mt_logo

అనాథలైన ఆడపిల్లలకు పూర్తి రక్షణ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే వరకు ప్రభుత్వానిదే బాధ్యత: సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. 

అనాథ పిల్లలకు అండదండలు

60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో అనాధ పిల్లల సంరక్షణ కోసం ఒక విధానమంటూ లేకపోవడం అత్యంత విషాదకరం. పరిపాలనలో మానవీయ పరిమళాలు వెదజల్లుతున్న తెలంగాణ ప్రభుత్వం అనాథల పిల్లల సంరక్షణ బాధ్యతను సంపూర్ణంగా స్వీకరించింది. 

వారిని  “స్టేట్ చిల్డ్రన్” గా పేర్కొంటూ ఉన్నతమైన, ఉదాత్తమైన పద్ధతిలో “Orphan Policy”  రూపొందించింది. ఇకపై అనాథ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వమే అక్కున చేర్చుకుంటుంది. ముఖ్యంగా అనాథలైన ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించడంతోపాటు, వారికి విద్యాబుద్ధులు నేర్పించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే వరకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది.  

ఉద్యోగులకు ఉత్తమ పీఆర్సీ 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలో కూడా తెలంగాణ మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందున్నది. నేడు దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నది  తెలంగాణ ఉద్యోగులే అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్రం అవతరించిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చుకున్నం. ఇప్పటి వరకు రెండు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్మెంట్ అందించుకున్నం. కరోనా విజృంభణ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపించిన తరుణంలో ఉద్యోగులకు మెరుగైన ఫిట్ మెంట్ నే అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా  కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం వేతనాల పెంపుదలను వర్తింప చేసింది.  త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామని, అప్పటివరకూ  మధ్యంతర భృతిని చెల్లిస్తామని ఇటీవలి శాసనసభ సమావేశాల్లో నేను స్వయంగా ప్రకటించాను.   

గత ప్రభుత్వాలు నష్టాల పాలు చేసిన సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం చక్కదిద్దింది. కంపెనీ టర్నోవర్ ను 12 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు పెంచింది. సింగరేణి కార్మికులకు ఈసారి దసరా, దీపావళి పండుగల బోనస్ గా వెయ్యి కోట్లు పంపిణీ చేయబోతున్నదని తెలియజేయడానికి నేను ఎంతగానో  సంతోషిస్తున్నాను. 

వీ.ఆర్.ఏ.లకు పేస్కేల్

నీరటి, మస్కూరి, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలవబడుతూ, ఫ్యూడల్  వ్యవస్థకు అవశేషంగా మిగిలిన వీ.ఆర్.ఏ.లకు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రతిపత్తిని కలిగించింది తెలంగాణ ప్రభుత్వం. వీరి సేవలను క్రమబద్ధీకరిస్తూ పేస్కేలు అమలు చేసింది.   వీరందరినీ విద్యార్హతలు, సామర్ధ్యాలను బట్టి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా 14,954 పోస్టులను మంజూరు చేసింది.

పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ

గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పల్లెలు మరింత గుణాత్మకంగా మార్పుచెంది, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధిచెందేలా పంచాయతీ కార్యదర్శులు ద్విగుణీకృత ఉత్సాహంతో  నిరంతర కృషిని కొనసాగించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.