mt_logo

తెలంగాణ పోరు యాత్రకు నల్లగొండ జననీరాజనం

ఫొటో: కోదాడ పోరుయాత్ర సభకు హాజరైన జనంలో ఒక భాగం  

రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఖమ్మం జిల్లా పాల్వంచలో ప్రారంభమైన తెలంగాణ ప్రజా పోరుయాత్ర ఆదివారం నల్లగొండ జిల్లాలో విజయవంతంగా సాగింది.పాలేరు బ్రిడ్జి వద్ద వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రకు ఎదురేగి స్వాగతం పలికారు. అక్కడి నుండి మొదలైన యాత్ర కోదాడ, మునగాల, సూర్యాపేట, నకిరేకల్ మీదుగా నల్లగొండకు చేరుకుంది. అన్ని ప్రాంతాల్లోనూ సీపీఐ, జేఏసీ, టీఆర్‌ఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు, తెలంగాణవాదులు ఘన స్వాగతం పలికారు. కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, నల్లగొండ టౌన్లలో జరిగిన బహిరంగసభలకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.

కోదాడ టౌన్ లో సి.పి.ఐ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ మాట్లాడుతూ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు. ఈ విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వైఖరిని కూడా ఆయన ఎండగట్టారు.

ఫొటో: కోదాడ టౌనులో సి.పి.ఐ. కార్యకర్తల తెలంగాణ కదన కవాతు 

ఫొటో: నకిరేకల్ పోరుయాత్ర సభకు హాజరైన ప్రజానీకానికి అభివాదం చేస్తున్న నారాయణ, ఇతర తెలంగాణ నాయకులు 

రాత్రి నల్లగొండలోని తెలంగాణచౌక్ వద్ద జరిగిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడుతూ తెలంగాణ కోసం 800మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోలేదన్నారు. ఇక తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితని, ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఆత్మహత్య తప్పదని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ విల్సన్, ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *