
తెలంగాణ ప్రజల హక్కులు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. సిర్పూర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రజల ఆశీర్వాదాలతో గత పదేండ్ల నుంచి ప్రభుత్వం నడుపుతూ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఏం చేసినవో.. తక్కువ కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేసిందో చూడండని సూచించారు.
బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యకుండా బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో’.. అంటూ నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి తెలంగాణ ప్రకటన చేసి, మళ్లీ వెనక్కి వెళ్లింది. ఏడాదిన్నరపాటుగా ఉద్యోగస్థులు, విద్యార్థులు, తెలంగాణ ప్రజలందరూ సకల జనుల సమ్మె లాంటి అనేక పోరాటాలు చేయడం, దేశవ్యాప్తంగా 33 పార్టీలు మద్ధతును తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ వచ్చిన్నాడు మంచినీళ్లు, కరెంటు, సాగునీరు లేదు. మరోవైపు రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులుండేవని గుర్తు చేసారు.
‘మంచం పట్టిన మన్యం’ అనే వార్తలు
నాడు కాగజ్‌నగర్ మాదిరిగానే రాష్ట్రమంతా పరిశ్రమలు కరెంట్ లేక మూతపడటం, ప్రజలు వలసలు పోవడం లాంటి అనేక సమస్యలుండే అని తెలియజేసారు. ఈ పదేండ్లలో ఒక్కొక్కటిగా బాగు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని వివరించారు. గతంలో మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు ఎన్నో బాధలు పడేది.. నేడు ఆ పరిస్థితి లేకుండా చేశాం అని స్పష్టం చేసారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోగాలతో జనం చస్తుంటే.. ‘మంచం పట్టిన మన్యం’ అనే వార్తలు వచ్చేవి. ఇవ్వాల అలాంటి పరిస్థితులు లేకుండా చేశామన్నారు. నేడు మిషన్ భగీరథ ద్వారా గోండు గూడాలు, ఆదివాసీ తాండాలు, లంబాడీ తాండాలకు, మారుమూల పల్లెలకు ప్రతిరోజు శుద్ధమైన నీళ్లు వస్తున్నాయని అన్నారు.
రైతు బంధు దుబారా అంటున్న కాంగ్రెస్
దేశంలో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీళ్లనిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. పరిశ్రమలు, గృహాలు, వ్యాపార సంస్థలు, వ్యవసాయానికి 24 గంటల కరెంటుని ఇస్తున్నాం, భారతదేశం మొత్తమ్మీద ఏ ఒక్క రాష్ట్రంలోనూ 24 గంటల కరెంటు లేదు…ఒక్క మన తెలంగాణలో తప్ప అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు దుబారా అంటోంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడేమో 3 గంటల కరెంటు ఇస్తే చాలంటుండు, నాడు సగం సగం కరెంటుతో రైతులు కరెంట్ షాక్ కొట్టి, పాములు కరిచి చనిపోతూ నానా పాట్లు పడ్డారు. ఇయ్యాల అలాంటి బాధలు లేకుండా చేసుకున్నం అని గర్వించారు. నాడు రైతుల భూముల మీద ఆజమాయిషీ చేసే భర్తలు ఎందరో ఉండేవారు అన్నారు. నేడు ధరణితో మీ బొటనవేలు ముద్రకు తప్ప ఎవరికీ మీ భూములను మార్చే అధికారం లేదని తేల్చి చెప్పారు. ధరణి లేకుంటే రైతుబంధు, రైతు బీమా, పంటల కొనుగోలు డబ్బులు ఎలా వస్తయ్? అని అడిగారు. ఇయ్యాల ధరణితో దళారీలు, పైరవీకారుల రాజ్యం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
మార్చి నుంచి సన్నబియ్యం
హైదరాబాద్‌లో తక్కువ, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ఎక్కువ ఉండే నాయకుడు కోనేరు కోనప్ప అని చెప్పారు. కోనప్ప నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ సేవ చేస్తున్నాడు. సిర్పూర్ ప్రాంతంలో పేపర్ మిల్లు తెరిపించడమే కాకుండా, మరిన్ని పరిశ్రమలు వచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృషి చేయడం జరుగుతున్నదన్నారు. మైనార్టీల సంక్షేమానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం అరకొర నిధులనిస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1200 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేసింది. 93 లక్షల రేషన్ కార్డుదారులందరికీ మార్చి నుంచి సన్నబియ్యం ఇస్తాం అని హామీ ఇచ్చారు. బీమా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం అని అభివర్ణించారు. బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని, కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.