
రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ తరగతులను ప్రగతి భవన్ నుండి వర్చువల్‌గా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ఈరోజు రాష్ట్ర చరిత్రలో సుదినం. ఒక రాష్ట్రం ఒకే సారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారి. ఇది సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని ఆయన మార్గ నిర్దేశంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించాం.. గత సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించి తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది. ఈ సంవత్సరం మన రికార్డును మనమే అధిగమించాం అని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం. ఇది గొప్ప రికార్డు. దేశంలోని మిగతా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయని స్పష్టం చేసారు.
మన రాష్ట్రం దేశానికే దిక్సూచి
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్ సరఫరా, జిల్లాకో మెడికల్ కాలేజీ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. ఒకప్పుడు బెంగాల్ ఆలోచిస్తుంది.. దేశం ఆచరిస్తుంది అనే నానుడి ఉండేది. దాన్ని తిరగరాసిన ఘనత సీఎం కేసీఆర్ ది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే.. దేశం మొత్తం అదే దారిలో నడుస్తున్నది. ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ ది అని అన్నారు. ఈరోజు అడ్మిషన్లు పొందిన వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు పేర్కొన్నారు. ఇంత గొప్ప పవిత్ర యజ్ఞంలో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు.