mt_logo

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బురద రాజకీయాలు చేస్తుంది: మాజీ మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ.. బురదచల్లే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని వివరించడానికి.. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి.. తెలంగాణ భవన్‌లో హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ బురద రాజకీయాలకు పాల్పడుతున్నది. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల ఉపయోగం… వీటన్నింటి సమాహారం కాళేశ్వరం. మొన్న మీరు మేడిగడ్డ వెళ్తుంటే ఎమ్మెల్యేలకు పచ్చని పొలాలను చూపించాల్సింది అని హరీష్ రావు అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరెంత తక్కువ చేసి మాట్లాడినా అది ముమ్మాటికి తెలంగాణకు వరదాయిని. తెలంగాణ ప్రజలకు జీవ ధార. లోయర్ మానేరు నుంచి సూర్యపేట దాకా, నిండిన చెరువులు, పండిన పంటలు, భూమిలో పెరిగిన ఊటలు, మోటారు లేకుండనే ఉబికివస్తున్న బోర్ల పంపులు ఇవన్నీ కాళేశ్వరం ఫలాలే అని తెలిపారు.

కూడెల్లి వాగు పొంగిందన్నా, హల్దీ వాగు దుంకిందన్నా, అన్నపూర్ణ రిజర్వాయర్ నిండిందన్నా, రంగనాయక్ సాగర్ నిండిందన్నా, మల్లన్న సాగరం నిండిందన్నా, కొండ పోచమ్మ సాగర్ నిండిందన్నా అది కాళేశ్వరం ప్రసాదించిన ఫలితమే అని స్పష్టం చేశారు.

పెరిగిన పంటరాశుల్లో ప్రతిబింబించింది కాళేశ్వరమే. ఇవాళేదో రెండు పిల్లర్లు కుంగినయని, తెలంగాణకు ప్రాణాధారమైనజీవాధారను మీరు అవమానిస్తున్నరు. అలక్షంచేస్తున్నరు. రాజకీయ లబ్ధి కోసం మొత్తం ప్రాజెక్టునే డ్యామేజ్ చేయాలనే దుష్ట పన్నాగం పాల్పడుతున్నారు అని విమర్శించారు.

కుంగిన పిల్లర్లకు రిపేర్లు చేయించండి పొలాలకు నీళ్లు మళ్లించండి అని శాసనసభ ద్వారా చెప్పాము. విచారణలు జరిపించండి. బాధ్యులయిన వారిని నిరభ్యంతరంగా శిక్షించండి. కానీ ప్రజల ప్రయోజనాలకు గండి కొట్టకండి. తెలంగాణ రైతుల నోట్లో మన్ను కొట్టకండి అని విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలిపారు.

కడెం వాగు ప్రాజెక్టులు కట్టంగనే కొట్టుకుపోయింది.. పునరుద్ధరించారు. సింగూరు డ్యాం, ఎల్లంపల్లి, సాత్నాల ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయి.. పుట్టగండి ప్రాజెక్టు ప్రారంభించగానే కొట్టుకుపోయింది. కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫై ఓవర్ కూలి చనిపోయారు. పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఇలాంటి ఘటనలు జరిగితే కారకులను శిక్షించి, పునరుద్ధరణ చేసి.. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తారు అని అన్నారు.

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొన్ననే కాళేశ్వరం స్టడీ టూర్‌కు వచ్చి, నేర్చుకున్నరు.. ప్రశంసించారు. మీరేమో రాజకీయ లబ్ధి కొరకు రేపు డైవర్షన్ టూర్ పెట్టుకున్నరు. ఇంజినీర్లు నిన్న వాస్తవాలు చెబుతుంటే, వారిని దబాయించి మాట్లాడుతున్నారు. వాస్తవాలు బయటకు చెప్పాలి అని పేర్కొన్నారు.

98,570 ఎకరాల కొత్త ఆయకట్టు అని చూపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్స్ ద్వారా 546 చెరువులు నింపి 39 వేల ఎకరాలకు నీల్లు అందించాం. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ నీళ్లకు కలుపడం ద్వారా 2,143 చెరువులు నింపాం. తద్వారా లక్షా 67 వేల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. దీంతో పాటు ఇవి కాకుండా 17లక్షల ఎకరాలను స్టెబిలైజ్ చేశాం. మొత్తంగా 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు నీళ్లు అందించాం.
హల్దీ వాగు, కూడవెళ్లి వాగులో 20వేల ఎకరాలకు నీళ్లు అందింది. ఇదేది ఇంజినీర్లు చెప్పకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు.

మొత్తం 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ప్రయోజనం అందింది. వాస్తవాలు మరుగున పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మసి పూసి మారేడుకాయ చేసిన చందంగా ఉన్నది. నిజానికి ఏ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలోనైనా మొదట హెడ్ వర్క్స్ .. అంటే డ్యాంలు, బరాజ్‌లు, స్పిల్ వే గేట్లు, జలాశయాలు, ఎత్తిపోతల పథకాలు అయితే పంప్ హౌస్‌లు , సర్జిపూల్స్, విద్యుత్ సబ్ స్టేషన్‌లు, విద్యుత్ లైన్లు, డెలివరీ సిస్టర్న్‌లు తదితర అనుబంధ నిర్మాణాలు పూర్తి చేస్తారు. వీటి పైననే ప్రభుత్వాలు నిధులు కేటాయించి ఖర్చు చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఎందుకంటే ఇవి నిర్మాణం కాకుండా ఆయకట్టుకు నీరివ్వలేము. వీటి తర్వాతనే ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణంపై ఖర్చు చేయడం జరుగుతుంది అని అన్నారు.

మీరు కూడా కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ విషయంలో పనులు పూర్తి చేయక, నీళ్ళు ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చాక అన్ని పూర్తి చేసి నీళ్ళు అందించాం అని కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేశారు.

కాంగ్రెస్ హయాంలో 27వేల ఎకరాలకు మాత్రమే కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తే, మేము అన్ని పనులు పూర్తి చేసి 6 లక్షల 36 వేల 700 ఎకరాలకు నీళ్లు అందించాం. మేము చేసిన పనులు మీరు చేయండి. కాళేశ్వరం కాల్వలు తవ్వండి పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వండి. నీళ్లు ఇచ్చామని చెప్పుకోండి అని సూచించారు.

మా మీద బురద చల్లే ప్రయత్నంలో రైతులకు అన్యాయం చేయకండి. లేదంటే ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీళ్ల ఇబ్బంది వస్తుంది. రీ ఇంజనీరింగ్ వలన ప్రాజెక్టు అంచనా వ్యయం అనివార్యంగా పెరుగుతుంది. ప్రాణహిత చేవెళ్ళ ఆంచనా విలువల 17 వేల కోట్లతో మొదలై 38 వేల కోట్లకు పెరిగి కేంద్ర జల సంఘానికి నివేదించే నాటికి 40 వేల కోట్లకు పెరిగింది. తట్ట మట్టి ఎత్తకుండానే ప్రాజెక్టు అంచనా విలువ 17 వేల కోట్ల నుంచి 40 వేల కోట్లకు ఎందుకు పెరిగినట్టు అని ప్రశ్నించారు.

కాళేశ్వరం విషయంలో జలాశయాల సామర్థ్యం పెంచాం. కొత్త జలాశయాలు ప్రతిపాదించాం. జలాశయాల సామర్థ్యాన్ని పెంచినందున భూసేకరణ, పునరావాసం కోసం అదనంగా ఖర్చు పెరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎందుకు నీళ్లు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చాయి. రైతులను అడగండి. ఏది నిజం ఏది అబద్ధం ప్రజలకు తెలుసు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాలలో మీ పాలనలో ఎందుకు నీళ్లు ఇవ్వలేదు అని హరీష్ రావు అడిగారు.

మీ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు అయితే, మా హయాంలో రన్నింగ్ ప్రాజెక్టులు చేశాం.. 90 శాతం పనులు పూర్తి చేశాం. మిగతా పని చేసి కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వండి అని అన్నారు. వరద కాల్వ గతంలో మూడేండ్లు, నాలుగేండ్లు చుక్క నీరు ఉండేది కాదు. నేడు నిండు కుండలా మారాయి. వరద కాల్వ వరద ప్రదాయిని అయ్యింది కాళేశ్వరం వల్ల అప్పర్ మానేరులో బండలు తేలితే నాడు, నేడు అప్పర్ మానేరు మండుటెండల్లో మత్తళ్లు దుంకుతున్నది అని మాజీ మంత్రి గుర్తుచేశారు

దయచేసి పునరుద్దరణ చర్యలు చేపట్టండి. విచారణకు మేము సిద్ధం మేము ఎలాంటి తప్పు చేయలేదు. రైతులకు న్యాయం జరిగేలా చూడండి. టెక్నికల్ సమస్య తెలుసుకొని యుద్ధప్రతిపాదికన పనులు చేయాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.