సెప్టెంబర్ 1 నుండి విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఆన్ లైన్ విద్య ద్వారా పాఠాలు బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. కోవిడ్ మహమ్మారి వల్ల స్కూళ్లకు నేరుగా విద్యార్ధులను అనుమతించలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు వారి ఇండ్లనుండే పాఠాలు వినాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఆన్ లైన్ ద్వారా పాఠాలు వినాలని ఊరూరా దండోరా వేయిస్తున్నారు. పాఠాలు వినే విధంగా పిల్లలకు తల్లిదండ్రులు సహకరించాలని కొన్ని గ్రామాల్లో చాటింపు వేసి అందరికీ తెలిసేలా చెప్తున్నారు.
దూరదర్శన్ యాదగిరి, టీ శాట్ ఛానళ్ళ ద్వారా 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు, అదేవిధంగా ఇంటర్మీడియట్ పాఠాలు కూడా ప్రసారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మూడు నెలల విరామం తర్వాత స్కూళ్లకు వచ్చిన ఉపాధ్యాయులు గ్రామస్థుల సహకారంతో ఇంటింటికి వెళ్ళి డిజిటల్ పాఠాల టైమ్ టేబుల్ చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు డిజిటల్ క్లాసులు వినేలా సిద్ధం చేస్తున్నారు. అయితే టీవీలు లేని విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు.