గల్ఫ్ కార్మికులకు కూడా బీమా సదుపాయం వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజామాబాద్ (రూరల్) ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ ప్రజలు చెట్టుకొకరు..గుట్టకొకరుగా ఉండె అని గుర్తు చేసారు. అనేక బాధలను అనుభవించినం అని అన్నారు. తెలంగాణ తెచ్చిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి పదేండ్లలో ఎంతో అభివృద్ధిని చేసిందని స్పష్టం చేసారు.
ధరణి తీసేస్తే మళ్లీ మురికి కుంటే..
పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడంటే..మళ్లా దళారుల రాజ్యం, భూకబ్జాలు, పైరవీకారులు, పాత రిజిస్ట్రేషన్ పద్ధతి, పడిగాపులు పడి ఉండాలె.. పట్టా కావాలంటే ఏడాది తిరగాలె. దానికి ముట్టజెప్పేది ముట్టజెప్పాలె. ఇవన్నీ బాధలు మనం చూసినం. నాడు భూమి అమ్మితే..కొంటే..రిజిస్ట్రేషన్ అయితే పట్టా కాదు. మళ్లా ఆర్డీవో ఆపీసుకు పోవాలె..ఇచ్చేటోనికి ఇవ్వాలె.. ఇవ్వాల ఆ బాధ లేకుండా చేసినం అని పేర్కొన్నారు. ధరణితో ఎవరికన్నా సమస్య ఉంటే పరిష్కారం చేద్దాం. దాంతో సమస్య లేదు. ధరణి తీసేస్తే మళ్లీ మురికి కుంట అవుతుంది. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే తీసేస్తా అంటున్నదని ద్వజాపెత్తారు. కృష్ణా, గోదావరి రెండు నదుల మధ్య ఉన్నా కేసీఆర్ వచ్చేవరకు ఇప్పటి వరకు ఎవరికీ మంచినీళ్ల సమస్యను పరిష్కరించే సత్తా లేకుండా పోయింది. గీ మాత్రం ఎవరూ ఎందుకు ఆలోచించలేదు.మంచి పథకాలు ఉండాల్నా? లేక పదేండ్లు పడ్డ శ్రమ వృధా కావాల్నా? మళ్లీ వెనక్కే పోవాల్నా? అనేది ప్రజలందరూ జాగ్రత్తగా ఆలోచించాలని సూచించారు.
మంచిప్ప రిజర్వాయర్ త్వరలో పూర్తి
డిచ్ పల్లిలో లంబాడీ బిడ్డలు ఎక్కువ. ఇక్కడ మా తాండాలో మా రాజ్యం కావాలని ఎన్నో ధర్మాలు చేసిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వమే గ్రామ పంచాయతీలుగా చేసినం అని వెల్లడించారు. మిగిలిన గిరిజనులకు పోడు పట్టాలను అందిస్తాం అని హామీ ఇచ్చారు. గిరిజన రిజర్వేషన్లను 10 శాతం పెంచుకుంటే వారికి విద్యా, ఉద్యోగ అవకాశాలు పెరిగినయి. గిరిజనుల కోరికలను, అభివృద్ధి పనులను ఎవరూ తీర్చలేదు ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప. మంచిప్ప రిజర్వాయర్ అతి త్వరలోనే పూర్తి అవతుంది. ఇజ్రాయిల్ టెక్నాలజీతోని 3 ఎకరాలకు ఒక ఔట్ లెట్ పెట్టి నీళ్లు అందించబడతయని వివరించారు. రిజర్వాయర్ బాధితులకు మంచి నష్టపరిహారం ఇద్దాం అని అన్నారు. బీడీ కార్మికులకు ఏ ప్రభుత్వం ఏం చేయలేదని తేల్చి చెప్పారు. 16 రాష్ట్రాల్లో ఉన్నా ఒక్క తెలంగాణలోనే బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, టేకేదార్లకు పెన్షన్ ఇస్తున్నాం అని పేర్కొన్నారు. నేను చిన్పప్పుడు బీడీ కార్మికుల ఇంట్లో చదువుకున్నా కాబట్టే వాళ్ల బాధలు నాకు తెలుసన్నారు. కొత్తగా నమోదు చేసుకున్న బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు.