mt_logo

టీకాంగ్రెస్‌లో తుఫాన్‌.. కీల‌క ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి త‌న‌ను వేధిస్తున్నాడంటూ ఉత్త‌మ్ ప‌రేషాన్‌!

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టినుంచీ ఆయ‌న ఓ వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. సీనియ‌ర్ల‌ను, త‌న‌కు వ్య‌తిరేకంగా మాట్లాడేవారిని టార్గెట్ చేయ‌డంతో టీకాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఒక‌రిపై ఒక‌రు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు గుప్పించుకొంటున్నారు. త‌న అనుకూల యూట్యూబ్ చాన‌ళ్లు, మీడియా ద్వారా త‌న వ్య‌తిరేక‌వ‌ర్గంపై రేవంత్‌రెడ్డి దుష్ప్ర‌చారం చేయిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. రేవంత్‌రెడ్డి కావాల‌నే త‌మను సైడ్ చేసేందుకు ఓ సోష‌ల్ మీడియా టీంను పెట్టి త‌మ‌పై అస‌త్య ప్ర‌చారం చేయిస్తున్నార‌ని ఇప్ప‌టికే సీనియ‌ర్లు మండిప‌డుతున్నారు. ఇప్పుడు సాక్షాత్తూ ఆ పార్టీ ఎంపీ, సీనియ‌ర్ నాయ‌కుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ఈ బండారాన్ని మీడియా ఎదుట బైట‌పెట్టారు. దీంతో టీ కాంగ్రెస్‌లో తుఫాన్ నెల‌కొన్న‌ది.

ప‌నిగ‌ట్టుకొని నాపై త‌ప్పుడు వార్త‌లు: ఉత్త‌మ్‌

టీకాంగ్రెస్‌లో కీల‌క ప‌ద‌విలో ఉన్న నాయ‌కుడే త‌నను టార్గెట్ చేశార‌ని, ప‌నిగ‌ట్టుకొని త‌న‌పై దుష్ర్ర్ప‌చారం చేస్తున్నార‌ని ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి మండిప‌డ్డారు. తాను పార్టీ మారుతున్న‌ట్టు ప్ర‌చారం చేసి, ప్ర‌జ‌ల్లో త‌న ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు య‌త్నిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. పార్టీలోనూ త‌న‌స్థాయిని దిగ‌జార్చేందుకు కుట్ర‌ప‌న్నుతున్నార‌ని ఆరోపించారు. తాను 30 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నాన‌ని, ఆ పార్టీ త‌ర‌ఫునే ఆరు సార్లు గెలిచిన నాయ‌కుడున‌ని చెప్పుకొచ్చారు. త‌న భార్య కోదాడ‌నుంచి స్వ‌ల్ప మెజార్టీతో ఓడిపోయినా.. ప్ర‌జాక్షేత్రంలో ఉండి కాంగ్రెస్ నాయ‌కురాలిగా ప్ర‌జా సేవ‌చేస్తున్నార‌ని తెలిపారు. అలాంటి త‌మ‌పై అనుకూల‌, సోష‌ల్‌మీడియాతో దాడి చేయించ‌డం స‌రికాద‌ని అన్నారు. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి త‌న మాట‌ల్లో ఎక్క‌డా రేవంత్‌రెడ్డి పేరెత్త‌కున్నా.. ఇవి క‌చ్చితంగా టీపీసీసీ చీఫ్‌నుద్దేశించి చేసిన వ్యాఖ్య‌లేన‌ని ఆ పార్టీ శ్రేణులే చెప్తున్నాయి. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయాల్సిందిపోయి.. పార్టీని రేవంత్‌రెడ్డి విచ్ఛిన్నం చేస్తున్నార‌ని హ‌స్తం నాయ‌కులు మండిప‌డ్డారు.