mt_logo

నూత‌న క‌ట్ట‌డాల‌కు నెల‌వు.. ప్ర‌పంచ‌మే అబ్బుర‌పోయేలా తెలంగాణ రాజ‌ముద్ర‌లు!

  • మ‌న నిర్మాణ కౌశ‌లానికి అంత‌ర్జాతీయ అవార్డులు
  • సీఎం కేసీఆర్ సంక‌ల్పానికి చారిత్ర‌క ప్ర‌తీక‌లు
తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డితే చీక‌ట‌వుతుంది.. తెలంగాణ‌వాళ్ల‌కు ప‌రిపాల‌న చేత‌కాదు.. అత్యంత వెనుక‌బ‌డిపోతుంది.. ఇవీ సీమాంధ్ర పాల‌కుల శాప‌నార్థ‌నాలు.. ఆ శాప‌నార్థాల‌నే దీవెనార్థులుగా తీసుకొని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్ర‌పంచ‌మే అబ్బుర‌ప‌డేలా తీర్చిదిద్దారు. ఫ‌లితంగా  తెలంగాణ నిన్నటి చీకట్లను చీల్చుకొని వెలుగుల వైపు పరుగులు తీస్తున్నది. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నది. స్వపరిపాలన, సుపరిపాలనతో వెల్లివిరుస్తున్న నూతనోత్సాహం అపూర్వ, అద్భుత నిర్మాణాలు, పునర్నిర్మాణాల రూపంలో వ్యక్తమవుతున్నది. చరిత్ర కొత్తయుగంలోకి ప్రవేశించినప్పుడు సమకాలీన ముద్రతో కొత్త ప్రతీకలు ముందుకు వస్తాయి. కాలం చెల్లి పోయిన పాత ప్రతీకలు వెనుకకుపోతాయి. కొత్త ప్రతీకలు ఆ కాలపు ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అద్దం పడతాయి. దార్శనిక నేత మార్గదర్శకత్వంలో అవి సమున్నతంగానే కాదు.. చారిత్రక శోభతో అలరారుతాయి. సాధించిన అభివృద్ధి తాలూకు ఠీవి వాటిల్లో ద్యోతకమవుతుంది. ఈ నిర్మాణ, పునరుద్ధరణ శరపరంపరలో కాళేశ్వరం నుంచి అమరుల జ్యోతి దాకా ఎన్నో ఉన్నాయి. మ‌న కీర్తిని ప్ర‌పంచానికి చాటాయి.
మ‌న క‌ట్ట‌డాల‌కు లండ‌న్ ఫిదా
సీఎం కేసీఆర్ సంక‌ల్పంతో యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం ఆధ్యాత్మిక వైభవంలో కొత్తపుంతలు తొక్కింది. వెయ్యేండ్ల దాకా చెక్కుచెదరని దివ్యధామంగా చరిత్రకెక్కింది. అత్యల్ప కాలంలో రూపొందిన అద్భుత నిర్మాణంగా కాళేశ్వరం రికార్డులు సొంతం చేసుకున్నది. నభూతో నభవిష్యతి అన్నట్టుగా అమరులకు మహోన్నత నివాళిగా రూపుదిద్దుకున్న అమరజ్యోతి అపురూప కట్టడం గా నిలిచింది. ఇలా ప్రపంచమే తిరిగి చూసే నూతన కట్టడాలకు తెలంగాణ నెలవుగా మారింది. నీటి గోస తెలంగాణ నాటి కథ. నేటి తెలంగాణ ఓ జలబాండాగారం. దేశానికి అన్నపూర్ణ. నలుగురికీ నీడనిచ్చే చల్లని చెట్టు. ఈ విజయాలకు, వైభవాలకు తగినట్టుగా నిర్మాణాలు ఏర్పడటం విశేషం. సీఎం కేసీఆర్‌ మనోఫలకం మీద ఆవిష్కృతమై, నేత్రపర్వంగా సాక్షాత్కరించిన ఆ నిర్మాణాలను అంతర్జాతీయ అవార్డులు వరించడం ముదావహం. లండన్‌కు చెందిన గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ వివిధ క్యాటగిరీల్లో 2023 సంవత్సరానికి గాను ప్రకటించిన అవార్డుల్లో ఐదు విశిష్ట నిర్మాణాలు, పునర్నిర్మాణాలు విజేతలుగా నిలువడం తెలంగాణకు గర్వకారణమైన విషయం. పైగా మన దేశానికి ఈ గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు రావడం ఇదే ప్రథమం. అందులో ఒకేసారి ఐదు విభాగాల్లో మన రాష్ట్రానికి అవార్డు రావడం మరో ప్రత్యేకత.
అద్భుతమైన ఆధ్యాత్మిక నిర్మాణాల్లో యాదగిరిగుట్ట ఆలయం అవార్డు గెల్చుకున్నది. అతి సుందరంగా నిర్మించిన కార్యాలయ భవనాల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం అవార్డుకు ఎంపికైంది. ప్రత్యేక కార్యాలయ క్యాటగిరీలో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అగ్రభాగాన నిలిచింది. ప్రత్యేక డిజైన్‌ వంతెనల శ్రేణిలో దుర్గం చెరువు కేబుల్‌ వంతెన, హెరిటేజ్‌ పునరుద్ధరణ విభాగంలో మొజంజాహీ మార్కెట్‌ విజేతలుగా నిలిచాయి. ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్ తరాలు దృష్టిలో పెట్టుకొని రాజీ లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో, పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా జరిగిన కట్టడాల నిర్మాణం, పునరుద్ధరణ కృషికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే వరల్డ్‌ గ్రీన్‌ సిటీ, ట్రీ సిటీ ఆఫ్‌ ద వరల్డ్‌ వంటి అవార్డులు మన రాష్ట్రం గెల్చుకున్నది. తాజాగా ప్రకటించిన గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు తెలంగాణ కీర్తి కిరీటంలో మరో ఐదు కలికి తురాయిలు.