హైదరాబాద్, మే 23: దళిత వైతాళికుడు, దళిత మహిళలు, విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ 135వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. మహనీయుడు భాగ్యరెడ్డి వర్మను గౌరవించుకోవడం తో పాటు వారి స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగించేందుకు వారి జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని సీఎం తెలిపారు.
హైదరాబాద్ సంస్థానంలో దళిత బాలికల కోసం పాఠశాలలను స్థాపించి వారి విద్యాభివృద్ధికి, ఉన్నతికి భాగ్యరెడ్డి వర్మ గట్టి పునాదులు వేశారని సీఎం అన్నారు. దళిత జాతి విద్యా వికాసానికి, సాహిత్యం, హరికథలు, ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావటానికి మాదరి భాగ్యరెడ్డి వర్మ విశేషంగా కృషి చేశారని సీఎం కొనియాడారు. భాగ్య రెడ్డి వర్మ స్ఫూర్తితో ఎస్సీ కులాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని సీఎం అన్నారు. షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక ప్రగతి నిధి, విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు టి ఎస్ ప్రైడ్, నిరుపేద ఎస్సీ కుటుంబాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఎస్సీలకు గొప్ప భవిష్యత్ ను అందించేందుకు గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యాబోధన వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలతో ఎస్సీల సమగ్రాభ్యున్నతికి ప్రభుత్వం గొప్ప కార్యాచరణను అమలు చేస్తున్నదని సీఎం అన్నారు.
ఎస్సీల సంపూర్ణ వికాసానికి, వారి స్వయం సమృద్ధికి యావత్ దేశంలోనే లేని విధంగా దళిత బంధు పథకాన్ని తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టడంతో పాటు, హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం వెనుక దళితజాతిని సమున్నతంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆకాంక్ష వెల్లడవుతుందని సీఎం అన్నారు. దళితుల సమగ్ర వికాసానికి మరెన్నో కార్యక్రమాలను తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని, ఆ దిశగా భవిష్యత్ లో ప్రభుత్వ కార్యాచరణ ఉంటుందని సీఎం తెలిపారు.