mt_logo

తల్లీబిడ్డ క్షేమం.. ప్ర‌తి ఆడ‌బిడ్డ‌కూ తెలంగాణ స‌ర్కారు అభ‌యం

  • అత్యుత్త‌మ ప‌థ‌కాల‌తో స్త్రీ, శిశు సంక్షేమం 
  • దేశానికే తెలంగాణ రోల్ మాడ‌ల్‌

స‌మైక్య రాష్ట్రంలో మ‌నం మాతా శిశు మ‌ర‌ణాల్లో టాప్‌.. పౌష్టికాహారలోపంలో టాప్‌..ప్ర‌సూతి మ‌ర‌ణాల్లో టాప్‌.. మొత్తంగా స్త్రీ, శిశు సంక్షేమంలో అట్ట‌ర్ ప్లాప్‌.. కానీ స్వ‌రాష్ట్రంలో సీన్ రివ‌ర్స్ అయ్యింది. తెలంగాణ‌లో స్త్రీ, మ‌హిళా సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టిపెట్టారు. ‘అమ్మకు ఆత్మీయత.. బిడ్డకు ప్రేమ’తో అనే నినాదంతో కేసీఆర్ కిట్‌ను తీసుకొచ్చారు. అద్భుత పథకాలు.. అద్వితీయ కార్యాచరణతో రాష్ట్రంలోని ప్రతి తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా కడుపులో పెట్టుకొని చూసుకొన్నారు. గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు అంగ‌న్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, మాత్ర‌లు అంద‌జేశారు. గ‌ర్భిణుల‌కు ప్ర‌తినెలా ద‌గ్గ‌రుండి చెక‌ప్‌లు, ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో నార్మ‌ల్ డెలివ‌రీ అయ్యేలా అన్ని ర‌కాల ఏర్పాట్లు చేశారు. ఫ‌లితంగా నేడు మాతా శిశు మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌డంలో తెలంగాణ టాప్‌.. పౌష్ట‌కాహార లోపాన్ని అతి త‌క్కువ‌కాలంలోనే అధిగ‌మించ‌డంలో టాప్‌.. ప్ర‌సూతి మ‌ర‌ణాల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించి, ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లో సుఖ ప్ర‌స‌వాలు నిర్వ‌హించ‌డంలో టాప్‌. ఇదీ సీఎం కేసీఆర్ పాల‌న‌లో తొమ్మిదేండ్ల‌లో సాధించిన ఘ‌న‌త‌. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ పథకాలు దేశంలోనే విప్లవాత్మక స్కీంలుగా ప్రశంసలు అందుకొన్నాయి. తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపాయి.  

తల్లీబిడ్డ క్షేమం కోసం ‘ఆరోగ్య’లక్ష్మి

రాష్ట్రంలోని గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కారు తొలినాళ్లలోనే ఆరోగ్యలక్ష్మి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2015 జనవరి 1న ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించింది. గర్భిణులు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారంతోపాటు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, కాల్షియం మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఆరోగ్య తనిఖీలు, గర్భిణుల బరువు పర్యవేక్షణ, ఇంటింటికీ అంగన్‌వాడీ కౌన్సెలింగ్‌ ఉంటుంది. ఈ పథకం ద్వారా ఆహారపదార్థాల సరఫరా కోసం ఏర్పాటు చేసిన సప్లయ్‌ చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ ఆహార పదార్థాల ఉత్పత్తి, పోషకాల కూర్పు, నాణ్యత నియంత్రణ, పర్యవేక్షణ, ప్యాకేజింగ్‌ తదితర అంశాల్లో దేశంలో అత్యుత్తమ పద్ధతులు పాటిస్తున్నదని నీతి అయోగ్‌ ప్రశంసించింది. కాగా, సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆకు కూరలు, తాజా కూరగాయలను అందించేందుకు రాష్ట్రంలోని 13,531 అంగన్‌వాడీ కేంద్రాల్లో న్యూట్రి గార్డెన్లు ఏర్పాటు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏండ్ల వయసు ఉన్న చిన్నారులకు ప్రీస్కూల్ విద్యను అందిస్తున్నారు. తెలంగాణ వచ్చాక ఇప్పటివరకూ అంగన్‌వాడీ టీచర్లు.. సహాయకులకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణ సర్కారు 354 శాతం వేతనాలను పెంచింది.

పిల్లల రక్షణ, భద్రతకు జాతీయ‌స్థాయిలో ప్ర‌శంస‌లు

-అనాథలు, నిరాదరణకు గురైన పిల్లలను సంరక్షించేందుకు రాష్ట్రంలో 17 శిశు గృహాలు(0-6 ఏండ్ల చిన్నారులకు), 35 బాల సదనాలు (7 నుంచి 18 ఏండ్ల చిన్నారులు) ఏర్పాటు చేసింది..

-హైదరాబాద్‌లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాంగణంలోని శిశువిహార్‌కు జాతీయస్థాయిలో మాడల్‌ చైల్డ్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపు వచ్చింది. శిశు విహార్‌ తరహాలో దేశంలో అన్ని రాష్ర్టాల్లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

-పిల్లల పరిరక్షణ, భద్రత కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బాలరక్ష భవనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి కేంద్రం ప్రశంస లభించింది.

-చైల్డ్‌ 1088తో కలిసి బాల రక్షక్‌ వాహనాల ద్వారా ఆపదలో ఉన్న చిన్నారులను వెంటనే రక్షించి, వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నది. 2021 నవంబర్‌ 14 నుంచి ఇప్పటి వరకూ 9,591 మంది పిల్లలను బాలరక్షక్‌ వాహనాల ద్వారా రక్షించింది. బాల రక్షక్‌ వాహనాల వ్యవస్థను దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ అమలు చేసిందని కేంద్రం కీర్తించింది.

-తెలంగాణ స్టేట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ వెల్ఫేర్‌ పోర్టల్‌ ద్వారా సంరక్షణ, రక్షణ అవసరమైన పిల్లల శ్రేయస్సును ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు 20వేల మంది పిల్లలు ఈ పోర్టల్‌ ద్వారా పర్యవేక్షణ గొడుగు కిందకు వచ్చారు. ఈ పోర్టల్‌కు జాతీయ స్థాయిలో ఈ -గవర్నెన్స్‌ అవార్డు కూడా లభించడం విశేషం.

-దేశంలో ఎకడాలేని విధంగా వినూత్నంగా తెలంగాణ రాష్ట్రం చిన్నారుల దత్తతకు ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ (1098)కు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి.

-గిరిపోషణతో గిరిజ‌నుల‌కు పౌష్టికాహారం

పౌష్టికాహారలోపం అధికంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికల పోషణ స్థితిని మెరుగుపరచడానికి ప్రత్యేకంగా గిరిపోషణ కార్యక్రమాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. చిరుధాన్యాలతో కూడిన అల్పాహారం, స్నాక్స్‌ పోషణలో క్రీయాశీల భూమిక పోషిస్తున్నాయి. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల గిరిజన ఆవాసాల్లో 3,000 మంది గర్భిణులకు ఇప్పపువ్వు లడ్డూను పంపిణీ చేస్తున్నారు.

మహిళల రక్షణకు పెద్ద‌పీట 

1.స‌ఖి కేంద్రాలు

రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం తెలంగాణ సర్కారు అనేక చర్యలు చేపట్టింది సఖి కేంద్రాల ద్వారా బాధిత మహిళలకు సమీకృత సహాయ సేవలను అందిస్తున్నది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సఖి కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాలకు రక్షణ వాహనాలను ప్రభుత్వం అందించింది. డిసెంబర్‌ 2017 నుంచి ఇప్పటివరకు 50,718 మంది మహిళలకు ఈ కేంద్రాల ద్వారా సేవలు అందాయి.

2. షీ ట్యాక్సీ ప‌థ‌కం

మహిళా ప్రయాణికుల భద్రత, మహిళల ఉపాధి కోసం మహిళా డ్రైవర్లకు టాక్సీలు సబ్సిడీని ప్రభుత్వం అందించింది. మహిళలకోసం దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ మోటారు డ్రైవింగ్‌ శిక్షణా కేంద్రాన్ని తెలంగాణ సర్కారు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.

3.ఉచిత పాలిటెక్నిక్ విద్య‌

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో అనాథలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన, నిరాశ్రయులు, లైంగిక హింస, బాల్య వివాహ బాధితులైన బాలికలకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ పాలిటెక్నిక్‌ విద్యను అందిస్తున్నది.

4. వృత్తి శిక్ష‌ణ‌

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా 1,485 మంది మహిళలకు వివిధ రకాల వృత్తులపై తెలంగాణ గ్రేట్‌ ఉమెన్‌ కో-ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా శిక్షణను ప్రభుత్వం అందించింది.

తెలంగాణ స‌ర్కారు సాధించిన ఘ‌న‌త‌

-రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39 (2014) నుంచి 21 (2020)కి తగ్గింది.

-మాతృ మరణాల రేటు 92 (2014) నుంచి 43 (2020)కి తగ్గింది.

-తకువ బరువుతో పుట్టే పిల్లల శాతం 18.4 (2013) నుంచి 13.9 (2020)కి తగ్గింది.

-లింగ నిష్పత్తి (వెయ్యి మంది పురుషులకు స్త్రీలు) 1,007 నుంచి 1,049కి మెరుగుపడింది.

-గృహ హింసను అనుభవించిన 18-49 ఏండ్ల వివాహిత మహిళలు 42.9 శాతం నుంచి 36.9 శాతానికి తగ్గుదల.

-15-19 ఏండ్ల వయసుగల స్త్రీలలో తల్లులు/ గర్భిణుల శాతం 10.6 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గుదల.