మెతుకు ఆనంద్‌ను గెలిపించండి.. వికారాబాద్ నియోజకవర్గానికి ఒకే విడతలో దళిత బంధు పెడుతానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ దెబ్బతో వికారాబాద్‌లోని దళిత కుటుంబాలన్నీ ధనిక కుటుంబాలు అయితయి. ఎవరో గెలిస్తే వచ్చేదేమీ ఉండదు. ఆనంద్ గెలిస్తే ప్రతి దళిత కుటుంబం బంగారు కుటుంబం అవుతుందని తెలిపారు. వికారాబాద్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు వేస్ట్‌గా ఇస్తున్నడు కేసీఆర్ అంటున్నడని తెలిపారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు 3 గంటల కరెంటు చాలు అంటున్నడు. ప్రజలేమో 24 గంటల కరెంటు కావాలంటున్నరని పేర్కొన్నారు. ‘రైతుబంధు’, ధరణిలు ఉండాలంటే 24 గంటల కరెంటు కావాలంటే.. వికారాబాద్‌లో ఆనంద్‌ను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ ఒకవేళ వస్తే ధరణిని తీసేసి భూమాత అని పెడుతం అంటున్నారు. కాంగ్రెసోళ్లు పెట్టాలనుకుంటున్నది..భూమాత’నా? లేక ‘భూమేత’నా? అని అనుమానం వ్యక్తం చేసారు. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు డబ్బులు రైతులకు ఎట్లా రావాలె? అని అడిగారు. మళ్లీ దళారులు, పైరవీకారుల రాజ్యం తేవాలని కాంగ్రెస్ చూస్తున్నది. టీవీలల్లో, మీటింగ్‌లల్లో కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే చెబుతున్నరు జాగ్రత్త అని హెచ్చరించారు.
యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కృష్ణా, గోదావరి మధ్యనుండే ప్రాంతానికి కనీసం తాగనీకి మంచినీళ్లు కూడా ఇయ్యలేదని ఆరోపించారు. మిషన్ భగీరథ రాకముందు మంచినీళ్లకు మన ఆడబిడ్డలు ఎంత గోసపడేది. బోరింగులు కొట్టీ కొట్టీ అలిసిపోయేది. అర్ధరాత్రి, అపరాత్రి లేచి కూర్చునేది. అప్పుడు కూడా వచ్చే బుక్కెడన్ని మంచినీళ్ల కోసం.ఇవ్వాల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి, ప్రతి గూడేనికి, ప్రతి తాండాకు కూడా ‘మిషన్ భగీరథ’ ద్వారా పరిశుభ్రమైన మంచీనీళ్లను అందిస్తున్నది. ఇవన్నీ పోగొట్టుకుందామా? ఉంచుకుందామా? నిర్ణయించుకునేది మీరే అని సూచించారు.
వికారాబాద్ జిల్లా కావాలనే దశాబ్దాల కలను తెలంగాణ వచ్చినంక బీఆర్ఎస్ ప్రభుత్వమే నెరవేర్చిందని మీకందరికీ తెలుసన్నారు. మెతుకు ఆనంద్ పట్టుబట్టి వికారాబాద్‌లో డిగ్రీ కాలేజీని పెట్టించిండు. మెడికల్ కాలేజీ, దానితో నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ కూడా వికారాబాద్ కు వచ్చినట్లే. రాబోయే రోజుల్లో వికారాబాద్‌లో ఐటీ కార్యకలాపాలు విస్తరిస్తాయి. కాలుష్యం లేనటువంటి పరిశ్రమలు కూడా వస్తున్నాయని తెలిపారు. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందాం. అనంతగిరిని బ్రహ్మాండమైన పర్యాటక ప్రాంతంగా చేసుకుందాం. టూరిజం డెవలప్మెంట్ వాళ్లు చేసిన ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేసుకుందాం అని వెల్లడించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు 196 కేసులు వేసి పదేండ్లు ఆలస్యం చేశారని మండిపడ్డారు. వికారాబాద్, తాండూరు, చేవెళ్ల, మహేశ్వరం నియోజకవర్గాలకు కాలువలు తవ్వాల్సిన పని మాత్రమే మిగిలి ఉందన్నారు. ఏడాది కాలంలో మీకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. మీ వాటా కూడా అందులో ఉందని తెలిపారు. వికారాబాద్ భూములు ప్రత్యేకమైనటువంటి భూములు. మంచి పంటలు, కమర్షియల్ పంటలు పండుతాయి. మీరందరూ ఎంతో అభివృద్ధి చెందుతరని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క చిన్న తప్పు చేస్తే 58 ఏండ్లు మనం గోస పడ్డం. మళ్లీ ఏదైనా పొరపాటు జరిగితే పదేండ్ల నుంచి మనం చేసిన పనంతా బూడిదలో పోసిన పన్నీరు అయితదని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తూ, అన్ని పండుగలను గౌరవంగా చేసుకుంటున్నాం అని తెలిపారు. దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంకు గానే వాడుకున్నది. దళిత సోదరులంతా ఒక్కసారి ఆలోచించాలి. ఆనంద్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి.. నేనే వచ్చి దళితబంధు’ను ప్రారంభిస్తానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.