mt_logo

కేంద్రం వద్ద అప్పులు తెచ్చి 40 ఏండ్లు తిరిగి చెల్లించని దద్దమ్మ కాంగ్రెస్: సీఎం కేసీఆర్ 

కేంద్ర ప్రభుత్వం వద్ద అప్పులు తెచ్చి 40 ఏండ్లు తిరిగి చెల్లించని దద్దమ్మ కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత.. సీఎం కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..  భద్రాద్రి సీతా రామచంద్ర స్వామి కొలువుదీరిన ఈ పావన భూమికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు. అందుకే జిల్లా పేరు కూడా స్వామి వారి పేరుతో భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం అని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి మన దేశంలో రాలేదు. పరిణితి వచ్చిన దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని తెలిపారు. 

ఆగమాగం వేస్తే ఐదు సంవత్సరాలు ఆగమైతాం.. 

ఎలక్షన్లు వచ్చిన వెంటనే ఆగమాగం, అడవడివి, ఎలక్షన్లు వచ్చిన వెంటనే బూతులు తిట్టుకోవడం, అబద్ధాలు చెప్పడం, సిగ్గు లజ్జా లేకుండా మాట్లాడటం, ఎటుపడితే అటు అబాండాలు వేయడం, మోసపూరిత వాగ్దానాలు చేయడం మన దేశంలో జరిగే తంతు అని అభివర్ణించారు. దేశంలో కూడా రాజకీయ పరిణితి రావాలని పేర్కొన్నారు. చెప్పిన మాటలు పదిమందితో చర్చించాలి. ప్రజల చేతిలో ఉండే వజ్రాయుధం మన ఓటు. దీనిని ఆగమాగం వేస్తే ఐదు సంవత్సరాల పాటు ఆగమైపోతాం అని సూచించారు. 

కాంగ్రెస్ పరిపాలనలో సింగరేణి నష్టం

సింగరేణి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నదని,  తెలంగాణ కొంగు బంగారం మన గనులు అని వివరించారు. సింగరేణి 100 కు వందశాతం మనకే ఉండేది. చేతకాని కాంగ్రెస్ దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వం వద్ద అప్పులు తెచ్చి 40 ఏండ్లు తిరిగి చెల్లించలేదని, యువకులకు  తెలియదన్నారు. దాంతో కేంద్రానికి 49 శాతం వాటా వచ్చింది. లేకుంటే మన గనులు మనకే ఉండేవి. ఇవి నిజాం నాటి గనులు. దీనివల్ల నష్టం జరిగింది. అప్పనంగా కట్టబెట్టారు. సింగరేణి యొక్క నడకనే మార్చినం అని స్పష్టం చేసారు. కాంగ్రెస్ పరిపాలనలో సింగరేణి నష్టం ఉండేది. తెలంగాణ వచ్చిన వెంటనే  3 శాతం తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చాం అని పేర్కొన్నారు. కంపెనీ టర్నోవర్ కాంగ్రెస్ రాజ్యంలో 11 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు  33 వేల కోట్లకు తీసుకుని పోయాం. సింగరేణి లాభాలు రూ. 419 కోట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు లాభాలు 2184 కోట్లకు తీసుకెళ్లాం అని తెలిపారు. గతంలో దసరాకు 60,70 కోట్లు ఉండేది. మనం ఈ దసరాకు సింగరేణి కార్మికులకు పంచినటువంటి లాభం రూ.700 కోట్లు అని వివరించారు. 

నూతనంగా 19463 మందికి ఉద్యోగాలు

తెలంగాణ రాకపూర్వం 6400 ఉద్యోగాలు వచ్చాయి, వచ్చినంక తొమ్మిదన్నరేళ్లుగా నూతనంగా 19463 మందికి ఉద్యోగాలు ఇచ్చినం అని చెప్పారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టిందే కాంగ్రెస్ యూనియన్, సీపీఎం, సీపీఐ యూనియన్‌లు. మనం వచ్చినాంక 15256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం. గతంలో కార్మికులు చనిపోతే లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాం. ఈ రోజు 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నాం. డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకుంటే రూ.25 లక్షలు ఇస్తున్నాం అని పేర్కొన్నారు. 10 లక్షలకు గృహాలకు వడ్డిలేని రుణం ఇస్తున్నామన్నారు. సింగరేణి స్థలాలలో నివాసముంటున్న 22 వేల మందికి పట్టాలు ఇచ్చాం అని అభివర్ణించారు. 

కేసీఆర్ ఉన్నదే తెలంగాణ సమాజం కోసం

గోదావరి ఒడ్డున జైపూర్ వద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టుకున్నాం. దీని పీఎల్ఎఫ్ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్ ఉన్నదే తెలంగాణ సమాజం కోసం అని స్పష్టం చేసారు. అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిమీద ముందుకు సాగుతాం..  సీతారామ ప్రాజెక్టు పూర్తయితే కరువు అనేది మనకు రానేరాదని తేల్చి చెప్పారు. కొత్తగూడెం బంగారు తునక అవుతదని సంతోషం వ్యక్తం చేసారు. వనమా వార్డు నెంబర్ నుంచి మంత్రి వరకు ఎదిగారు. కేసీఆర్ ముఖం చూసి వనమాకు ఓటు వేయాలని అన్నారు. ఆయన మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిగత పని ఆయన ఏనాడు  అడుగలేదు. ఇటువంటి మంచి వ్యక్తి కొనసాగుతే కొత్తగూడెం బాగుపడుద్ది అని చెప్పారు. ఎన్నికల తర్వాత మీ వద్దకు వచ్చి ఇక్కడే రివ్యూలు చేస్తాను. అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిద్దాం అని పేర్కొన్నారు.  భారీ మెజారిటీతో వనమా ను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.