బంజారాహిల్స్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న పోలీస్ ట్విన్ టవర్స్ కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలు, కమిషనర్లు, నగర పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, సభ్య సమాజాన్ని చూస్తూ ఎదుగుతూ అనేక విషయాలను అందిపుచ్చుకోవడం అవసరమని అన్నారు. సమాజంలో శాంతిభద్రతల పాత్ర ఎంతో కీలకమని, హైదరాబాద్ నగరంలో, రాష్ట్రంలోనూ బాధ్యత నిర్వర్తించడంలో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కీలకపాత్ర పోషించాలని సీఎం అభిప్రాయం వెలిబుచ్చారు.
ఈ భవన నిర్మాణం కోసం రూ. 302 కోట్లు మంజూరు చేశామని, వచ్చే బడ్జెట్ లో మరో రూ. 700 కోట్లను కేటాయిస్తామని సీఎం చెప్పారు. నూతన రాష్ట్రంలో పోలీసుల వైఖరిలో చెప్పుకోతగ్గ మార్పు వచ్చిందని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న డబుల్ బెడ్ రూమ్ పథకంలో పది శాతం పోలీస్ కానిస్టేబుళ్లు, ఎక్స్ సర్వీస్ సిబ్బందికి కేటాయిస్తామని ప్రకటించారు. ఈ బిల్డింగ్ కేవలం పోలీస్ కమిషనర్ బిల్డింగ్ కాదు.. ఆ కన్ఫ్యూజన్ ఎవరికీ అక్కర్లేదు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు ఫ్లోర్లను కేటాయించాం. ప్రకృతి విపత్తులు, ఇతర విపత్తులు తలెత్తిన సమయంలో ఇక్కడినుండి మానిటరింగ్ చేసే విధంగా రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన టెక్నాలజీ హబ్ గా దీన్ని రూపొందించాం అని సీఎం స్పష్టం చేశారు.
అనంతరం కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ వినూత్న ఆలోచనతో ముఖ్యమంత్రి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం ఎంతో ప్రశంసనీయమన్నారు. టెక్నాలజీతో పారదర్శకత పెరుగుతుందని, జవాబుదారీతనం పెరిగి ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ ట్విన్ టవర్స్ భారతదేశ పోలీస్ వ్యవస్థలో అపూర్వ ఘట్టమని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని, మహిళల భద్రత కోసం షీ టీమ్స్, పోలీస్ శాఖలో 33 శాతం మహిళలకు కోటా, ఎక్స్ గ్రేషియా పెంపు వంటి ఉన్నత నిర్ణయాలతో సీఎం ముందుకెళ్తున్నారని ప్రశంసించారు.