mt_logo

కుట్టి రిజర్వాయర్‌ను కట్టించే బాధ్యత నాదే: బోథ్ సభలో సీఎం కేసీఆర్

కుట్టి రిజర్వాయర్’ను కట్టించే బాధ్యత నాదే అని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. బోథ్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. నాయకులు గ్రామాల్లో చర్చ పెట్టి, బీఆర్ఎస్ సాధించిన విజయాలను చెప్పాలని కోరారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ. గులాబీ జెండా ఎగిరిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసం అని తెలిపారు. మంచిగున్న తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. 58 ఏండ్లు తెలంగాణ ప్రజలు అరిగోస పడటానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా దోఖా చేసి, టీఆర్ఎస్ పార్టీనే చీల్చాలని కుట్ర పన్నిందని తెలిపారు.  దేశంలో 33 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి, మనం ఉప్పెనలా విజృంభిస్తే తెలంగాణ వచ్చింది. బోథ్ ప్రాంతంలో నాడు రైతులు బోర్లేసి, పత్తి పంటలతో అప్పుల పాలై చాలా బాధలు పడేది. నాడు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన చెరువుల పూడికలు తీయలేదు. నేడు ఇక్కడ 70 కి పైగా చెరువుల పూడికలు తీసుకొని, 8 కి పైగా చెరువులు కట్టుకొంటే భూగర్భ జలాలు పైకొచ్చినయ్ అని వివరించారు. 

చనాక-కొరాట పూర్తవుతున్నది. దానితో పిప్పల్ కోట్ రిజర్వాయర్ కు నీళ్లు తీసుకొస్తే మనకు చాలా లాభం జరుగుతుంది. ఆ పని కూడా నేను చేపిస్తా అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఆదిలాబాద్ అంటురోగాలతో సతమతమవుతుంటే మనమంతా ఏడ్చేదని,  ఇవ్వాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ’ ద్వారా అంటురోగాల చావులు లేకుండా చేసుకున్నం. ప్రతి ఇళ్లూ, గుడిసెలకు కూడా మంచినీళ్లు అందేలా మన ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు.  కాంగ్రెస్ రాజ్యంలో మంచినీళ్లు, సాగునీళ్లు, కరెంటు లకూ బాధలే. కమీషన్ ఏజెంట్ల దగ్గర రైతులు అప్పులు తీసుకొని ఆగమైండ్రు అని తెలిపారు.

అనిల్ జాదవ్‌ను గెలిపించండి..బోథ్ ను రెవెన్యూ డివిజ న్‌గా చేస్తాను.  బోథ్ లో డిగ్రీ కాలేజీ, కోల్డ్ స్టొరేజిని కూడా అడుగుతున్నరు. వాటన్నింటినీ తప్పకుండా ఏర్పాటు చేస్తానని అన్నారు. కుట్టి రిజర్వాయర్’ను కట్టించే బాధ్యత నాదే అని మాట ఇచ్చారు.  రైతుబంధు పది వేల నుంచి పదహారు వేలకు తీసుకుపోతామని మనవి చేస్తున్నా,  24 గంటల కరెంటు కాట కలువద్దంటే..మన భూములు జాగ్రత్తగా మనకు ఉండాలంటే.. ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొంటేనే సాధ్యం అవుతుందని సూచించారు. ప్రజలల్లో కలిసుండేవాడు, అందరితో బాగా ప్రేమగా ఉండే అనిల్ జాదవ్‌ను కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని సీఎం కోరారు.