గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(వాటర్ గ్రిడ్) పైప్ లైన్ పనులను రూ.15,987 కోట్లతో చేపట్టేందుకు గానూ ఈ-ప్రొక్యూర్ మెంట్ టెండర్ల షెడ్యూల్ ను ప్రకటించింది. ఈనెల 27 నుండి ఆగస్ట్ 11 వరకు ఈ సమాచారం ఆన్ లైన్ లో అందుబాటులో పెట్టనున్నట్లు ఆర్ డబ్ల్యూఎస్ ఇంజినీర్ ఇన్ చీఫ్ బీ సురేందర్ రెడ్డి చెప్పారు. టెక్నికల్ బిడ్లను ఆగస్ట్ 11న, ఫైనాన్స్ బిడ్లను 14న ఖరారు చేయనున్నట్లు, టెండర్ల ప్రకటనను జాతీయస్థాయిలో ప్రాచుర్యం ఉన్న తెలుగు, ఆంగ్ల, హిందీ దినపత్రికల్లో ప్రకటిస్తామని అన్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే రూ. 1500 కోట్లతో ఇన్ టేక్ వెల్స్ పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమైన పైప్ లైన్ పనులు కూడా మొదలు కాబోతుండటంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు వేగవంతం కానున్నాయి. రూ. 15,987 కోట్లతో చేపట్టబోయే ఈ పైప్ లైన్ పనులు మొత్తం 11 ప్యాకేజీల్లో ఉండనున్నాయి.