mt_logo

మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌గా తెలంగాణ వ‌నిత‌.. ఇది వీ హ‌బ్ ఘ‌న‌త‌

  • సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ విజ‌న్‌తో
  • రాష్ట్రంలో మ‌హిళా సాధికార‌త‌

అన్ని రంగాల్లో రాణించే మ‌హిళ‌ల‌కు పారిశ్రామిక రంగం అంటే కాస్త జంకు.. ఎందుకంటే ప్రోత్స‌హించేవారు తక్కువ‌. వెన్నుత‌ట్టేవారు అంతంత మాత్ర‌మే.. అందుకు స‌మైక్య రాష్ట్రంలో ఉమెన్ ఆంత్ర‌ప్రెన్యూర్స్ భూత‌ద్దం పెట్టినా దొరికేవారు కాదు. కానీ ఇది తెలంగాణ‌లో గ‌తం.. ఇప్పుడు తెలంగాణ వ‌నిత‌.. మ‌హిళా పారిశ్రామికవేత్త‌.. పురుషుల‌కు ధీటుగా పరిశ్ర‌మ‌ల‌ను నెల‌కొల్పుతున్న ధీరోదాత్త‌.. ఇదంతా సీఎం కేసీఆర్ సంక‌ల్పం.. మంత్రి కేటీఆర్ విజ‌న్‌తో పురుడు పోసుకొన్న వీ హ‌బ్ ఘ‌న‌త‌. 

తెలంగాణ‌లో ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ స‌ర్కారు   ఉమెన్‌ ఆంత్రప్రెన్యూర్స్‌ హబ్‌(వీ హబ్‌)ను ఏర్పాటు చేసింది.  దేశంలోనే తొలిసారిగా..మంత్రి కేటీఆర్‌ ఆలోచనలకు రూపమిస్తూ 2018 మార్చిలో తెలంగాణ స‌ర్కారు ఏర్పాటు చేసిన ‘వీ హబ్‌’ మహావృక్షంగా ఎదిగి మహిళలకు ప్రతి ఫలాలను అందిస్తున్నది. గడిచిన నాలుగేళ్లలో వీ హబ్‌లో మొత్తం 5,235 స్టార్టప్‌లు రిజిస్ట్రేషన్‌ కాగా.. 4,527 స్టార్టప్‌లకు సపోర్టు చేసింది. 2,194 స్టార్టప్‌లు వీ హబ్‌లోనే ఇంక్యుబేట్‌ అవుతున్నాయి. బ్యాంకు లింకేజీలు, ఈక్విటీ ఫండింగ్‌, స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీమ్‌ తదితరాల ద్వారా రూ.85.21కోట్లను స్టార్టప్‌లకు సమకూర్చింది. నిత్యావసర వస్తువులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, చేనేత వస్త్ర, దుస్తుల తయారీ, ఆరోగ్య, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు చెందిన అనేక స్టార్టప్‌లు వీ హబ్‌లో ఇంక్యుబేట్‌ అవుతున్నాయి. టెక్స్‌టైల్స్‌, హ్యాండ్లూమ్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, హ్యాండిక్రాఫ్ట్స్‌ వంటి రంగాల్లోనూ మహిళా ఆంత్రప్రెన్యూర్స్‌ను ఇంక్యుబేట్‌ చేస్తోంది.

విద్యార్థి దశ నుంచే వెన్నుత‌ట్టి ప్రోత్సాహం

-యువతులను విద్యార్థి దశ నుంచే ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ దిశగా ప్రోత్సహించేందుకు వీ హబ్‌ కృషిచేస్తున్నది. 

-13 నుంచి 17 ఏండ్ల‌ యువత కోసం ఎస్‌టీఈ(ఏ)ఎం ప్రోగ్రాంలో భాగంగా సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, ఆర్ట్స్‌, మ్యాథమెటిక్స్‌లో నైపుణ్యాలను పెంపొందిస్తోంది. ప్రస్తుతం 1,247 మంది విద్యార్థులను ప్రోత్సహించి స్టార్టప్‌లను నెలకొల్పే దిశగా ‘వీ హబ్‌’ తోడ్పాటు అందిస్తున్నది.

-ఒక్క కరీంనగర్‌లోనే 343 మంది దళితబంధు ద్వారా యూనిట్లను ప్రారంభించుకునేందుకు సహకరించి వీ హబ్‌ వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది. ట్రైకార్‌ ద్వారా గిరిజన ఔత్సాహిక మహిళలకు, మైనార్టీ మహిళలకు ‘ఉజాగర్‌’ కార్యక్రమంలో అకౌంటింగ్‌, మార్కెటింగ్‌ వంటి వాటిపై నైపుణ్యం కల్పించి గ్లోబల్‌ మార్కెట్‌లో వ్యాపార వేత్తలుగా ఎదిగేందుకు వీ హబ్‌ ద్వారా సహకారం అందిస్తున్నారు.