mt_logo

యాభై ఏండ్లు ఏడిపించింది కాంగ్రెస్: సీఎం కేసీఆర్

కాంగ్రెస్ యాభై ఏండ్లు ఏడిపించింది ఇంకా చాలదా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. జహీరాబాద్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. రైతు బంధు’ దుబారా అని, వేస్ట్ అని కాంగ్రెసోళ్లు అంటున్నరు. ప్రజలేమో కావాలని పెద్ద ఎత్తున కోరుకుంటున్నారని తెలిపారు. జహీరాబాద్‌లో మాణిక్ రావు గెలిస్తే.. రైతుబంధు ఉండటమే కాదు పది వేల నుంచి పదహారు వేలకు పెంచుకుందాం అని అన్నారు. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు రైతులకు 3 గంటల కరెంటు చాలంటండు.  ప్రజలేమో 24 గంటల కరెంటు కావాలని కోరుతున్నరని తెలిపారు. 24 గంటల కరెంటు కావాలంటే జహీరాబాద్‌లో మాణిక్ రావు గెలువాలని కోరారు. ప్రజల తరపున యుద్ధం చేసే బీఆర్ఎస్ అభ్యర్థులకు కాకుండా వేరే వాళ్లకు కత్తి ఇస్తే యుద్ధం ఎట్లా గెలుస్తరు?. అందరూ ఆలోచించాలని అన్నారు. 

ఇది జీవన్మరణ సమస్య

రాహూల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ లీడర్ భట్టిలు ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తరట. ధరణిని తీసేసి భూమాతగా మారుస్తరట. మళ్లీ పాత పద్దతినే తెస్తరట అని హెచ్చరించారు. భూమాత’ కాదు.. అది కాంగ్రేసోల్ల భూ‘మేత’ అని అన్నారు. ధరణి ద్వారానే రిజిస్ట్రేషన్లు అత్యంత సులువుగా అయినయి. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు డబ్బులు వస్తున్నాయని వివరించారు. మళ్లా పటేల్, పట్వారీ, దళారీ వ్యవస్థ వస్తే..రైతుబంధు డబ్బులు ఎట్లా వస్తయి? అని అడిగారు. యాభై ఏండ్లు ఏడిపించింది చాలదా కాంగ్రెస్. ఇది జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు. పేద ప్రజలు, రైతుల సంక్షేమాన్ని కోరేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని తెలియజేసారు. మనవేలితో మన కన్నే పొడుచాలని కాంగ్రెసోళ్లు చూస్తున్నరు జాగ్రత్త అని హెచ్చించారు. 

రెండు పంటలకు లక్ష ఎకరాలకు నీళ్లు

కాళేశ్వరాన్ని సింగూరుకు లింక్ చేసుకుంటున్నాం. సింగూర్ బ్యాక్ వాటర్ నుంచి జహీరాబాద్‌కు  సంగమేశ్వర లిఫ్ట్, నారాయణఖేడ్ కేమో బసవేశ్వర లిఫ్ట్‌లను పెట్టుకున్నం. జహీరాబాద్ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు వస్తయి. ఏడాకులపల్లె రిజర్వాయర్‌ను నేను మంత్రిగా ఉన్నప్పుడే కట్టించిన అని వెల్లడించారు. నాడు నారింజ ప్రాజెక్టును పట్టించుకున్నోడే లేడు. దానిని కొంతమేరకు చేయించుకున్నాం. మిగిలినది తప్పకుండా చేయిస్తామని మనవి చేస్తున్నానని పేర్కొన్నారు. సంగమేశ్వర లిఫ్ట్ పనులు కూడా ప్రారంభమైనవి. పంప్ హౌజ్ పనులు జరుగుతున్నయి. 365 రోజులు సింగూరులో నీళ్లే ఉంటాయని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గంలో రెండు పంటలకు లక్ష ఎకరాలకు నీళ్లు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటేసి మాణిక్ రావును భారీ మెజార్టీతో గెలిపించండి.. మీ పనులన్నీ నెరవేర్చే బాధ్యతను నేను, హరీశ్ రావు తీసుకుంటున్నమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.