టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక రేవంత్ నోటికి అడ్డేలేదు. నరం లేని నాలుకలా నోటికి ఏదస్తే అది మాట్లాడుతున్నారు. కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో సీఎం కేసీఆర్ పరుగులు పెట్టిస్తుంటే చూసి ఓర్వలేక అసత్యపు ఆరోపణలకు దిగారు. తెలంగాణ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపైనా నోరు జారారు. ఓఆర్ఆర్‌లో కుంభకోణం జరిగిందని ఓసారి..కాళేశ్వరంలో లక్ష కోట్ల స్కాం అని మరోసారి పచ్చి అబద్దాలు మాట్లాడారు. వాటిని నిరూపించకుండా మళ్లీ ఓ అబద్ధంతో మభ్యపెడుతూ వస్తున్నారు. భూ పంచాయతీలకు చెక్‌పెట్టి అన్నదాతలకు పెట్టుబడి అందేలా చూస్తున్న ధరణిని రద్దు చేస్తామని కారుకూతలు కూశారు. మరో అడుగు ముందుకేసి వ్యవసాయానికి మూడు గంటల కరెంటే చాలంటూ అన్నదాతలను అవమానించారు. తాజాగా, వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకు సీట్లివ్వరు.. గజ్వేల్ నుంచి పోటీ చేయరని ప్రకటించి నవ్వులపాలయ్యారు.
రేవంత్‌కు భారీ ఝలక్!
వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్‌లకు సీట్లే ఇవ్వదు.. అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ బొంకారు. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయరు అంటూ మరో అబద్ధం ఆడారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఈ రెండూ చేసి చూపించాలని సవాల్‌కూడా విసిరారు. అయితే, అతికొద్దిరోజుల్లోనే సీఎం కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేశారు. 119 స్థానాలకు ఏకంగా 115 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓ ఏడు స్థానాల్లో తప్ప మిగతా చోట్ల సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. తాను కామారెడ్డితోపాటు గజ్వేల్‌నుంచి కూడా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. రేవంత్ విసిరిన రెండు సవాళ్లకు అభ్యర్థుల జాబితాతో సీఎం కేసీఆర్ భారీ ఝలక్ ఇచ్చారు. దీంతో రేవంత్ సవాల్‌ను గుర్తుచేస్తూ బీఆర్ఎస్ నాయకులు టీపీసీసీ చీఫ్‌కు చురకలంటిస్తున్నారు. సీఎం కేసీఆర్ కొట్టిన దెబ్బకు రేవంత్ ముఖం మాడిపోయిందని గాంధీభవన్‌లో కాంగ్రెస్ నాయకులే గుసగుసలాడుకోవడం కొసమెరుపు.