mt_logo

లక్షల్లో ఉపాధి, కోట్లల్లో పెట్టుబడులు.. తెలంగాణలో సరికొత్త పారిశ్రామిక విప్లవం

• పారిశ్రామిక అభివృద్ధితోనే రాష్ట్ర పురోగతి
• రాష్ట్రాంలో 109 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు

పారిశ్రామిక అభివృద్ధితో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్ఠి చెందుతుందనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద పీట వేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015లో కొత్త పాలసీని రూపొందించి ప్రణాళికాబద్దంగా రాష్ట్రం ముందుకు సాగుతోంది. కొత్త పాలసీ రూపకల్పన ద్వారా తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడం సులభతరమైంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాలు మంజూరు నుండి మౌలిక వసతుల కల్పన, అనుమతుల మంజూరి అన్ని ఆన్‌లైన్ చేసింది. నూతన పారిశ్రామిక విధానం పారదర్శకంగా ఉండటంతో ఎన్నో బహుళ జాతీయ సంస్థలు తెలంగాణలో తమ పెట్టుబడులు పెట్టాయి. ఇంకా చాలా సంస్థలు తెలంగాణ కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే తెలంగాణ యువకులకు ఎన్నో ప్రోత్సహకాలను అందించే విధంగా పాలసీని రూపొందించింది. నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఎంతో మంది తెలంగాణ యువకులు పారిశ్రామిక వేత్తలు కావడమే కాకుండా లక్షల మందికి ఉపాధి కల్పించారు.

కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు…
కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక ప్రజలకు కాలుష్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 1.5 లక్షల ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక వసతులను సమకూరుస్తూ ఇండస్ట్రియల్ పార్కులను రూపొందించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పరిశ్రమలకు అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 109 పార్కులు ఏర్పడ్డాయి. మరో ఐదు సంవత్సరాలలో 70 పార్కుల రూపకల్పనకు ప్రణాళిక సిద్దమయింది.

ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుతో లక్షల మందికి ఉపాధి
తెలంగాణ ప్రభుత్వం 2014 నుండి 2023 వరకు ఈ పార్కుల ఏర్పాటుకు కోట్ల రూపాయలు వెచ్చించింది. అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్దిన 7806 ఎకరాల స్థలాన్ని 3680 సంస్ధలకు కేటాయించింది. ఇక్కడ ప్రారంభమైన పరిశ్రమల ద్వారా ద్వారా 2,63,222 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. చిన్న-మధ్య తరహా పారిశ్రామిక వేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం దండు మల్కాపూర్ గ్రామం వద్ద ఎమ్ఎస్ఎమ్ఈ పథకం ద్వారా 570 ఎకరాలలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రూపొందిస్తోంది. ఇక్కడ 4 వేల మంది చిన్న-మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు రూ.1,200 కోట్ల రూపాయల పెట్టు బడులతో తమ వ్యాపారాలు ప్రారంభించనున్నారు. ఈ పరిశ్రమల ద్వారా మరో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

రైతుకు మద్దతు ధర కోసం ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు
తెలంగాణలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి అధికంగానే ఉంటుంది. ఇక్కడ పండిన పంటలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. రైతులు తమ పంటను మార్కెట్‌కు తరలించేందుకు ప్రభుత్వం మెరుగైన రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసింది. మద్దతు ధర వచ్చే వరకు పండిన పంటను దాచుకునేందుకు గిడ్డంగుల సదుపాయం కల్పించింది. ఇలాంటి పంటలను ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే సంస్థలు తెలంగాణలోనే తమ ఫ్యాక్టరీలు స్థాపించడం ద్వారా తెలంగాణ రైతులకు మద్దతు ధరలు లభిస్తాయనే సదుద్దేశంతో రాష్ట్రంలోని 9 జిల్లాలలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను అభివృద్ధి చేసింది.

ఐటీ పరిశ్రమలకు ప్రత్యేక స్థానం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐటీ పరిశ్రమలు తమ సత్తా చాటుతున్నాయి. టిస్ఐసీసీ ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని ముఖ్య పట్టణాలలో ఐటీ టవర్స్ ను ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు రూ. 33,881 కోట్ల రూపాయల పెట్టుబడులతో తెలంగాణలో తమ డేటా సెంటర్‌లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వారికి అవసరమైన అన్ని వసతులను సమకూర్చింది.

అనుమతుల ప్రక్రియ సులభతరం:
తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సిన అవసరం లేకుండా పారిశ్రామిక వేత్తలు తమ కార్యాలయంలోనే కూర్చుని పని ముగించుకునే విధంగా టిస్ ఐ పాస్ విధానాన్ని రూపొందించింది. ఆన్‌లైన్ ద్వారా అవసరమైన సర్టిఫికెట్లను దాఖలు చేస్తే అధికారులు వాటిని వెరిఫై చేసి ఆన్‌లైన్ ద్వారానే అనుమతులు ఇచ్చేలా ప్రక్రియను సులభతరం చేసింది. ఇందుకోసం నిర్ణీత గడువును కూడా ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా 11 మే 2023 నాటికి 23065 యూనిట్లు అనుమతులు పొంది రూ.2 లక్షల 61 వేల 732 కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. తద్వారా 15 లక్షల 74 వేల 798 మంది ఉపాధి అవకాశాలు పొందారు.

మరో 18,587 యూనిట్లు రూ. 1,54,690 కోట్ల రూపాయల పెట్టబడులతో తమ వ్యాపారాలను ప్రారంభించేందుకు అనుమతులు పొంది త్వరలోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా 9,13,386 మందికి ఉపాధి లభించనుంది.

టీ- ఐడియా ద్వారా నూతన పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు…
తెలంగాణలో నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువ పారిశ్రామిక వేత్తలకు టీ-ఐడియా పథకం ద్వారా ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తోంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాల కొనుగోలులో వారికి రాయితీలు అందిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, ల్యాండ్ కాస్ట్ రీ అంబర్స్ మెంట్, స్టాంప్ డ్యూటీ లో రీఎంబర్స్ మెంట్ లు, కరెంట్ బిల్లులో రాయితీలు కల్పిస్తోంది. వీటితో పాటు అర్హులైన వారికి పావలా వడ్డీకే రుణాలు అందిస్తోంది. రెండు వేల కోట్లకు పైబడిన పెట్టుబడులతో ప్రారంభించి వెయ్యి మందికి పైగా ఉపాధి కల్పించే స్టార్టప్ సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలను అందించనుంది. 2014 నుండి 2023 వరకు 25,068 మంది యువ పారిశ్రామిక వేత్తలకు రూ.3654.57 కోట్ల రూపాయల రాయితీలను అందించింది.

టీ-ప్రైడ్ ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక స్థానం…
షెడ్యూల్డ్ కులాలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు, వికలాంగులకు ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానంలో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి స్థలాల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. వారికి టి-ప్రైడ్ ద్వారా పెట్టుబడి సాయం అందించడం, మార్జిన్ మనీ ని అందించడంతో పాటు పెద్ద పెద్ద సంస్థల నుండి సబ్ కాంట్రాక్టులు ఇప్పించేలా చొరవ చూపుతోంది. టీ-ప్రైడ్ విధానం ద్వారా 2014 నుండి 2023 వరకు షెడ్యూల్డ్ కులాల పారిశ్రామిక వేత్తలకు చెందిన 28,184 యూనిట్లకు రూ.1381.8 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను అందించింది. వికలాంగులకు చెందిన 2104 యూనిట్లకు రూ.114.64 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లోనూ అగ్రస్థానం…
పరిశ్రమలు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తెలంగాణ అనుకూలమైనదని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు తేల్చిచెప్పింది. 2016లో కేంద్ర ప్రభుత్వం ద్వారా లభించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణకు మొదటి స్థానం లభించింది. 2017 మరియు 2018 సంవత్సరాలలో కూడా మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. 2020 సంవత్సరం నుండి ర్యాంకింగ్ విధానాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది.

ఖాయిలపడిన పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం..
నూతన పరిశ్రమల ఏర్పాటుతో పాటు నష్టాల్లో నడుస్తున్న పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకుంటోంది. ఇందుకోసం తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్ ద్వారా కుంటుబడిన 550 పరిశ్రమలకు ప్రభుత్వం ఒక్కో సంస్థకు 10 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించి వాటి పునరుద్దరణకు తోడ్పడింది. రామగుండం ఫర్టిలైజర్స్ పునరుద్దరణకు రూ.154 కోట్ల రూపాయలను వెచ్చించింది. అక్కడ మౌలిక వసతుల కల్పనకు మరో 105 కోట్లను కేటాయించింది. నష్టాల్లో ఉన్న సిర్పూర్ కాగజ్ మిల్ ను పునరుద్ధరించి ఆ పరిశ్రమ ఉద్యోగులను ఆదుకునేందుకు రూ. 87.07 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

పరిశ్రమల నిర్వహణకు దేశంలోనే అత్యంత అనుకూలమైన ప్రదేశం తెలంగాణ రాష్ట్రం అనే విధంగా ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ లను ఏర్పాటు చేసింది. ఈ కౌన్సిల్ ల ద్వారా పారిశ్రామిక వేత్తలు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు వీలవుతుంది.