mt_logo

పోడుకు ప‌ట్టాభిషేకం.. ఫలించనున్న గిరిజనుల కల

అడవి బిడ్డలకు అడవుల మీద ప్రేమ ఉంటుంది. వారి జీవన సంస్కృతి అడవులతో ముడిపడి ఉంటుంది. వారు అడవులను ప్రాణంగా చూసుకుంటారు. ఎట్టి పరిస్థితిల్లోనూ హాని తలపెట్టరు. వారి జీవిక కోసం అడవుల్లో దొరికే తేనె, బంక, పొయ్యి కట్టెలు, ఇతర ఉత్పత్తుల కోసం మాత్రమే వారు అడవులను ఉపయోగించుకుంటారు. ప్రభుత్వం వారి జీవనహక్కును కాపాడుతుంది. సమస్య అంతా కూడా బయటి నుంచి పోయి భూములను ఆక్రమించి, సంపదను నరికి, దుర్వినియోగం చేసే వారితోనే, వారి స్వార్థానికి అడవులను బలి కానివ్వమని, పోడు భూముల సమస్య పరిష్కారమైన మరుక్షణం నుంచి అటవీ భూముల రక్షణ కోసం ప్రభుత్వం పటిష్టమైన చర్యలు ప్రారంభిస్తుందని సీఎం కేసీఆర్‌ తెలియజేశారు. గిరిజనులు ఇప్పటికే సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తామని ఇటీవల కేసీఆర్‌ తెలిపారు. ఇందుకోసం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.  ఈ కార్యాచరణ వల్ల గిరిజనులు, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నిండ‌నున్నాయి. వారి ఏండ్ల క‌ల నెర‌వేర‌నున్న‌ది. 

గిరిజనుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. వివాదాల్లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి రంగం సిద్ధమైంది. ఈ నెలలోనే పట్టాలు పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ, గిరిజన, రెవెన్యూ శాఖల సమన్వయంతో చేసిన కసరత్తు దాదాపుగా పూర్తికావచ్చింది. పోడు భూముల పట్టాల పంపిణీ దస్త్రంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేసిన విషయం తెలిసిందే.

పోడు భూములకు పట్టాలిచ్చే విషయమై రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లోని 295 మండలాలు, 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో అటవీ హక్కుల కమిటీలు క్షేత్రస్థాయిలో నెలలపాటు కసరత్తు చేశాయి. 12,49, 296 ఎకరాలకు 4,14,353 క్లెయిమ్స్‌ను ఈ ఫారెస్ట్‌ కమిటీలు వివిధ స్థాయిల్లో పరిశీలించాయి. 4,05,601 ఎకరాలకు సంబంధించి 1,50,012 మంది లబ్ధిదారులు పోడు పట్టాలకు అర్హత కలిగి ఉన్నారని తేల్చారు. ఇప్పటికే పట్టాల పంపిణీపై గిరిజన, అటవీ, రెవెన్యూ శాఖల అధికారుల సంతకంతో పాటు, లబ్ధిదారుడి ఫొటో ఉండేలా పట్టాదారు పాస్‌బుక్‌లు సిద్ధమయ్యాయి.

భూమి అన్యాక్రాంతం కాకుండా పాలిగాన్ టెక్నాల‌జీ

-భవిష్యత్తులో అటవీ భూమి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కాకుండా పాలిగాన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. 

-ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. 

-పంపిణీ చేసిన తర్వాత భవిష్యత్తులో ఇరుగుపొరుగు వారితో భూ హద్దు వివాదాలు తలెత్తకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఈ టెక్నాలజీని వినియోగించినట్టు అధికార యంత్రాంగం తెలిపింది.

-భూ సర్వే నెంబర్‌, పంపిణీ చేసే భూమి విస్తీ ర్ణం, ఆ భూమి ఏ అక్షాంశ, రేఖాంశాల మధ్య ఉన్నది? సంబంధిత భూ హద్దులేవి? వంటి అంశాలను గూగుల్‌ మ్యాపింగ్‌ వివరాలతో పాటు హాలోగ్రామ్‌ను పోడు పట్టాలలో పొందుపరుస్తున్నారు. 

-పంపిణీ విషయంలో కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

-పోడు భూములకు కూడా భవిష్యత్తులో రైతుబంధు పథకం వర్తింపజేస్తామని కూడా ముఖ్యమంత్రి తెలిపారు.

సీఎం కేసీఆర్ సాహ‌సోపేత నిర్ణ‌యం

ఏండ్ల తరబడి పోడు భూముల రగడ రగులుతున్నది. అటవీ అధికారులకు, ఆదివాసీ బిడ్డలకు మధ్య నిత్యం పోరు నడుస్తున్నది. ఈ పోడు గొడవల్లోనే ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడి లో ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. తాము సాగు చేస్తున్న పోడు భూముల్లోకి ఫారెస్ట్‌ ఆఫీస ర్లు చొరబడుతున్నారని, తమ పంటలను నాశ నం చేస్తున్నారని గిరిజన బిడ్డలు గగ్గోలు పెడుతున్నారు. అటవీశాఖ భూముల్లోని చెట్లను నరుకుతూ, అటవీ సంపదను నాశనం చేస్తూ, భూములను ఆక్రమించుకుంటున్నారని ఫారెస్ట్‌ ఆఫీసర్లు అంటున్నారు. ఈ ఇద్దరి వాదన సరైనదే, అసలు పరిష్కారం పోడు భూముల పట్టాల పంపిణీనే. ఈ సమస్యకు పుల్‌స్టాప్‌ పెట్ట డం కోసం సీఎం కేసీఆర్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కార్యాచరణను చేపట్టారు. పోడు భూముల పట్టాల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం జీవో 140 జారీ చేసింది. భవిష్యత్తులో ప్రతీ గిరిజనుడికి న్యాయం జరిగేలా, అటవీ, రెవె న్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. గిరిజనుల వివరాలు నమోదు చేసి పంచాయతీ కార్యదర్శికి తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. అడవుల నడిమధ్యలో సాగవుతున్న పోడు వ్యవసాయాన్ని తరలించి, అడవి అంచున భూమిని కేటాయించి ఆ భూములకు పట్టాలిచ్చి, వ్యవసాయానికి నీటి వసతి, కరెంటు సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. దీనివల్ల అడవులు నరికివేత కూడా నివారించబడుతుంది.