
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పీఏసీకి ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో.. సభా సంప్రదాయాల ప్రకారం.. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా నియమించడం ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ మాత్రం అసెంబ్లీ నియమావళికి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతులను తుంగలో తొక్కుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేకి చైర్మన్ పదవి కట్టబెట్టింది.
పీఏసీ సభ్యుల ఎన్నిక ‘Rules of Procedure and Conduct of Business in the Telangana Legislative Assembly’ రూల్ 250ని అనుసరించి ‘Principle of proportional representation by means of single transferable vote’ ద్వారా జరగాలి.
Rule 250 ప్రకారం 9 మంది పీఏసీ సభ్యులను అసెంబ్లీ నుండి ఎన్నుకోవాలి. బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య పీఏసీ ఏర్పాటు చేసే నాటికి 38.. అంటే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిటీలో ఉండాలి. ఆ ముగ్గురు సభ్యులను 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూల్ 250 అనుసరించి ఎన్నుకోవాల్సి ఉంటుంది.

38/3=12.67 అంటే ఒక్కో సభ్యున్ని ఎన్నుకోవడానికి సుమారు 13 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. పార్టీ ఫిరాయించిన అరికెపూడి గాంధిని బీఆర్ఎస్‌కు చెందిన ఏ 13 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారో అసెంబ్లీ స్పీకర్‌కే తెలియాలి.
1958-59 నుండి ప్రతిపక్ష సభ్యున్ని పీఏసీ చైర్మన్‌గా ఎన్నుకోవడం ఆనవాయితీ అని ‘Telangana Legislative Assembly Handbook for Members’ పేజీ 65 లో స్పష్టంగా చెప్పబడింది.

పార్టీ ఫిరాయించిన ఆరికెపూడి గాంధీ ఎన్నికను అసెంబ్లీ స్పీకర్ ఎలా ఆమోదించారు? పీఏసీ చైర్మన్‌గా ఎలా నియమించారు? అని పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని ప్రతీ రోజు విమర్శించే కాంగ్రెస్.. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా చేయని దుశ్చర్య చేసింది. 543 సభ్యులు ఉన్న లోకసభలో 2014లో కేవలం 44 మంది సభ్యులు కాంగ్రెస్‌కు ఉన్నపటికీ కేవీ థామస్‌ను, మల్లిఖార్జున ఖర్గేను పీఏసీ చైర్మన్లుగా లోక్‌సభ స్పీకర్ నియమించారు.. కేబినెట్ ర్యాంక్ కలిపించారు.
అలాగే 2019-24 మధ్యలో కేవలం 54 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన అధీర్ రంజన్ చౌదరిని పీఏసీ చైర్మన్‌గా నియమించారు. ఇప్పుడు 99 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్‌కు చెందిన కేసీ వేణుగోపాల్‌ను పీఏసీ చైర్మన్‌గా నియమించారు.
రాజ్యాంగాన్ని కాపాడతాం అని ప్రగల్భాలు పలుకుతున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అన్ని నియమాలని బేఖాతరు చేస్తూ అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించడం పట్ల బీఆర్ఎస్ నాయకులు, ప్రజస్వామికవాదులు మండిపడుతున్నారు.