mt_logo

కాంగ్రెస్ పార్టీయే దోఖాబాజీ పార్టీ: కరీంనగర్ సభలో సీఎం కేసీఆర్

ఎవరు ఏమన్నా..ఎవరు మొత్తుకున్నా.. ఎవరు ఏడ్చినా..డెఫినిట్‌గా మళ్లా బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తదని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ..  తెలంగాణ ఉద్యమంలో 2001 మే 17న మొట్టమొదటి సింహ గర్జన సభను కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రాంగణంలోనే జరుపుకున్నాం అని గుర్తు చేసారు.  తెలంగాణ రాష్ట్రం తీసుకురాకపోతే..ఉద్యమాన్ని విరమిస్తే..నన్ను రాళ్లతో కొట్టి చంపండి’ అని ఆనాడు ఇదే గ్రౌండ్ నుంచి చెప్పిన అని పేర్కొన్నారు.  ఆనాడు జనమే జనమైన కరీంనగర్ పట్టణమంతా ‘సింహగర్జన సభ’ తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే మొట్టమొదటి ఘట్టం అని తెలిపారు. 

అనేక పథకాలకు కరీంనగర్ వేదిక 

రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా..లాంటి అనేక పథకాలను కరీంనగర్ వేదిక నుంచే ప్రకటించుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు, ఉద్యమ నాయకునిగా వ్యక్తిగతంగా నాకు అనేక విజయాలను అందించిన కరీంనగర్ మట్టికి నేను శిరస్సు వంచి నమస్కారం అని పేర్కొన్నారు.  కాంగ్రెస్ పార్టీయే దోఖా బాజీ పార్టీ. మంచిగున్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏండ్లు మనల్ని ఏడిపించిన పార్టీ కాంగ్రెస్. 1969 లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిపితే 400 మందిని కాల్చి చంపిన పార్టీ కాంగ్రెస్. 2004 లో తెలంగాణ ఇస్తామని మనతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసింది కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీని చీల్చారని ధ్వజమెత్తారు. 

కాంగ్రేసోల్లు మొత్తం కరుగ నాకేసిండ్రు

కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ తెచ్చుడో’… ‘కేసీఆర్ శవయాత్రనో..తెలంగాణ జైత్రయాత్ర’నో..ఏదో ఒకటి జరగాలని నేను మొండికేసి ఆమరణ దీక్షకు శ్రీకారం చుట్టింది కూడా కరీంనగర్ గడ్డ నుంచే అని తెలిపారు. ఆనాడు అలుగునూరు చౌరస్తాలో నన్ను అరెస్ట్ చేసి, తీసుకెళ్లి ఖమ్మం జైల్లో పెట్టారు. తెలంగాణ ఉద్యమం అనేక ఘట్టాల్లో కరీంనగర్ మట్టి, కరీంనగర్ గడ్డ ప్రథమ స్థానంలో ఉండేదన్నారు.  కాంగ్రెస్ రాజ్యంలో చెట్లు నరికుడే తప్ప ఎవరన్నా చెట్లు నాటిండ్రా? అని అడిగారు.  పాత కరీంనగర్ జిల్లాలో ఇద్దరు ఎఫ్ ఆర్వోలు ఉండేంత అడవి ఉండే.. కాంగ్రేసోల్లు మొత్తం కరుగ నాకేసిండ్రు. మళ్లీ మన బీఆర్ఎస్ పాలనలో పటిష్టమైన చట్టం తెచ్చి గ్రామాలు, మున్సిపాల్టీలతో సహా మొక్కలు నాటితే 7 శాతం గ్రీన్ కవరేజి పెరిగింది. మంచి వర్షాలు కురుస్తున్నాయని అభివర్ణించారు. 

రాళ్లు కాయలున్న చెట్ల మీదనే పడుతయ్.. 

ధరణి తీసేస్తాం..పైరవీ, భూకబ్జాలు పెడుతాం అనే దందాతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ వస్తోంది. రైతాంగం ఆలోచించాలని సూచించారు.  గంగుల కమలాకర్ వెంబడి పడి మానేరు రివర్ ఫ్రంట్ కట్టిస్తున్నడు. కరీంనగర్ చౌరస్తాలు, రోడ్లు, సంధులు దుమ్ము ధూళి లేకుండా ఎట్లయినయో చూడాలని సూచించారు. కరీంనగర్ పట్టణం కాదు ఇప్పుడు కరీంనగర్ నగరం అయింది. రూ.400 కోట్లతో మానేరు రివర్ ఫ్రంట్ పూర్తి అయితే కరీంనగర్ పట్టణం బ్రహ్మాండమైన పర్యాటక ప్రాంతంగా మారనున్నదని తెలియజేసారు. రాళ్లు కాయలున్న చెట్ల మీదనే పడుతయ్..  నెత్తిమీదనే డ్యాం ఉంటది..నాడు రెండు మూడు రోజులకు గానీ నీళ్లు రావు.. ఇవ్వాల కరీంనగర్‌లో మంచినీళ్ల పరిస్థితి ఎంతో మంచిగా ఉన్నది. 

ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్

రాబోయే రోజుల్లో 24 గంటల మంచినీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ పెట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా? అని అడిగారు. గతంలో ఎవరన్నా చేసిండ్రా? అని ప్రశ్నిచారు.  ప్రజల్లో గుణాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినం అని వివరించారు. ఎవరు ఏమన్నా..ఎవరు మొత్తుకున్నా.. ఎవరు ఏడ్చినా..డెఫినిట్‌గా మళ్లా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తది. మనం ప్రజలతోని ఉన్నం..ప్రజలు మనతోని ఉన్నరు.. నవంబర్ 30న ప్రజలు తమాషా చూపిస్తరు. ఎవరూ రంది పడాల్సిన అవసరం లేదన్నారు. గంగుల కమలాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని, కారు గుర్తుకు ఓటేయాలని మిమ్మల్ని సీఎం కేసీఆర్ కోరారు.