![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2023/11/Untitled-Project-38-3.jpg?resize=1024%2C576&ssl=1)
ఇందిరమ్మ పాలనలోనే ఎమర్జెన్సీ వచ్చింది. మనందరికి తెలుసు. ప్రతిపక్షాలందరిని జైళ్లలో వేసి చాలా దుర్మార్గమైన చీకటి రోజులు తెచ్చినారు. మళ్ళీ ఆ దరిద్రపు పాలన మనకెందుకు.. అవసరమే లేదని సీఎం అన్నారు. వైరా ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గారి ప్రసంగం ముఖ్యాంశాలు… ఎన్నికలు వచ్చినయి .. ఖచ్చితంగా 30 తారీఖు నాడు పోలింగ్ జరుగుతుంది. 3వ తేదీనాడు ఓట్లు లెక్కపెడుతారు. అంతటితో దుకాణం అయిపోతుందని మీరు అనుకుంటరు. కానీ కాదు. అప్పుడే దుకాణం స్టార్ట్ అవుతుందని అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తరో హైదరాబాద్‌లో అదే ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
తెలంగాణ ఇండియాలోనే నెంబర్‌వన్
తెలంగాణ వచ్చాక బ్రహ్మాండంగా ప్రతి లంబాడి తండాలో.. ప్రతి ఆదివాసి గూడెం లో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంటిలో, పట్టణాలైతే ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్లు ఇచ్చి బ్రహ్మాండంగా ఇవాళ ప్రతిరోజు శుభ్రమైన పాలలాంటి నీళ్ళు మీకు అందిస్తున్నది. ఈ విషయంలో కూడా తెలంగాణ ఇండియాలోనే నెంబర్ వన్ అని తెలిపారు. వైరా గ్రామపంచాయతీగా ఉండే. దీన్ని మున్సిపాలిటీగా చేసుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే.. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఎట్లా వుండే.. తెలంగాణ వచ్చిన తరువాత ఈ బీఆర్ఎస్ పదేండ్ల పాలన ఎట్లా వుంది అనేది రెండింటిని మీరు బేరీజు వేసి గమనించాలని మనవి చేసారు.
ఎందుకా దిక్కుమాలిన పరిపాలన
కాంగ్రెస్ నాయకులు మళ్లీ చెప్తున్నారు… కాంగ్రెస్‌కు అధికార మిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెప్తున్నారు. ఎందుకా దిక్కుమాలిన పరిపాలన. ఏమి ఉద్దరించారని.. అంతా అరాచకాలు. .. పేదోళ్ళు పేదోళ్ళు గానే ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేసారు. మదన్‌లాల్ కొన్ని కోరికలు కోరారు. అవన్నీ చేయదగినటువంటి పనులే. తప్పకుండా వైరా నియోజకవర్గ ప్రజల పక్షాన ఆయన కోరిన కోరికలు నేను చేయిస్త. ఆ బాధ్యత నాదని మాట ఇచ్చారు. ఆయన సౌమ్యుడు. మంచి వాడు.
ఒక్క ముఖ్యమంత్రైనా, మంత్రైనా ఆలోచించారా?
రాములు నాయక్ కూడా మంచి మనిషి. ఆయనకు కూడా సముచిత స్థానం ఉంటుంది. సీతారామ ప్రాజెక్టు 70 శాతం పూర్తయింది. 30 శాతం పనులే మిగిలివున్నాయి. ఇంతపొడవు గోదావరి ఖమ్మం జిల్లాను ఒరుసుకుని పారుతుంది. మరి ఒక్క ముఖ్యమంత్రైనా, మంత్రైనా గోదావరి నీళ్లను తెచ్చుకోవాలని ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. గోదావరిని ఒరుసుకుని పారే జిల్లాలల్ల జూలూరుపాడు, కారేపల్లి, ఏన్కూరు, ఇల్లందులో ఎందుకు కరువుండాలని ఇయ్యాల మనం సీతారామ ప్రాజెక్టు కడుతున్నం. ఒక్కసారి అది అయిపోయిందంటే .. పంటలకు ఢోకా ఉండదని తెలిపారు. ఖచ్చితంగా మదన్‌లాల్‌ని గెలిపించండి.. మీ కోరికలు తీర్చే బాధ్యత నాది అని సీఎం హామీ ఇచ్చారు.