![](https://i0.wp.com/missiontelangana.com/wp-content/uploads/2023/11/Untitled-Project-3-2.jpg?resize=1024%2C576&ssl=1)
తెలంగాణ గద్దల పాలు కావద్దని సీఎం కేసీఆర్ సూచించారు. నారాయణపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తే పార్టీలు తిమ్మిని బమ్మిని చేయడం గందరగోళ పరిస్థితిలోకి తీసుకెళ్తున్నాయి, దీని నివారణ వెదకాలని సూచించారు. అభ్యర్థుల గుణగణాలు చూడాలి, ఆలోచన చేయాలి, అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ నడవడికను పరిశీలించాలన్నారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారని తెలిపారు.
చేస్తవా చస్తవా అని డిమాండ్లు
నారాయణపేటకు ప్రత్యేకత ఉంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండవ మున్సిపాలిటీగా ఏర్పడ్డదని పేర్కొన్నారు. రాజేందర్ రెడ్డి బాగా హుషారు ఉన్నాడు. జిల్లా చేస్తే ఏమి అడుగ అన్నడు, మెడికల్ కాలేజీ తెచ్చుకున్నడు, అగ్రికల్చర్ కాలేజీ తీసుకువచ్చిండు, ఇంజనీరింగ్ కాలేజీ తీసుకువచ్చిండు. మళ్లీ మందిలో నిలబెట్టి అడుగుతున్నడని చెప్పారు. ఎప్పుడూ ఆయన నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఆలోచిస్తాడు. అందుకే మీ తరపున డిమాండ్లు నా ముందుంచాడు. మళ్లా ఇప్పుడు నన్ను మందిల నిలబెట్టి చేస్తవా చస్తవా అని డిమాండ్లు పెట్టిండని తెలిపారు.
దళిత బంధు వచ్చేదాకా పథకం కొనసాగుతుంది
దళిత బిడ్డలు యుగయుగాలుగా అణచివేతకు, సామాజిక వివక్షకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ దళితుల కోసం మంచి కార్యక్రమం పెట్టుంటే దళితుల పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. అందుకే దళిత బంధు పథకం నేనే తీసుకువచ్చినానని వివరించారు. ప్రతి కుటుంబానికి దళిత బంధు వచ్చేదాకా పథకం కొనసాగుతుందని వెల్లడించారు. రాజేందర్ రెడ్డిని గెలిపిస్తే జిల్లా చేస్తానని చెప్పి జిల్లా చేశాను. సమైక్య రాష్ట్రంలో కృష్ణా నది పారుతున్న నీళ్లకు కరువుండే, కాంగ్రెస్ వల్లనే దుర్భర పరిస్థితి అని ధ్వజమెత్తారు. నేనే పాట రాసిన.. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేది రాకపోయే అని… పేర్కొన్నారు.
నారాయణపేట, మక్తల్‌కు నీళ్లొచ్చే కాలువ మంజూరు
196 కేసులు పాలమూరు మీద వేసిండ్రు అని చెప్పారు. అన్ని కొట్టుడు పోయాయని తెలిపారు. కేసులు పోయాయి కాబట్టి పీడబోయిందన్నారు. నారాయణపేట, మక్తల్‌కు నీళ్లొచ్చే కాలువను కూడా మంజూరు చేసినం. ఏడు ఎనిమిది నెలల్లో పూర్తై నీళ్లొస్తాయి అని అభివర్ణించారు. రాజేందర్ రెడ్డి జయమ్మ చెరువును మరిచినా.. నాకు గుర్తుందని అన్నారు. జయమ్మ చెరువులకు నీళ్లు వచ్చే ఏర్పాటు రాజేందర్ చేస్తాడని తెలియజేసారు. కానుకుర్తి మండలంలో రిజర్వాయర్ కూడా పూర్తవుతుంది. నారాయణపేట మొత్తం పచ్చటి పంట పొలాలు చూడాలని కోరుకుంటున్నా. తప్పక చేస్తా అని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష
గతంలో ముఖ్యమంత్రులు పాలమూరును దత్తత తీసుకుని ఏమి ఇవ్వలే అని ఆగ్రహం వ్యక్తం చేసారు. చివరికి మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లిచ్చాం అని తెలిపారు. భవిష్యత్తులో ముందుకు పోవాలంటే బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుడెవడైన జై తెలంగాణ అన్నరా? పదవుల కోసం కాంట్రాక్టుల కోసం పోటీపడ్డారు కానీ జై తెలంగాణ అనలేదని తేల్చి చెప్పారు. తిక్కరేగి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చిందని గుర్తు చేసారు. ప్రకటన చేసిన తర్వాత మరో ఏడాది ఆలస్యం చేశారు. పిల్లలు చచ్చిపోయాక తెలంగాణ ఇచ్చారని బాధ వ్యక్తం చేసారు. తెలంగాణ గద్దల పాలు కావద్దని కోరారు. ఆగం కావద్దని సూచించారు.