- మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభం
- జిల్లాలో ఇంటి జాగాకు పట్టాల పంపిణీ మొదలు
- రెండవ విడత గొర్రెల పంపిణీ
- మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన
- మందమర్రి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి భూమిపూజ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న వేళ నేడు “సంక్షేమ సంబురాల దినోత్సవం” రోజున ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారు మంచిర్యాల జిల్లా పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంతో పాటు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మంచిర్యాలలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు నూతన సంక్షేమ పథకాలను ప్రారంభించారు.
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులనుద్దేశించి మాట్లాడారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన చెన్నూరు ఎత్తిపోతల పథకం, పామ్ ఆయిల్ పారిశ్రామిక సముదాయం, మంచిర్యాల పట్టణంలో ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అప్ గ్రెడేషన్, మంచిర్యాల పట్టణం నుండి పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ వరకు వయా అంతర్గాం ను కలుపుతూ గోదావరి నదిపై ఎతైన వంతెన నిర్మాణాల శంఖుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు.
నూతన సంక్షేమ పథకాలుః-
అనంతరం నూతన కలెక్టరేట్ వేదికగా ‘బీసీల్లోని కులవృత్తి, చేతి వృత్తి కులాల వారికి ఆర్థికసాయం’ పథకం, రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం, ఇండ్ల జాగలేని నిరుపేదలైన లబ్దిదారుల కు, ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తోటపల్లి మండలం వెలమపల్లి గ్రామానికి చెందిన కుందారపు మురళి (కుమ్మరి వృత్తి)కి, భీమారం గ్రామానికి చెందిన మామిడి సత్యనారాయణ (నాయి బ్రాహ్మణ వృత్తి)కి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు లక్ష రుపాయల చెక్కును తన చేతుల మీదుగా వారికి అందించారు.
రెండవ విడత గొర్రెల పంపిణీః-
రెండవ విడత గొర్రెల పంపిణీలో భాగంగా తాడూరు మండలం ఖాజీపేట గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్, బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన గొలవేణి వోదేలు లకు గొర్రెల పంపిణీకి సంబంధించిన పత్రాలను సీఎం కేసీఆర్ అందించారు.
నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలుః-
ఇండ్ల జాగలేని నిరుపేదలైన లబ్దిదారులకు, పట్టాల పంపిణీలో హాజిపూర్ మండలం దోనబండ గ్రామానికి చెందిన బిరుదుల లక్ష్మీ, తోటపల్లి లావణ్యలకు సీఎం కేసీఆర్ ఇండ్ల స్థలాల పట్టాలను తన చేతులమీదుగా అందచేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.