కేసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే.