
ఆరు నూరైనా బీఆర్ఎస్ గెలుపు ఎవరు ఆపలేరని సీఎం అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. సత్తుపల్లిలో 70, 80 వేల మెజారిటీతో వెంకట వీరయ్య గెలుపు ఖాయమని అర్దమయిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీ, నాయకుడిని కూడా చూసి ఓటు వేయాలని అన్నారు. దేశంలో దళితుల గురించి ఏ నాయకుడైనా ఆలోచించారా ? ఎస్సీలు ఎప్పటికీ అలాగే ఉండాల్సిందేనా? అని అని అడిగారు. అన్ని పార్టీలు ఎస్సీలకు దశాబ్దాలుగా ఓటు బ్యాంకు గానే చూశాయని ఆయన మండిపడ్డారు.
ఉత్తర భారత్‌లో ఇప్పటికీ ఎస్సీలపై నిత్యం దాడులు జరుగుతున్నాయని తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళిత జ్యోతి అనే కార్యక్రమం అమలు చేశానని వెల్లడించారు. దళితబంధుకు స్ఫూర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమలు చేసిన దళిత జ్యోతి అని పేర్కొన్నారు. దేశంలో దళిత బంధు తీసుకొచ్చిన మొగోడు ఎవరు అని అడిగారు. ఆ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఎన్నికలు లేవు, ఏమీ లేవని, కేవలం దళితుల గురించి ఆలోచించే ఆ పథకాన్ని తీసుకొచ్చామన్నారు.
రైతులకు అండగా ఉండాలని రైతుబంధును మొట్టమొదటగా తీసుకొచ్చింది తానేనని తెలిపారు. దళిత బంధును తాము మొదట హుజురాబాద్‌లో 100% అమలు చేశామని, తర్వాత భట్టి విక్రమార్క నియోజకవర్గంలోని చింతకానిలో 100% అమలు చేశామని తెలిపారు. దళిత బంధు పెట్టిన నాడు ఎవ్వడూ అడగలేదు. దళితులు వివక్షతకు గురయ్యారు. జాషువా లాంటి మహాకవి దళితుల గురించి వ్యాసాలు రాశారు. తరతరాలుగా దళితుల పరిస్థితి బాగోలేదని అన్నారు.
ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టనివి చాలా అమలు చేశామని చెప్పారు. తెలంగాణను నూటికి నూరు శాతం బాగా చేయాలనే ఉద్దేశంతో పనులు చేపడుతున్నని స్పష్టం చేసారు. తాము ఎన్నికల కోసమో, తమ నేతల కోసమో ఈ పథకం అమలు చేయడం లేదని, అలాంటి ఆశ తమకు లేదన్నారు. ఇది తమ నిజాయితీకి గీటురాయి అని పేర్కొన్నారు. ఎన్నికల కోసమే అయితే తాము సీతారామ ప్రాజెక్టు నిర్మించేవాళ్ళం కాదన్నారు.
సత్తుపల్లిలో అభివృద్ధి గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, పక్కనే ఉన్న ఆంధ్ర తో పోలిస్తే మీకే తెలిసిపోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. సింగిల్ రోడ్ వస్తే ఆంధ్ర, డబుల్ రోడ్ వస్తే తెలంగాణ అని అనే స్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణ వస్తే ఎలా బతుకుతారో అన్నవారే మన దగ్గర ధాన్యం అమ్ముకుంటున్నారని, కారు చీకట్లు ఉంటాయని చెప్పినవాళ్ళే చీకట్లో ఉంటున్నారన్నారు. తెలంగాణలో ఆరు నూరైనా తాము అధికారంలోకి వస్తామని, తమ గెలుపును ఎవరూ ఆపలేరని సత్తుపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ నాయకులు రైతుబంధు వద్దు, ధరణి వద్దు అని అంటున్నారని వాళ్లకు ఓటేస్తే మళ్ళీ రాష్ట్రంలో దళారి వ్యవస్థ వస్తుందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓటేయాలన్నారు. ఈ జిల్లాలో కొందరు నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసేవాళ్లను అసెంబ్లీ రానివ్వనని అంటున్నారు. ఈ సభకు వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తే దుమ్ము రేగదా? కొంత డబ్బు వస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయాలా? ఇంతటి అహంకారామా? ఈ ఫాల్తూ గాళ్ళు, పనికిమాలిన వాళ్ళు ఉన్నంత కాలం రాష్ట్రం బాగుపడదన్నారు.