mt_logo

సంతోషం ఒక పాలైతే, విషాదం రెండు పాళ్ళు : సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజైన జూన్ 22 (గురువారం)న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’ ను ప్రారంభించారు. అమరవీరుల స్మారక భవనంలోకి ప్రవేశించిన సీఎంకి పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. కార్యక్రమం ఆసాంతం ఎంతో భావోద్వేగంగా కొనసాగింది. అమరుల స్మరణ తో సభ మొత్తం సంతాప వాతావరణం అలుముకున్నది. ఒకవైపు సచివాలయం మరో వైపు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 ఫీట్ల విగ్రహం పక్కనే అమర జ్యోతి వెలుగులో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంలో సంతోషం ఒక పాలైతే, విషాదం రెండు పాళ్ళు ఉంది.ఈ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలోనే అనేక కుట్ర కోణాలు దాగి ఉండి, అమాయకమైన నాటి రాజకీయ నాయకత్వం, ప్రజలు ఏదో మంచి జరుగుతుందనే ఆశతో మనం బలై పోయినం. ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకే ఇబ్బందులు మొదలైనయి. 

ఒక చక్కటి వ్యూహాం ర‌చించుకుని బ‌య‌ల్దేరాం

ఉద్య‌మం ప్రారంభించిన మొదట్లోనే నా మిత్రుడు వి. ప్ర‌కాశ్, మాజీ అసెంబ్లీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి గారి లాంటి పిడికెడు మందితో మేధోమ‌ద‌నం చేశాం. రాష్ట్రం సాధించి తీరాల‌నే ఉద్దేశంతో అనేక మంది వ్య‌క్తుల‌ను క‌లిశాం. ఒక చక్కటి వ్యూహాం ర‌చించుకుని బ‌య‌ల్దేరాం. ఆ సంద‌ర్భంలో ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్‌ గారిని క‌లిశాం.. అనేకమంది అనేక రూపాల్లో కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయ్యి నీరుగారి పోయే వారుంటారు. జయశంకర్ గారి రెండు సిద్ధాంతాలు బ‌లంగా ఉండేవి. ఒక‌టి తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌. రెండోది శ‌నివారం పూర్తిగా ఉప‌వాసం ఉండేవారు. ఆ రకంగా ఆయ‌న ఆజ‌న్మ తెలంగాణ‌వాది. ఏ ఒక్క సంద‌ర్భంలో కూడా వెనుక‌డ‌గు వేయ‌లేదు. 

మలిదశ ఉద్యమం ప్రారంభమైన తర్వాత ముందు దశలో విద్యార్థులను రానీయవద్దని, మన ఉద్యోగులను మనమే బలి చేసుకోవద్దని ప్రజల్లోకి వెళ్ళి ప్రజాస్వామ్య స్ఫూర్తి తో ముందుకు పోదామని నిర్ణయించాం.ఈ నిర్ణయాలన్నీ చాలావరకు ఎవరికీ తెలియదు. చాలా మంది నాతో విభేదించారు. ఉద్యమం అంటే ఆందోళన చేపట్టాలి. బస్సులు తగులబెట్టాలి. ఆందోళనకు, బంద్ కు పిలుపు నివ్వాలి అని నాతో చెప్పారు. అది సాధ్యమయ్యే పని కాదని చెప్పి, మేం ప్రస్థానాన్ని ప్రారంభించాం. ఆ రకంగా ఆ ప్రస్థానం, ఆ వ్యూహమే ఫలించి చివరికి తెలంగాణ రాష్ట్రం సాకారమైందని సీఎం ప్రసంగించారు.