mt_logo

దళిత అభ్యున్నతి కోసమే దళిత బంధుకు శ్రీకారం: సీఎం కేసీఆర్

తెలంగాణకు ఏది క్షేమం? తెలంగాణకు ఎవరు శ్రీరామరక్ష ఆలోచించి ఓటు వేయండని సీఎం కేసీఆర్ సూచించారు. పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..  ప్రజాస్వామ్య పరిణతి సాధించిన దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయని తెలిపారు. మన దేశంలో రావల్సినంత పరిణతి ఇంకా రాలేదని అన్నారు. వజ్రాయుధం లాంటి ఓటును ఎన్నికలప్పుడు మనం ఆగమాగం కాకుండా మంచి చేసినవాళ్లకే వేయాలని సూచించారు. 

రాయి ఏంటో, రత్నం ఏంటో మనం గుర్తుపట్టాలి 

బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసమని స్పష్టం చేసారు. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ .. తెలంగాణ సాధించి పదేండ్లలో ఎంతో అభివృధ్దిని సాధించిన బీఆర్ఎస్ పార్టీలను బేరీజు వేసుకోవాలని కోరారు. రాజకీయాలు, ఓట్లు చాలా ముఖ్యమైనవని, రాయి ఏంటో, రత్నం ఏంటో మనం గుర్తుపట్టాలని చెప్పారు. మనోహర్ రెడ్డి నన్ను ఎప్పుడు కలిసినా వ్యక్తిగత పనులపై కాకుండా ప్రజా పనుల గురించే అడిగేవారని అన్నారు. గతంలో మనోహర్ రెడ్డి సొంత డబ్బులను ఖర్చు పెట్టి హరితహారంలో చెట్లను పెట్టిండని గుర్తు చేసారు. అరమరికలు లేకుండా ఉన్నదున్నట్లు మాట్లాడుతూ నిజాయితీగా ఉంటూ సాదాసీదాగా మీ మధ్యలో ఉండే వ్యక్తి మనోహర్ రెడ్డి.

తెలంగాణకు ఎవరు శ్రీరామరక్ష?

భూములపై గవర్నమెంట్ అధికారాన్ని రైతులు, ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది.భూములు అమ్మాలన్నా, కొనాలన్నా రైతుల బొటనవేలుతో తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా రికార్డులను మార్చలేడు. ఆ అధికారం మీ దగ్గర ఉండాల్నా? కాంగ్రెస్ రాజ్యంలో మళ్లీ పోగొట్టుకోవాల్నా? అని ప్రశ్నించారు. పేద పిల్లల పెండ్లి అయితే ఏ ప్రభుత్వమన్నా లక్ష రూపాయలిచ్చిందా? ఆ ఆలోచన అసలు వాళ్ల మైండ్ కు వచ్చిందా?  అని అడిగారు.

పేదవాళ్లకు కండ్లు చూయించి కళ్లద్దాలు ఇవ్వాలని ఏ ప్రభుత్వమైన, ఏ నాయకుడైనా కంటి వెలుగు పథకాన్ని పెట్టిండా? ఆడపిల్లల ప్రసూతికి కేసీఆర్ కిట్‌ను అందిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్‌ను ఏ ప్రభుత్వమైనా బాగుచేసిందా? అని ప్రశ్నించారు. బతుకమ్మ చీరలతో అటు చేనేత కార్మికులు, ఇటు పేద ఆడబిడ్డలకు ఎంతో మంచి జరుగుతావుందని వెల్లడించారు. జరిగింది ఏంటి? జరగబోయేది ఏంటి? ఏ ప్రభుత్వం వస్తే తెలంగాణకు లాభం? తెలంగాణకు ఏది క్షేమం? తెలంగాణకు ఎవరు శ్రీరామరక్ష.. అని అందరిని ఆలోచించమంటున్న అని పేర్కొన్నారు. 

దేశానికే మార్గదర్శకం కావాలని దళిత బంధు

కుల, మతాలకు అతీతంగా అందరికీ అన్నీ చేసుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నదని తెలిపారు. వెనుకబడ్డ, వివక్షకు గురైన దళిత జాతి మనలాగే మనుషులు కాదా? 75 ఏండ్ల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తే వాళ్ల జీవితాలు బాగుపడేవి కావా? అని అడిగారు. దళితులను బాగుపర్చాలని, కొత్త చరిత్ర సృష్టించాలని, దేశానికే మార్గదర్శకం కావాలని దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేసారు. 

చరిత్రలో ఎవ్వరూ ఆలోచన చేయని విధానాలు 

బీసీ వృత్తి పనుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ఇచ్చేందుకు శ్రీకారం చుట్టాం అని గుర్తు చేసారు. చరిత్రలో ఎవ్వరూ ఆలోచన చేయని విధంగా నాయీ బ్రాహ్మణులు, రజకులకు మద్దతు చేసి 250 యూనిట్ల ఉచిత కరెంటు లాంటి పనులెన్నో చేస్తున్నాం. ఇప్పటివరకు రాజకీయమంటే తమాషాలు చేయడం తప్ప మన మాదిరిగా సమాజాన్ని లోతుగా అధ్యయనం చేసి ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను ఎవరూ చేయలేదు. మనోహర్ రెడ్డి కోరిన కోరికలను నెరవేరుస్తాను. ఆయన్ని లక్ష మెజార్టీతో గెలిపించి పెద్దపల్లిని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోదామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని బలపరిచి, కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేసారు.