mt_logo

మ‌న ద‌ళిత‌బంధుకు ప్ర‌పంచ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ప్ర‌శంస‌

  • ద‌ళిత బంధు డ‌బ్బుల‌తో నిర్వ‌హిస్తున్న 
  • అమెరిక‌న్ టూరిస్టర్ షోరూం చూసి అశ్చ‌ర్యం

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లోని ద‌ళితుల త‌ల‌రాత‌లు మార్చేందుకు తెలంగాణ స‌ర్కారు ద‌ళిత బంధు ప్ర‌వేశ‌పెట్టింది. ద‌ళితులు తమ కాళ్ల‌పై తాము నిల‌బ‌డేలా.. పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపార‌వేత్త‌లుగా ఎదిగేలా రూ. 10 ల‌క్ష‌ల‌ను పూర్తి స‌బ్సిడీపై అంద‌జేస్తున్న‌ది. ఇప్ప‌టికే రాష్ట్రంలోని చాలామంది ద‌ళిత బంధుతో య‌జ‌మానులుగా మారిపోయారు. రైస్ మిల్లులు, షాపులు, వివిధ వ్యాపారాలు నిర్వ‌హిస్తూ ఇత‌రుల‌కూ ఉపాధి క‌ల్పిస్తున్నారు. కాగా, తెలంగాణలో అమల‌వుతున్న‌ దళిత బంధు పథకానికి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ గూగుల్ ఫిదా అయ్యింది. ఈ ప‌థ‌కం ఎంతో బాగున్నదని గూగుల్‌ టీమ్‌ ప్రశంసించింది. వ్యవసాయ క్షేత్రాల సరిహద్దుల సేకరణ కోసం గౌరవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని గూగుల్‌ టీమ్‌ సభ్యులు గురువారం కరీంనగర్‌ జిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం గురించి వివరించారు. కరీంనగర్‌లోని కోర్టు రోడ్‌లో దళితబంధు పథకం కింద నిర్వహిస్తున్న అమెరికన్‌ టూరిస్టర్‌ షో రూమ్‌ను చూపించగా, వారు ఆశ్చ‌ర్య‌పోయారు.

ప్రతి నెలా ఎంత వ్యాపారం జరుగుతున్నది? ఇంత పెద్ద ఇంటర్నేషనల్‌ షాపు నిర్వహించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అని లబ్ధిదారు అజయ్ ని అడిగారు. ప్రతి నెలా రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వ్యాపారం జరుగుతున్నదని, ఇలాంటి షాపు కరీంనగర్‌లో ఒకటి మాత్రమే ఉండటంతో తక్కువ కాలంలోనే ఎక్కువ ఆదరణ పెరిగిందని అజ‌య్ స‌మాధాన‌మిచ్చారు.  గూగుల్‌ టీమ్‌ లీడర్‌ గౌరవ్‌ అగర్వాల్‌తోపాటు సభ్యులు మాట్లాడుతూ.. ఇంత చిన్న నగరంలో అమెరికన్‌ టూరిస్టర్‌ ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ షో రూం ఉండటం, అందులో దళితబంధు పథకం కింద పెట్టడాన్ని అభినందించారు.ఏడాది కాలంగా మంచి లాభాలు గడిస్తున్న లబ్ధిదారులను అభినందించారు. ఇలాంటి పథకాలతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తున్నదని, రాష్ట్ర తలసరి ఆదాయం కూడా పెరుగుతుందని వారు పేర్కొన్నారు.