mt_logo

గాంధీ ఆఫీస్ తగులబెట్టుకుంటున్న కాంగ్రెస్.. ఇదే వారి తీరు: సీఎం కేసీఆర్

గాంధీ ఆఫీస్ తగులబెట్టుకుంటున్న కాంగ్రెస్..  ఇదే వారి తీరు అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేసారు. మంథ‌ని నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో టికెట్ల అమ్ముడు.. కొనుడు నడుస్తుంది. మేము అందరినీ కలుపుకుని పోతున్నాం అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో డజను మంది సీఎంలు ఉన్నారు. కర్ణాటకలో ఏం నడుస్తుంది చూస్తున్నాం. కాంగ్రెస్‌లో ఒక విధానం పాలసీ లేదని ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ ది రాష్ట్రానికి ఒక నీతి ఉంటాదన్నారు. ఆ పార్టీ నాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పడతారని ఎద్దేవా చేసారు. ఏ పార్టీ అయినా సీట్ల కోసం పార్టీ భవన్‌కు తాళం వేసుకుంటారా? అని విమర్శించారు.

 బీఆర్ఎస్  పార్టీ అభ్యర్థి పుట్ట మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పీవీ మొదలుపెట్టిన రింగ్‌రోడ్డును పుట్ట మధు పూర్తి చేశారు’’ అని కేసీఆర్‌ తెలిపారు. మంథ‌ని నియోజక వర్గానికి అవరమైతే రూ.1000 కోట్ల ప్రత్యేక నిధితో అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు. బీసీ బిడ్డను గెలిపించాలని మంథని ప్రజలతో పంచాయతీ పెట్టుకుంటా అని బీసీ నాయకుడు ముందుకు సాగాలంటే మీ సహకారం కావాలని,ఈ ఎన్నికల్లో బీసీ బిడ్డ అయిన పుట్ట మధును గెలిపించాలని, బీసీ బిడ్డలు తమ చైతన్యం చూపించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీకి కూడా చరిత్ర ఉందని, తెలంగాణను సర్వ నాశనం చరిత్ర అని విమర్శించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్సే అని, 2004లో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ భుజం మీద గొడ్డలి పెట్టుకొని సిద్ధంగా ఉందని, ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం అంటారని విమర్శించారు. మూడు గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని, కర్ణాటకలో తీపిమాటలు చెప్పి అధికారంలోకి రాగానే 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తమ హైకమాండ్ ఢిల్లీలో లేదని, తమ హైకమాండ్ తెలంగాణలోనే ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.