
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఒంటెత్తు పోకడ పోతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన నియంతృత్వ ధోరణితో కిందిస్థాయి నాయకులు విసిగిపోయారు. ఈటల, కిషన్‌రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయి బండిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను తప్పిస్తేగానీ పార్టీకి మనుగడ లేదని వాదించారు. ఎట్టకేలకు అధిష్ఠానం వద్ద ఈ రెండు వర్గాలు పైచేయి సాధించి.. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవినుంచి తప్పించారు. అంతా ఊపిరి పీల్చుకొన్నారు. బండి స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఇక పార్టీలో అందరికీ సమన్యాయం జరుగుతుందని అనుకొన్నారు. కానీ డ్యామిట్ కథ అడ్డం తిరిగిందని కాషాయ శ్రేణులు తలలుపట్టుకొంటున్నాయి. బండికి మించి నియంతృత్వ ధోరణితో కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.
పార్టీ నాయకుల గొంతునొక్కుతున్న కిషన్‌రెడ్డి!
బీజేపీకి చెందిన నాయకులపై కిషన్‌రెడ్డి మీడియా ఆంక్షలు విధించారు. రాష్ట్ర అధికార ప్రతినిధులు తప్పా ఎవరూ మీడియాలో మాట్లాడొద్దంటూ హుకుం జారీచేశారు. ఎవరికివారుగా టీవీల్లో.. పేపర్లలో కనిపిస్తూ నాయకులుగా చలామణి అవ్వడం ఇకనుంచి తగదన్నట్టు ఆదేశాలిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని మీడియా పాయింట్‌ను ఎత్తివేసి, కిందిస్థాయి నాయకుల గొంతునొక్కుతున్నారనే విమర్శలు సొంత పార్టీలోనే గుప్పుమంటున్నాయి.
అయ్యా కిషన్‌రెడ్డీ.. తమ నోరు మూయించడం కాదు.. పార్టీ వీడుతున్నవారిని ముందు ఆపండి అంటూ ఆయనకు బీజేపీ శ్రేణులు చురకలంటిస్తున్నాయి. మీ రాజకీయ గురువు, అంబర్‌పేట సీనియర్ నేత వెంకట్‌రెడ్డి పార్టీ వీడుతుంటే మీరేం చేస్తున్నారు? అని బీజేపీ నాయకులు కిషన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా నియంతృత్వ ధోరణి వీడి అందరికీ ప్రాధాన్యం ఇస్తేనే తెలంగాణలో బీజేపీ బతికి బట్టకడుతుందని, లేకుంటే నామరూపాల్లేకుండా పోతుందని ఆ పార్టీ నాయకులు తేల్చి చెప్తున్నారు.