mt_logo

ఆటో డ్రైవర్లకు ఫిట్‌నెస్, పర్మిట్ ఫీజులు మాఫీ: మానకొండూరు సభలో సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్యాసింజర్ ఆటో డ్రైవర్లకు సుమారు రూ.100 కోట్లు ఫిట్‌నెస్, పర్మిట్ ఫీజులు మాఫీ చేస్తూ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. మానకొండూరు ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. ఆనాడు ఇల్లంతకుంటలో ఎటుచూసినా దుబ్బనే ఉండె అన్నారు. బతుకే లేకుండె. దేవుని దయుంటే వానాకాలం ఒక పంట పండేది. లేకుంటే అదికూడా లేకుండె. పశువులకు గడ్డి కూడా లేక అమ్ముకునే పరిస్థితులుండె అని గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇవ్వకపోగా..బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్ర చేసి, ఉద్యమాన్ని ఆగం చేయాలని చూసిందని ధ్వజమెత్తారు. 15 ఏండ్లు పేగులు తెగేదాక కాంగ్రెస్‌తో కొట్లాడిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని స్పష్టం చేసారు. తెలంగాణ తెచ్చుకున్నంక పరిస్థితులు అధ్వానంగా ఉండె అని తెలిపారు. మంచినీళ్లు, సాగునీళ్లు, కరెంటు లేదు.. చేనేత బిడ్డలు చనిపోయేది. రైతులు ఆత్మహత్యలు చేసుకునేది. నాడు కరీంనగర్ జిల్లా బిడ్డ ఆర్థిక నిపుణుడైన డాక్టర్ జీఆర్ రెడ్డి, ఇతర నిపుణులను పిలిపించి రెండు మూడు నెలలు మేధోమథనం చేసినం. సక్సెస్ అయినం అని పేర్కొన్నారు. 

ఇందిరమ్మ రాజ్యంలో రోడ్లు కూడా సక్కగ లేవు

‘కంటి వెలుగు’ అనే ప్రోగ్రాం వస్తుందని ఎవరన్నా కలలోనైనా అనుకున్నరా?. మన బీఆర్ఎస్ ప్రభుత్వం 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి, 80 లక్షల మందికి కంటి అద్ధాలను ఇచ్చిందని వెల్లడించారు. గతంలో ప్రైవేటు ప్రసూతి దవాఖానాల్లో దోపిడీ విపరీతంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వంల గర్భిణీ స్త్రీలను అమ్మవొడి వాహనాల ద్వారా తీసుకెళ్లి..ప్రభుత్వ హాస్పిటల్స్‌లో భద్రంగా డెలివరీ చేయిస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రోడ్లు కూడా సక్కగ లేకపోతే.. మన ఆడబిడ్డలను హాస్పిటల్స్‌కు మంచాలల్ల తీసుకపోయినం. ఇవ్వాల మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ సాయం చేసినం అని వివరించారు. ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పడకుండా చూసేందుకు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 30 శాతం అలవెన్సులను ఇస్తున్నామని పేర్కొన్నారు. 

ఇండ్లులేని మనిషి లేకుండా చేస్తా.. 

భారతదేశంలో హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చేది ఒక్క మన తెలంగాణలోనే..మన బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇస్తున్నదని తేల్చి చెప్పారు. ఆటో రిక్షా వాళ్లకు ఇండియా మొత్తంలో పన్ను వసూలు చేస్తున్నారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూపాయి పన్ను కూడా లేకుండా చేసిన అన్నారు. రాష్ట్రంలోని ఆటో రిక్షా కార్మికులకు ఎన్నికల తర్వాత ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఫీజులు లేకుండా రద్దు చేస్తా అని హామీ ఇచ్చారు. కరీంనగర్ అమ్మాయినే నేను పెండ్లి చేసుకున్న అని తెలిపారు. కరీంనగర్‌కు నాకు ఏదో వైబ్రేషన్ ఉన్నది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను తాలూకా స్థాయిలో పెడితే స్థానిక యువతకు ఉద్యోగాలొస్తయ్ అని సూచించారు. పనులు దొరుకుతాయి, ఉద్యోగాలు, ఇండ్లు కట్టడం వెంట వచ్చే ఐదేండ్లు వెంటపడదాం. తెలంగాణలో వడ్లు ఎట్లా పడుతున్నాయో..వచ్చే ఐదేండ్లలో ఇండ్ల వెంటపడి ఇండ్లులేని మనిషి లేకుండా చేసుకుందామని తెలియజేసారు.