వాల్మీకి బోయలను ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మక్తల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిణతితో ఓటు వేయాలని కోరారు. పాలమూరు జిల్లాను నాశనం పట్టించిందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. వాల్మీకి బోయలను ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్ర బోయలను ఎస్టీలుగా పెట్టి, తెలంగాణ బోయలను బీసీలుగా పెట్టినాడు, కాంగ్రెస్ మొదటి ముఖ్యమంత్రి చేసిన పాపమే బోయలు అనుభవిస్తున్నారని బాధ పడ్డారు. రెండు సార్లు తెలంగాణలో ఉన్న వాల్మీకి బోయలను మార్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం అని చెప్పారు. వాళ్లు కింద పెట్టుకుని కూర్చున్నారు అని ఎద్దేవా చేసారు.
ఎన్నికల తర్వాత వాల్మీకి బోయల కోసం ఉద్యమం చేసైనా సరే కేంద్రం మెడలు వంచి మేలు చేసే ప్రయత్నం చేస్తానని అన్నారు. బీమా ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాల కల అని పేర్కొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం రాజ్యంలో గెలికి పెట్టినారు తప్ప ఏమీ చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పూర్తి చేసుకున్నాం అని గుర్తు చేసారు. ఈరోజు సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వస్తున్న నీళ్ల తోటి మక్తల్ నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు నీరు అందుతుంది.ఈ నీళ్లతోనే 150 చెరువులు నింపుకుంటున్నాం అని అభివర్ణించారు. అతి ఎక్కువ ఆయకట్టు ఉన్న జిల్లాల లెక్క తీస్తే మక్తల్ నెంబర్ వన్‌గా తెలంగాణలో ఉన్నదని పేర్కొన్నారు.
మీ ఎమ్మెల్యే చిన్నచిన్న కోరికలు కోరినాడు. మీ ఎమ్మెల్యే మాట గట్టిగా ఉంటది. మనసు వెన్న లాంటిది. ఎవరికి ఆపద ఉన్నా పరుగెత్తుకుని వస్తడని వెల్లడించారు. హైదరాబాద్ వచ్చినా ఎంత రాత్రైనా మక్తల్ వస్తడు. హైదరాబా ద్‌లో ఉండేవాడు కాడు, వారి తండ్రి నర్సిరెడ్డి నాకు దగ్గరి మిత్రుడు అని తెలియజేసారు. నర్సిరెడ్డి బాటలోనే మంచి పద్ధతిలో ప్రజా నాయకుడిగా మీ ముందు ఉన్నాడు. రామ్మోహన్ రెడ్డి నాతో కొట్లాడి చాలా అభివృద్ధి పనులు చేసినాడు. రామ్మోహన్ రెడ్డిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించండి, మీరు కోరుకున్న ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌తో పాటు మిగతా డిమాండ్లు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.