mt_logo

వీఆర్ఏల క్రమబద్దీకరణ దేశ చరిత్రలో నిలిచిపోతుంది 

గ్రామ సేవకులుగా ఉన్న వీఆర్ఏ లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపును ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి హైదరాబాద్ జిల్లా పరిధిలో వివిధ శాఖలకు కేటాయించబడిన 66 మంది వీఆర్ఏ లకు నియామక పత్రాలను అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి గ్రామ సేవకులుగా సేవలు అందిస్తున్న రాష్ట్రంలోని వీఆర్ఏ లు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వివిధ ప్రభుత్వ శాఖల్లో వారి వారి విద్యార్హతల ఆధారంగా వీరిని జూనియర్ అసిస్టెంట్, హెల్పర్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ తదితర కేటగిరీలలో నియమించడం జరిగిందని వివరించారు. హైదరాబాద్ జిల్లాకు 182 ని కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. వీరిలో 40 మంది హైదరాబాద్ జిల్లాకు చెందిన వారు  కాగా, 26 మంది మెదక్, 62 మంది కామారెడ్డి, 17 మంది జనగాం, 37 మంది మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు చెందిన వీఆర్ఏ లు ఉన్నారని తెలిపారు. నూతనంగా నియమితులైన వారికి మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.