రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమేనని, నూతన రెవెన్యూ చట్టం అంతం కాదు.. ఇది ఆరంభం మాత్రమే.. చట్టంలో అన్నీ తీసేయడం లేదు. పలు చట్టాల సమాహారంగా రెవెన్యూ చట్టం కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టంపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈ చట్టంపై సభ్యులంతా ఉత్తమమైన సలహాలు ఇచ్చారని అన్నారు. సమైక్య రాష్ట్రంలో 160 నుండి 170 వరకు చట్టాలు ఉండేవని, ప్రస్తుతం తెలంగాణలో 87 చట్టాలు ఉన్నాయన్నారు. ధరణి మాత్రమే కాదు. మిగతా చట్టాలు కూడా ఉంటాయి. ఆర్వోఆర్, ధరణి సర్వస్వం కాదు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలను మాత్రమే తొలగిస్తున్నామని సీఎం వివరించారు.
ఇప్పటివరకు 57 లక్షల 90 వేలమంది రైతులకు రైతుబంధు అందించాం. కేవలం 28 గంటల్లో రూ. 7,200 కోట్లు రైతులకు అందించగలిగామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామని, గ్రామాల్లో ఎవరి జీవితం వారే సాగిస్తున్నారు. గ్రామాల్లో వివాదం ఉన్నవి చాలా తక్కువ అని అన్నారు. రాష్ట్రంలో భూ వివాదాలకు సమగ్ర సర్వేతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని, 99 శాతం సమస్యలకు సర్వేనే పరిష్కారం చెప్తుందని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో ఎన్నికలు వచ్చాయంటే పట్టాలు ఇచ్చేవారు. స్థలాలు చూపకుండా పట్టాలు పంపిణీ చేసేవారు. పంచిన భూమి తక్కువ.. పంపిణీ కాగితాలే ఎక్కువ అని అన్నారు. అన్ని సమస్యలకు ఒకేసారి పరిష్కారం కావాలంటే కాదు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకొంటూ పోతున్నాం. కారణాలు ఏవైనా లోపాలు, లొసుగులు ఉన్నాయి. వీటన్నింటికీ ఈ కొత్త చట్టంతో చెక్ పెడతామని స్పష్టం చేశారు.
తెలంగాణలో కౌలుదారీ వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోదు. రైతులకు అండదండగా ఉండడమే తమ పాలసీ అని కేసీఆర్ స్పష్టం చేశారు. పట్టా పాసు పుస్తకాల్లో అనుభవదారు కాలమ్ ఉండదని, దానివల్ల చిన్న, సన్నకారు రైతులకు నష్టం కలుగుతుందని, ప్రభుత్వమే నేరుగా రైతులకు రైతుబంధు అందిస్తున్నప్పుడు అనుభవదారు కాలమ్ అవసరమే లేదని తేల్చిచెప్పారు. దళిత కుటుంబాలకు అవకాశం ఉన్న మేరకు మూడు ఎకరాల భూమిని కొని ఇస్తున్నాం. ఇప్పుడు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూమే లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వం. సత్యాలు చెప్పి నిజాయితీగా ఉంటామన్నారు. భూములు పంచుతామని రాజకీయ డైలాగులు చెప్తే సరికాదని, భూములు క్రమబద్దీకరణ చేసి అందరికీ న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.