mt_logo

తొమ్మిదేండ్ల‌లోనే జీహెచ్ఎంసీ ప్ర‌గ‌తిబాట‌.. మెరుగైన‌ ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థతో బంగారు బాట‌

  • రూ.7,644.55 కోట్లతో మౌలిక వసతుల కల్పన
  • సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ దార్శ‌నిక‌త‌కు నిద‌ర్శ‌నం

ఏ రాష్ట్ర‌మైనా అభివృద్ధి బాట‌పట్టాలంటే రాజ‌ధాని బాగుండాలి. అన్ని వ‌స‌తులు, సౌక‌ర్యాలు ఉంటేనే ఆ న‌గ‌రానికి పెట్టుబ‌డుల వ‌ర‌ద పారుతుంది. ఇందులో ముఖ్యంగా ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ బాగుంటే ఆ న‌గ‌రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుంది. ఈ విజ‌న్‌తోనే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశనంలో మ‌హాన‌గ‌రంలో ప్ర‌జార‌వాణాలో తెలంగాణ స‌ర్కారు విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొచ్చింది. మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన ప్రజా రవాణా కోసం ఆధునిక రోడ్డు వ్యవస్థ, సంక్షేమం, సామాజిక, ఆర్థిక పరమైన అభివృద్ధికి జీహెచ్ఎంసీ పూర్తి తోడ్పాటు అందిస్తున్నది.  తొమ్మిదేండ్ల కాలంలో కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే ఏకంగా రూ.7,644.55 కోట్లు వెచ్చించ‌డం న‌గ‌ర అభివృద్ధిపై తెలంగాణ స‌ర్కారుకు ఉన్న చిత్త‌శుద్దికి నిద‌ర్శ‌నం. ఏండ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఓల్డ్‌ సిటీలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి..బంగారు బాటలు వేసింది. ఫలితంగా పాత నగరానికి కొత్త అందాలు సమకూరాయి. శతాబ్దాలుగా గంగా జమునా తెహజీబ్‌, సుసంపన్న సంస్కృతికి క్షేత్రంగా ఉన్న నగరం ఆ వారసత్వాన్ని పదిలంగా కాపాడుకుంటూ అంతర్జాతీయ నగరాలకు దీటుగా అడుగులు వేస్తున్నది.

వార్డు ఆఫీస్‌లతో ప్రజల చెంత‌కు పాల‌న 

ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ఇప్పుడున్న వ్యవస్థను పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజల ముంగిట్లో పరిపాలన అందించాలని రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ఆలోచన మేరకు వార్డ్‌ ఆఫీసుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రజల ముంగిట్లో పరిపాలనతో పాటు వారి సమస్యలపై వచ్చిన విన్నపాలను వేగవంతంగా పరిష్కరించే దిశగా వార్డు కార్యాలయాలు పని చేస్తాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ హెడ్‌ ఆఫీస్‌, జోనల్‌, సరిల్‌లతో మూడంచెల వ్యవస్థ ద్వారా పరిపాలన కొనసాగుతున్నది. ఈ వ్యవస్థతో ప్రజలకు మరింత ఎకువగా సంతృప్తికరమైన సేవలందించేందుకు 4వ పరిపాలన యూనిట్‌గా వార్డు కార్యాలయం ఏర్పాటు చేశారు.

వార్డు కార్యాలయాల‌తో స‌త్వ‌ర సేవ‌లు

-ప్రజలకు మరింత ఎకువగా సంతృప్తికరమైన సేవలందించేందుకు 4వ పరిపాలన యూనిట్‌గా వార్డు కార్యాలయం రూపుద్దిదుకున్నది. 

-ఒక్కో వార్డు కార్యాలయంలో 10 మంది సిబ్బందితో 150 వార్డుల్లో ఆఫీసులు ఏర్పాటు చేశారు. 

-ఇందులో వార్డు పరిపాలన అధికారి ప్రధాన భూమిక పొషించనున్నారు. 

-ఈ అధికారితో పాటు ఇంజినీరింగ్‌, ఎంటమాలజీ, శానిటేషన్‌, అర్బన్‌ కమ్యూనిటీ, బయోవర్సిటీ, విద్యుత్‌, జలమండలి సిబ్బంది పనిచేస్తారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌, ట్విట్టర్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, డయల్‌ 100, కంట్రోల్‌ రూమ్‌ ద్వారా వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించి సంబంధిత ఫిర్యాదుదారులకు వెంటనే సమాచారం తెలియజేస్తారు. 

-ఈ వార్డు పాలన శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది.