mt_logo

నిరుపేద‌ల ఆత్మ‌గౌర‌వం డ‌బుల్‌.. ఒక్కొక్క కుటుంబానికి రూ.50 ల‌క్ష‌ల ఆస్తి ఇచ్చిన తెలంగాణ స‌ర్కార్‌!

స‌మైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ స‌ర్కారు కూడా ఇండ్లు ఇచ్చింది.. కానీ.. అవి అగ్గిపెట్టె రూంలు.. క‌నీసం ఒక్క బెడ్ కూడా ప‌ట్ట‌ని గ‌దులు.. కూలిపోయే గోడ‌లు..వ‌ర్షం ప‌డితే జాలువారే స్లాబులు.. పుచ్చుప‌ట్టిన కిటికీలు.. త‌లుపుల‌తో ఇందిర‌మ్మ‌, రాజీవ్‌గృహ‌క‌ల్ప గృహాలు బూతు బంగ్లాల‌ను త‌ల‌పించాయి. క‌ట్టిన ఇండ్ల‌కే మ‌ళ్లీ రంగులేసి కాంగ్రెస్ నాయ‌కులే పెద్ద మొత్తంలో డ‌బ్బులు నొక్కేశారు. ఇండ్ల‌మాటున భారీ కుంభ‌కోణానికి తెర‌లేపారు. ల‌బ్ధిదారుల‌కు నాసిర‌కం ఇండ్లు ఇచ్చి..హ‌స్తం పార్టీ నాయ‌కులే జేబులు నింపుకొన్నారు. కానీ.. స్వ‌రాష్ట్రంలో ఆ దుస్థితికి సీఎం కేసీఆర్ స్వ‌స్తి చెప్పారు. న‌యాపైసా ఖ‌ర్చులేకుండా కార్పొరేట్ స్థాయిలో ఇండ్లు క‌ట్టి నిరుపేద‌ల ఆత్మ‌గౌర‌వాన్ని రెట్టింపు చేశారు. కోటీశ్వ‌రుల నివాసాల ప‌క్క‌నే బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు రూ.30 నుంచి రూ.50 ల‌క్ష‌ల విలువ చేసే ఇండ్ల‌ను స‌క‌ల వ‌స‌తుల‌తో క‌ట్టించి ఇచ్చి, వారిలో ఆనందాన్ని నింపారు. నిరుపేద‌ల సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చి, త‌న మాట‌నిలుపుకొన్నారు. 

విశ్వ‌న‌గ‌రంలో దేశ‌మే అబ్బుర‌ప‌డేలా!

గ్రేట‌ర్ ప‌రిధిలోని ప్ర‌తి అర్హుడికీ డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు క‌ట్టిస్తామ‌ని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ల‌క్ష ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో ఇప్ప‌టికే 50వేల‌కుపైగా ఇండ్ల నిర్మాణం పూర్త‌య్యింది. హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రంలో దేశ‌మే అబ్బుర‌ప‌డేలా తెలంగాణ స‌ర్కారు డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల‌ను నిర్మించింది. కొల్లూరు టౌన్‌షిప్ ఆసియాలోనే అతిపెద్ద డిగ్నిటీ హౌస్ స‌ముదాయంగా రికార్డు సాధించింది. రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, లిప్టులు వంటి సౌకర్యాల‌తో అత్యంత విలువైన ఇండ్ల‌ను నిరుపేద‌ల కోసం క‌ట్టించింది. ఇరుకిరుకు గదులు కాకుండా విశాలమైన స్థలంలో కుటుంబంలోని నలుగురు వ్యక్తులు హాయిగా కలిసి జీవించేలా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు డిజైన్‌ చేసింది. లబ్ధిదారులు పైసా కూడా చెల్లించకుండా రెండు బెడ్‌రూంలు, రెండు మూత్రశాలలు, ఒక కిచెన్‌, హాలుతో కూడిన ఇంటి కోసం మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించి నిర్మాణం పూర్తి చేసి వారికి అందజేస్తున్నది. ఇక్క‌డ మార్కెట్ రేటు ప్ర‌కారం ఒక్కో ఇంటి విలువ రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉండ‌టం విశేషం. తొలిద‌శ‌లో భాగంగా 9 ప్రాంతాల్లో మొత్తం 11,700 మంది లబ్ధిదారులకు ఇండ్లను లాటరీ ద్వారా డ్రా తీసి కేటాయించారు. ఎలాంటి పైర‌వీ లేకుండా పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ఇండ్ల‌ను కేటాయించి, నిరుపేద‌ల‌పై త‌మ‌కున్న చిత్త‌శుద్దిని తెలంగాణ స‌ర్కారు చాటుకొన్న‌ది. త‌మ జీవితంలో అద్దె ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతామ‌నుకున్నామ‌ని, కానీ.. తెలంగాణ స‌ర్కారు పెద్ద మ‌న‌సుతో త‌మ‌కు రూ. 50ల‌క్ష‌ల విలువ చేసే ఇంటిని కేటాయించిందంటూ ల‌బ్ధిదారులు మురిసిపోయారు. త‌మ సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చిన తెలంగాణ స‌ర్కారుతోపాటు సీఎం కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.